మత్స్యకారుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ!!

 

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కేరళలోని త్రిస్సూర్‌లో నిర్వహించిన నేషనల్‌ ఫిషర్‌మెన్‌ పార్లమెంట్‌ సమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాల్గొని మత్స్యకారులతో మాట్లాడారు. ప్రధాని మోదీ దేశంలో ఉన్న రైతులు, మత్స్యకారులు, చిన్న వ్యాపారుల గురించి ఏనాడూ పట్టించుకోలేదని.. కేవలం ధనవంతులు, పారిశ్రామికవేత్తలైన అనిల్‌ అంబానీ, నీరవ్‌ మోదీ లాంటి వారికే అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు.

'బీజేపీ ప్రభుత్వ పాలనలో నీరవ్‌ మోదీ, అనిల్‌ అంబానీ లాంటి వారు నేరుగా ప్రధానితో మాట్లాడి, వారికి కావాల్సింది పది సెకన్లలో చేయించుకుంటారు. ఈ విషయంలో వారు ఎలాంటి శ్రమ పడాల్సిన పనిలేదు. ఎక్కడో ఉన్నవారు చిన్న చిటికె వేస్తే చాలు, ప్రధానికి విషయం అంతా తెలిసిపోతుంది. ఇదే పరిస్థితి మత్స్యకారులు, చిన్న వ్యాపారులు, రైతుల విషయంలో లేదు. వారు ప్రభుత్వం ముందు గట్టిగా అరవాల్సి ఉంటుంది. అప్పటికీ వింటారనే నమ్మకం లేదు.' అని రాహుల్ మోదీని ఉద్దేశించి విమర్శించారు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాల్లో హాయిగా తలదాచుకుంటున్న విజయ్‌ మాల్యా విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీపై ధ్వజమెత్తారు.

ఈ సమావేశానికి వచ్చిన మత్స్యకార సంఘాల ప్రతినిధులు వారి సమస్యలను రాహుల్‌ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన.. ప్రధాని మోదీలా నకిలీ వాగ్దానాలు చేయనని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే మత్స్యకారుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఏదైనా చేయాలని నిర్ణయం తీసుకున్నాకే నేను మాట్లాడుతాను తప్ప వట్టి మాటలు చెప్పను అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.