టీడీపీలో ట్విస్ట్ లే ట్విస్ట్ లు.. భూమా ఔట్, శిల్పా ఇన్!!

 

'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్' అనే పాట గుర్తుండే ఉంటుంది. ఇప్పుడిదే పాటని కాస్త మార్చి పాడుకుంటున్నారు మన పొలిటీషియన్స్. 'ఏడాదికో పార్టీ మారితే పొరపాటు కాదోయ్' అని పాడుతున్నారు. ఈరోజుల్లో నాయకులు పార్టీలు మారడం చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు ఏ నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడో.. ఎప్పుడు ఏ నాయకుడు ఏ పార్టీలో చేరతాడో తెలుసుకోవడం చాలా కష్టమైపోతుంది. ప్రస్తుతం నంద్యాల రాజకీయం కూడా అలాగే ఉంది. మంత్రి భూమా అఖిల ప్రియ టీడీపీని వీడి జనసేనలో చేరడానికి సిద్దమయ్యారంటూ కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. అఖిల ప్రియ ఈ వార్తలను ఖండించినప్పటికీ.. ఆమె టీడీపీని వీడుతున్నారనే ప్రచారం మాత్రం ఆగట్లేదు. ఇప్పుడు నంద్యాలలో మరో వార్త కూడా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే అఖిల ప్రియ టీడీపీని వీడటానికి సిద్ధమయ్యారని వార్తలు రావడంతో.. శిల్పా బ్రదర్స్ టీడీపీలో చేరడానికి సిద్దమయ్యారట.

2014 ఎన్నికల సమయంలో భూమా ఫ్యామిలీ వైసీపీలో ఉంటే.. శిల్పా ఫ్యామిలీ టీడీపీలో ఉన్నారు. 2014 లో నంద్యాల అసెంబ్లీ నుంచి వైసీపీ తరుపున భూమా నాగిరెడ్డి, టీడీపీ తరుపున శిల్పా మోహన్ రెడ్డి బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి విజయం సాధించారు. తరువాత భూమా ఫ్యామిలీ వైసీపీని వీడి టీడీపీలో చేరింది. భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో నంద్యాలలో 2017 లో ఉపఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో చంద్రబాబు శిల్పాని కాదని భూమా ఫ్యామిలీకే టికెట్ ఇవ్వడానికి మొగ్గుచూపారు. భూమా బ్రహ్మానంద రెడ్డికి టికెట్ ఇచ్చారు. దీంతో శిల్పా టీడీపీని వీడి వైసీపీలో చేరి.. వైసీపీ తరుపున బరిలోకి దిగారు. అయితే ఉపఎన్నికల్లో కూడా శిల్పా ఓడిపోయారు.

ప్రస్తుతం వైసీపీలో కూడా శిల్పా పరిస్థితి బాగాలేదని తెలుస్తోంది. ఎంఐఎం రాబోయే ఎన్నికల్లో వైసీపీకి మద్దతిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. మైనార్టీలు అధికంగా ఉండే నంద్యాల అసెంబ్లీ సీటును ఎంఐఎం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై చర్చలు జరగగా వైఎస్ జగన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో శిల్పా సందిగ్ధంలో పడ్డారు. నంద్యాల టికెట్ ఎంఐఎంకి ఇస్తే తన పరిస్థితి ఏంటని ఆలోచనలో పడ్డ శిల్పాకి.. భూమా కుటుంబం టీడీపీని వీడనుందనే వార్త కొత్త ఆశ తీసుకొచ్చిందట. నంద్యాల టికెట్ ఇస్తానంటే టీడీపీలో చేరడానికి సిద్దమనే సంకేతాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి భూమా ఫ్యామిలీ.. అఖిల ప్రియ చెప్పినట్లు టీడీపీలోనే ఉంటుందా? లేక టీడీపీని వీడి శిల్పా ఫ్యామిలీకి రూట్ క్లియర్ చేస్తుందో చూడాలి.