నేరారోపణలు ఎదుర్కొంటున్న శశీధరూర్ కి కాంగ్రెస్ సానుభూతి !

 


కేంద్ర మంత్రి శశీధరూర్ భార్య సునంద పుష్కర్ రెండు రోజుల క్రితం డిల్లీలో ఒక ప్రముఖ హోటల్ లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన భర్తకు మెహర్ తరార్ ఒక పాకిస్తానీ పాత్రికేయురాలితో వైవాహికేతర సంబంధం ఉందని, ఆమె తమ కాపురంలో చిచ్చుపెట్టినట్లు సునంద ఆరోపించింది. అంతేగాక, మెహర్ తరార్ పాకిస్తానీ గూడచారి సంస్థ ఐ.యస్.ఐ. ఏజెంట్ కూడా అని ఆమె ఆరోపించారు. ఈ నేపధ్యంలో సునంద పుష్కర్ హోటల్ రూములో అనుమానాస్పద పరిస్థితిలోమరణించడంతో, ఆమె భర్త శశీధరూర్ తన నిర్దోషిత్వం నిరూపించుకోవలసి ఉంది.

 

సునంద ఆరోపిస్తునట్లు శశీధరూర్ వైవాహికేతర సంబంధం కలిగి ఉండటం నిజమయితే అదొక నేరము. ఇక కేంద్రమంత్రి వంటి ఒక బాధ్యాతాయుతమయిన పదవిలో ఉంటూ, ఒక పాకిస్తానీ మహిళతో అందునా ఒక పాత్రికేయురాలు, పాకిస్తానీ గూడచారి సంస్థ ఐ.యస్.ఐ. ఏజెంట్ అని ఆరోపింపబడుతున్నవ్యక్తితో సంబంధాలు కలిగి ఉండటం మరో తీవ్రమయిన నేరం. సునంద పుష్కర్ వంటి ఒక మహిళ తన భర్తపై ఊసుపోక ఆరోపణలు చేసి ఆత్మహత్య చేసుకొంటుందని భావించలేము. కానీ, ఆమె ఆరోపణలలో నిజానిజాలు ఎలా ఉన్నపటికీ, వారిరువురి మధ్య పాకిస్తానీ మహిళా కారణంగానే చాలా గొడవలు జరిగాయని, చివరికి అదే ఆమె మరణానికి దారి తీసినట్లు స్పష్టమవుతోంది.

 

ఈ వ్యవహారంలో శశీధరూర్ దోషా, నిర్దోషా? అనే సంగతిని తేల్చవలసింది పోలీసులు. కానీ, సునంద పుష్కర్ మరణం తరువాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సహా మొత్తం కాంగ్రెస్ నేతలందరూ కూడా ఆయనకు సంతాపం తెలిపేందుకు బారులు తీరడంతో అతను నిర్దోషని వారు ముందే దృవీకరిస్తునట్లుంది. ఒక పాకిస్తానీ మహిళతో వైవాహికేతర సంబంధం, భార్య అనుమానస్పద మరణం వంటి రెండు తీవ్ర అభియోగాలను ఎదుర్కొంటున్న శశీధరూర్ ని, ముందుగా మంత్రి పదవిలోనుండి తప్పించి, ఆయనపై విచారణకు ఆదేశించవలసిన కాంగ్రెస్ అధిష్టానం, అతనికి సానుభూతి చూపడం ఒక తప్పయితే, అతనికి తమ మద్దతు ఉన్నట్లుగా వ్యవహరించడం ద్వారా పోలీసు విచారణను, కేసును కూడా పరోక్షంగా ప్రభావితం చేయడం మరో పెద్ద తప్పు. స్వయంగా ఒక మహిళా అయిన సోనియా గాంధీ, సాటి మహిళకు అన్యాయం చేసిన (చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న) వ్యక్తిని స్వయంగా పరామర్శించడం చాలా తప్పని చెప్పవచ్చును. అదే ఒక సాధారణ వ్యక్తి ఇటువంటి నేరారోపణలు ఎదుర్కొంటునట్లయితే సమాజం అతనిని ఇంచుమించుగా వెలివేసినంత పనిచేసేది. మహిళా సంఘాలు కూడా ఉద్యమించి ఉండేవి. కానీ, శశీ ధరూర్ కేంద్రమంత్రి కావడంతో అతనికి మినహాయింపు దక్కిందేమో! అని భావించాల్సి ఉంటుంది.