మహారాష్ట్రలో మహా మలుపు... ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన పావులు...

మహారాష్ట్ర రాజకీయాలు మహా మలుపు తిరిగాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ... ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా లేమని సంచలన ప్రకటన చేసింది. తగినంత సంఖ్యాబలం లేనందున రేసు నుంచి తాము తప్పుకుంటున్నట్లు తేల్చిచెప్పింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ పంపిన ఆహ్వానంపై సుదీర్ఘంగా చర్చించిన బీజేపీ... తగినంత సంఖ్యా బలం లేనందున తాము సిద్ధంగా లేమని తెలియజేసింది. గవర్నర్ ను కలిసిన దేవేంద్ర ఫడ్నవిస్ ఈ సమాచారాన్ని తెలియజేశారు.

మరోవైపు, ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ నిరాకరించడంతో... శివసేనకు ఆహ్వానించారు గవర్నర్‌. ఈరోజు రాత్రి ఏడున్నరలోపు తమ నిర్ణయం తెలపాలని శివసేనకు సూచించారు. దాంతో, శివ సైనికుడే... మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని మొదట్నుంచీ చెబుతోన్న శివసేన.... ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతోంది. ఒకవేళ, శివసేన-ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే కాంగ్రెస్ బయటి నుంచి మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దాంతో, మహారాష్ట్ర పరిణామాలపై సోనియా కీలక సమావేశం నిర్వహించనున్నారు. అలాగే, ఎన్సీపీ చీఫ్ పవర్ కూడా, తమ ఎమ్మెల్యేలతో సమావేశంకానున్నారు. అయితే, శివసేనకు మద్దతివ్వాలంటే... ఎన్డీఏ నుంచి బయటికి రావాలని ఎన్సీపీ కండీషన్ పెట్టింది.

288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి 105మంది, శివసేనకు 56మంది, ఎన్సీపీకి 54మంది, కాంగ్రెస్ కు 44మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు 145మంది ఎమ్మెల్యేల బలం కావాల్సి ఉండటంతో... శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే... ఎన్సీపీ అండ్ కాంగ్రెస్ మద్దతు తప్పనిసరి. దాంతో, శివసేన ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, శివసేనకు ఈ రాత్రి ఏడున్నర వరకు మాత్రమే గవర్నర్ టైమివ్వడంతో.... మహా రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరగనున్నాయోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.