టీడీపీ లాగే శివసేన దూరమైతే మోదీ గతేంటి?

ఒక మిత్ర పక్షం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం!  ఈ మాటలన్నది బీజేపీకి మరో మిత్రపక్షమైన శివసేన! ఈ మద్య కాలంలో ఉద్ధవ్ థాక్రే మోదీ, అమిత్ షాలపై మండిపడటం సాధారణ విషయం అయిపోయింది. అయితే, ఆయన తాజా వ్యాఖ్యలు మాత్రం కాస్త ఆసక్తి కలిగించేవే! శివసేన చీఫ్ థాక్రే అభిప్రాయం ప్రకారం ఆదునిక చాణుక్యులైన మోదీ, అమిత్ షాలు మిత్రపక్షమైన టీడీపీ చేత అవిశ్వాస తీర్మానం పెట్టించుకున్నారు! పరిస్థితి అంతగా దిగజారేలా రాజకీయం నడిపారు. దీన్ని ఎలా చూడాలని ఆయన సూటిగా ప్రశ్నించారు!

 

 

టీడీపీ, శివసేనలు వాజ్ పేయ్ ప్రభుత్వ కాలంలో కూడా కమలదళానికి నమ్మకమైన మిత్రపక్షాలు. అయితే, మోదీ సర్కార్ లో ఈ రెండూ పార్టీలు తీవ్రమైన కష్టాలు, నష్టాలే కాక అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలా మిత్రుల్ని దూరం చేసుకుని మోదీ, షా ఏం లాభం సాధించబోతున్నారో వారికే తెలియాలి. ఇక్కడ ఏపీలో ఎలాగైతే టీడీపీని వ్యతిరేకిస్తూ ఒంటరి పోరుకు బీజేపీ సై అంటోందో మహారాష్ట్రలోనూ అదే చేస్తోంది. ఈ మధ్యే అమిత్ షా మరాఠా బీజేపీ నేతలందరికి ఒంటరి పోరు చేసేందుకు సన్నద్ధం కావాలని సూచించారు. శివసేనకు ఈ మాటలు పుండు మీద కారం చల్లినట్టుగా వుంటున్నాయి. అందుకే, ఉద్ధవ్ విమర్శల తీవ్రత పెంచారు.

 

 

రోజూ ఏదో ఒక విధంగా మోదీని విమర్శిస్తోన్న ఉద్ధవ్ థాక్రే తాజాగా టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం గురించి మాట్లాడారు. సభలో ఆయన పార్టీ అవిశ్వాస తీర్మానానికి మద్దతైతే ఇవ్వలేదు. కానీ, టీడీపీ బీజేపీకి మిత్రపక్షంగా నిలిచిన పార్టీ. ఆ పార్టీనే అవిశ్వాస తీర్మానం పెట్టిందంటే మీరు చేస్తున్న రాజకీయం ఎలా వుందో ఆలోచించుకోండని చురకలు వేశారు థాక్రే. ఆయన మాటలకి కారణం, శివసేనని కూడా మోదీ, అమిత్ షా అంతకంతకూ కార్నర్ చేయటమే. గత కొన్నేళ్లుగా… ముఖ్యంగా, శివసేన స్థాపకుడైన బాల్ థాక్రే మరణం తరువాత వారసుడు ఉద్దవ్ ను బీజేపీ ఆటాడుకుంటోంది. మహాలో ఒకప్పుడు శివసేన ప్రధాన పార్టీగా ఉంటే ఇప్పుడు బీజేపీ అధికార పక్షంగా మారింది. శివసేన తోక పార్టీ అయిపోతోంది. ఇదే ఉద్దవ్ ఆక్రోశానికి కారణం. తమతో దశాబ్దాలుగా స్నేహం కొనసాగిస్తోన్న సాటి హిందూత్వ పార్టీకి కమలదళం ఇస్తోన్న ప్రతిఫలం అసలు వారి అస్థిత్వమే లేకుండా చేయటం!

 

 

శివసేన పార్టీ కోపంతోనో, ఆక్రోశంతోనో కానీ బీజేపీ వ్యతిరేక మాటలు మాట్లాడుతూ అదే పార్టీతో కొనసాగుతోంది. దీన్ని మరాఠీలు ఎలా అర్థం చేసుకుంటారో ఇప్పుడే చెప్పలేం. కానీ, మూకదాడుల వంటి కీలక వివాదాల్లో మోదీ ప్రభుత్వం డిఫెన్స్ లో పడుతోంది. గోరక్షకుల ముసుగులో ఉత్తరాది రాష్ట్రాల్లో కొంత మంది చెలరేగిపోతున్నారు. వారి చేష్టలన్నీ మోదీ ప్రభుత్వానికి అంటుకుంటున్నాయి. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైనా తేడా వస్తే అందుకు ఈ మూక దాడులు కూడా ప్రధాన కారణమే. సరిగ్గా అటువంటి వివాదంలో కూడా శివసేన బీజేపీకి మద్దతు ఇవ్వకుండా విమర్శలకు దిగుతోంది. ఆవులకు వున్న రక్షణ కూడా మనుషులకు , ముఖ్యంగా, స్త్రీలకు లేదంటూ ఉద్దవ్ కేంద్ర ప్రభుత్వాన్ని తూర్పార పట్టారు. ఇది రోజురోజుకి మోదీ, అమిత్ షాలకి తలనొప్పనే చెప్పాలి.

ఒకవైపు టీడీపీ లాంటి మిత్రపక్షాన్ని దూరం చేసుకుని ఏపీలో కనుమరగయ్యే స్థితి తెచ్చుకున్న మోదీ మహారాష్ట్రలో ఎంత మూల్యం చెల్లిస్తారో ముందు ముందు చూడాలి. శివసేన నిత్యం విమర్శలు గుప్పించటం మరాఠా ఓటర్ల మనస్సులో పెద్ద ప్రభావమే చూపవచ్చు!