మరో 8 గంటల్లో రానున్న శివసేన ప్రభుత్వం.. నేటితో మహా రాజకీయాలకు తెర

 

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి మరో 8 గంటల గడువు మాత్రమే మిగిలింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో బిజెపి చేతులెత్తేయడంతో గవర్నర్ శివసేనను ఆహ్వానించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఇచ్చిన గడువు సాయంత్రం ఏడున్నర గంటల వరకే ఉంది.. అందుకే ముందుగా ఎన్సీపీ చీఫ్ పవార్ తోనూ మధ్యాహ్నం తరువాత కాంగ్రెస్ చీఫ్ సోనియాతోనూ సంప్రదింపులు జరపడానికి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పరుగులు తీస్తున్నారు. అంతా అనుకున్నట్లే జరిగితే శివసేన నుంచి తొలిసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు. సాయంత్రానికి పార్టీ చీఫ్ ఉద్దవ్ థాక్రే ప్రమాణ స్వీకారం కూడా చేస్తారు. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగానే శరద్ పవార్ పెట్టిన షరతులకు అనుగుణంగా కేంద్రంలో భారీ పరిశ్రమల శాఖా మంత్రిగా ఉన్న అరవింద్ సావంత్ తో రాజీనామా చేయించింది శివసేన. కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్ ద్వారా ప్రకటించారు అరవింద్ సావంత్. కేంద్రం నుంచి అరవింద్ తప్పుకున్నట్లు ప్రకటించగానే ఒక్కసారిగా మహా రాజకీయాలు ఊపందుకున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు పరిస్థితిని అవకాశంగా మార్చుకోవడానికి సమావేశమవుతున్నాయి. ఈ మధ్యాహ్నం శివసేన నాయకులు రాజ్ భవన్ లో గవర్నర్ తో కూడా సమావేశమవుతారు. ప్రభుత్వం ఏర్పాటుకు మరి కొంత సమయం అడగాలని శివసేన నాయకత్వం భావిస్తోంది. ఇక ఇప్పటికైనా శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో లేదో చూడాలి.