మరో రాష్ట్రం హస్తం చేజారిపోతోందా?

 

కాంగ్రెస్ ముక్త్ భారత్… మోదీ చేసిన ఈ నినాదం నిజం అవ్వదులే అని ఎవరైనా భావిస్తుంటే వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేసే పనిలో బిజీగా వుంది హస్తం పార్టీ! అలాగే, దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ కాంగ్రెస్ తరువాతి స్థానంలో జాతీయ పార్టీ హోదాని అనుభవిస్తోంది సీపీఎం. ఇప్పుడు సదరు రెడ్ పార్టీ కూడా డెడ్లీ క్రైసిస్ లోకి జారిపోయిందని నిరూపితం అయింది షిమ్లాలో! అతి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న హిమాలయ రాష్ట్రంలో కాంగ్రెస్ యథావిధిగా మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయింది. సీపీఎం వున్న కొద్ది పాటి పట్టు కూడా కోల్పోయి… బీజేపి ఘన స్వాగతం పలికాయి!

 

ఈ సంవత్సరంలోనే అసెంబ్లీ ఎన్నికలు వున్న హిమాచల్ లో రాజధాని షిమ్లా కాంగ్రెస్ చేజారిపోయింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం హస్తం పార్టీదే. కాని, దేశం మొత్తంలో వీస్తున్నట్టే అక్కడా ఎదురుగాలి వీస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే, హిమాచల్ కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు షిమ్లా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించ వద్దని ప్రయత్నించింది. కోర్టు జోక్యంతో ఎలక్షన్స్ తప్ప లేదు. అప్పటికీ పార్టీ గుర్తుల మీద కాకుండా వ్యక్తిగతంగా పోటీ చేసేలా రూల్ తీసుకొచ్చింది. దాంతో బీజేపీ, కాంగ్రెస్ వర్గాలుగా పోటీ జరగలేదు. అయినా కూడా రెండు పార్టీలు స్పష్టంగా తమ తమ అభ్యర్థులకి మద్దతు పలికాయి. అలా సపోర్ట్ చేసిన వారిలో 17మంది బీజేపి కార్పోరేటర్లు గెలవగా, 13మంది మాత్రమే కాంగ్రెస్ వారు గెలిచారు. ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒక సీపీఎం అభ్యర్థి కూడా గెలిచారు.

 

షిమ్లా మున్సిపల్ కార్పోరేషన్ గెలుపు చరిత్రాత్మకం అంటున్నారు పొలిటికల్ ఎనలిస్ట్స్ . ఎందుకంటే, గతంలో ఎప్పుడూ షిమ్లా బీజేపి కైవసం అవ్వలేదు. 30ఏళ్లుగా అది కాంగ్రెస్ కుంచుకోట! అంతకంటే, ప్రమాదకరం ఏంటంటే… షిమ్లాలో కమలం గెలుపు దాదాపుగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్ని కూడా చెప్పేస్తుందని పండితులు అంటున్నారు! అదే జరిగితే పంజాబ్ గెలుచుకున్న కాంగ్రెస్ మరోసారి పతనం బాటలో దూసుకుపోతున్నట్టే లెక్కా!

 

చల్లచల్లటి షిమ్లాలో బీజేపి గెలుపు… సీపీఎంకి కూడా వేడి పుట్టిస్తోంది! గత షిమ్లా కార్పోరేషన్ ఎన్నికల్లో కామ్రేడ్స్ మేయర్, డిప్యూటి మేయర్ పదవులు గెలుచుకున్నారు! ఈసారి మేయర్ కాదు కదా… కనీసం కార్పోరేటర్లు కూడా ఇద్దరు, ముగ్గురు గెలవలేదు! ఒకే ఒక్క కార్పోరేటర్ గెలిచాడు! అమిత్ షా మార్కు రాజకీయంతో ఆ ఏకైక సీపీఎం కార్పోరేటర్ ఎంత కాలం కాషాయం ధరించకుండా వుంటాడో, వుండనిస్తారో డౌటే!

 

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆకుపచ్చ రాజకీయం, కామ్రేడ్ల ఎర్ర రాజకీయం బీజేపీ కాషాయ రాజకీయంతో వేగలేకపోతున్నాయి. షిమ్లా మున్సిపాలిటీ మరోసారి అదే ఋజువు చేసింది…