జగన్ తప్పు చేస్తున్నారా.. అవినీతి మరకలు వచ్చి చేరుతున్నాయా?

 

వైసీపీ అధినేత జగన్ గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. కొద్దినెలల జైల్లో కూడా ఉన్నారు. ఆయనతో పాటు కొందరు అధికారులు కూడా జైలు పాలయ్యారు. అయితే జగన్ అధైర్యపడలేదు. తనని అన్యాయంగా జైల్లో పెట్టారని ప్రజల్లోకి వెళ్లారు. 2014 ఎన్నికల్లో అడుగు దూరంలో అధికారానికి దూరమయ్యారు. అయినా జగన్ ప్రజల్లో ఉండడానికే ప్రయత్నించారు. జగన్ పై ప్రజల్లో నమ్మకం పెరిగింది. 2019 ఎన్నికల్లో వైసీపీకి బ్రహ్మరథం పట్టారు. జగన్ ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం కూడా చేయబోతున్నారు. ఇప్పటికే జగన్ 6 నెలల్లో మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటానని.. ఎన్నికల్లో విజయానంతరం ప్రకటించారు. అయితే జగన్ సీఎంగా మంచి పేరు తెచ్చుకోవడానికి కన్నా ముందే పాత అవినీతి ఆరోపణల మరకలు వచ్చి చేరి ఆయన ఇమేజ్ ను దెబ్బ తీసేలా ఉన్నాయి.

అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన చుట్టూ ఉన్న అధికారులు నెమ్మదిగా మళ్ళీ జగన్ చుట్టూ చేరుతున్నారు. వారు ప్రస్తుతం తెలంగాణలో పని చేస్తున్నా ఏపీ కేడర్ కు బదిలీ కావడానికి డిప్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరిలో కొందరు జగన్ అవినీతి కేసులలో నిందితులు కూడా ఉన్నారు. గనుల కేటాయింపు విషయంలో ఆరోపణలు ఎదురుకున్న అప్పటి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి ప్రస్తుతం తెలంగాణలో విధులు నిర్వహిస్తూ, ఏపీ కేడర్ కు బదిలీ కావడానికి డిప్యుటేషన్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే దీనివల్ల జగన్ పై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని, అదే జరిగితే అంతా బాగుందనుకున్న టైంలో ఆయన అనవసరంగా చెడ్డ పేరు తెచ్చుకున్నట్లు అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సరైన పాలనతో గతంలో తన మీద ఉన్న మచ్చలు తుడుచుకునే ప్రయత్నం చెయ్యాల్సింది పోయి మళ్ళీ వారినే తెచ్చి పెడితే అనవసరమైన వివాదాలకు కేంద్రబిందువు కావడమే అవుతోంది. మరి ఆరు నెలల్లో మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటానంటున్న జగన్.. అవినీతి ఆరోపణలు ఉన్నవారిని దగ్గర చేర్చుకొని అనవసరంగా తలనొప్పులు తెచ్చుకుంటారో.. లేక అలాంటి వారిని దూరం పెట్టి ప్రజల నమ్మకాన్ని నిజం చేస్తూ మంచి పాలన అందిస్తారో చూద్దాం.