వాగ్దానాలొకరివి, అమలు చేసేవారువేరొకరూ?

 

జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిలకు ఆ పార్టీలో అధికారికంగా ఏ పదవీ లేకపోయినప్పటికీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె గత కొన్ని నెలలుగా పాదయాత్ర చేస్తున్నారు. ఒక రాజకీయ పార్టీని అభిమానించేవారు ఎవరయినా ఆ పార్టీ కోసం పనిచేయవచ్చును. కనుక ఆమె పాదయాత్రను కూడా ఎవరూ తప్పుపట్టలేరు. కానీ, ఆమె ఆ పార్టీ అధ్యక్షుడి సోదరి అనే ఏకైక అర్హతతో పార్టీ తరపున వాగ్దానాలు గుప్పించడం మాత్రం సహేతుకంగా లేదు. అదేపని, పార్టీ గౌరవద్యక్షురాలిగా ఉన్న ఆమె తల్లి విజయమ్మగారో, లేదా పార్టీలో అధికారిక బాధ్యతలు నిర్వహిస్తున్న మరెవరయినా చేసి ఉంటే సహేతుకంగా ఉండేది. కానీ షర్మిల, పార్టీతో ఏ సంబంధము లేకపోయినా తన సోదరుడు జగన్ తరపున షర్మిల లెక్కలేనన్ని పెద్దపెద్ద వాగ్దానాలు అవలీలగా గుప్పించడం చాలా విడ్డూరం.

 

పార్టీలో ఏ అధికారిక హోదా కలిగి ఉందని ఆమె కేవలం పార్టీ అధ్యక్షుడి చెల్లెలు అనే ఏకైక హోదాతో ఈ విధంగా వాగ్దానాలు చేయడమంటే, పార్టీని కుటుంబ వ్యవహారం గా చూస్తున్నారు తప్ప ఒక రాజేకీయ వేదికగా భావించడంలేదని అనుకోవాల్సి ఉంటుంది. అటువంటప్పుడు ఇప్పుడు ఆమె చేస్తున్న వాగ్దానల్లన్నీ కూడా నీటి మీద వ్రాతలే అనుకోక తప్పదు. ఇందుకు మరో ప్రత్యామ్నాయం ఏమిటంటే, పార్టీలో అధికారికంగా ఏదో ఒకపదవి చేప్పట్టి ఆప్పుడు ఇటువంటి వాగ్దానాలు పుంకానుపుంకాలుగా చేసుకోవచ్చును. లేదా పనిలోపనిగా ఆమె ఇప్పుడు (తన సోదరుడి తరపున) ప్రజలకు చేస్తున్నవాగ్దానాలను, అతను ఖచ్చితంగా అమలుచేస్తాడని లేదా తనే స్వయంగా అతనిచేత అమలు చేయిస్తానని, మరో ప్రత్యేక వాగ్దానం కూడా చేస్తుండటం మంచిది.

 

రాజకీయపార్టీలు అధికారికంగా చేస్తున్న వాగ్దానాలకే దిక్కు లేన్నపుడు, పార్టీతో ఏ సంబందమూ లేని ఆమె చేస్తున్న వాగ్దానాలను, వేరొకరు ఎలా అమలుచేస్తారని ఆలోచిస్తే, ఇదంతా ఎంత నిరుపయోగమయిన కార్యక్రమమో అర్ధం అవుతుంది. ఆమె తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డి జైల్లో ఉన్న కారణంగా తమ పార్టీని బ్రతికించి ఉంచుకోవడానికి మాత్రమే పాదయాత్రలు చేస్తూ, పార్టీని గురించి ప్రచారం చేసుకొంటూ, అధికార పార్టీని విమర్శించుకొంటూ ముందుకు సాగిపోవచ్చును. ఇంకా ఆసక్తి ఉంటే,  కానీ ఈవిధంగా తన నోటికొచ్చిన వాగ్దానాలు ఎడాపెడా చేసుకుపోవడం, ప్రజలను తన అన్నకు ఓటేయమని కోరడం, అతనికి ఓటేస్తే తన వాగ్దానాలన్నిటినీ అతను నేరవేరుస్తాడని చెప్పడం విచిత్రంగా ఉంది.

 

ఉదాహరణకు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గనుక, అతను చేసే వాగ్దానాలకు అధికారికంగా చేసినవని చెప్పవచ్చును. (వాటిని అతను అమలు చేస్తాడా లేదా అనేది తరువాత సంగతి) కానీ, అదే అతని కుమారుడు లోకేష్ పాదయాత్రలు చేసి వాగ్దానాలు చేసినట్లయితే మాత్రం వాటికి విలువ ఉండదు.

 

కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీకి మొదటి నుండే ఒక అధికారం కట్టబెట్టారు. గనుక, అతని వాగ్దానాలకు కూడా అధికారికమయినవే అవుతాయి. ప్రస్తుతం అతను పార్టీ ఉపాద్య్యక్షుడు కూడా అయ్యాడు గనుక, అతని ప్రతీ వాగ్దానం కూడా పూర్తీ అధికారికంగా చెలామణి అవుతాయి.

 

కనుక, షర్మిల కూడా పార్టీలో అధికారికంగా ఏదయినా పదవి పుచ్చుకొని, అప్పుడు ఇటువంటి వాగ్దానాలు చేస్తే సబబుగా ఉంటుంది. లేకుంటే, ఆమె ప్రజలను మభ్య పెట్టె ప్రయత్నం చేస్తున్నట్లు భావించవలసి ఉంటుంది.