ఇదేనా మీరు సాధించింది?

 

 

 

రాష్ట్ర విభజనకు నిజాయితీతో, చిత్తశుద్ధితో, నిస్వార్థంగా కృషి చేసినవాళ్ళు ఎవరని ప్రశ్నించుకుంటే సమాధానం ఏ టీఆర్ఎస్ నాయకులనో, వివిధ పార్టీల తెలంగాణ నాయకులనో సమాధానం రాదు.. సీమాంధ్ర కేంద్ర మంత్రులేనన్న సమాధానం ఎవర్నడిగినా వస్తుంది. రాష్ట్ర విభజనను అడ్డుకోవాల్సిన వాళ్ళు బర్త్ డే కేక్ కోసినంత ఈజీగా రాష్ట్ర విభజన జరగడానికి సహకరించడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? రాష్ట్ర విభజను ముక్తకంఠంతో వ్యతిరేకించాల్సింది పోయి పదవులే పరమార్థమని నోళ్ళు మూసుకుని కూర్చున్నారు.

 

సమైక్య గళాన్ని, నిరసనను కేంద్రానికి వినిపించాల్సింది పోయి మీ ఇష్టమొచ్చినట్టు విభజించి పారేయండి... మాకు మాత్రం వచ్చే ఎన్నికలలో సీట్లు, మంత్రి పదవులు మాత్రం రిజర్వ్ చేసేయండని తమ ప్రవర్తనతో చెప్పకనే చెప్పేశారు. దీనికితోడు రాష్ట్ర విభజన జరగదని, రాష్ట్ర విభజన జరిగినా సీమాంధ్రకు అన్యాయం జరగదని, అదని, ఇదనీ చెబుతూ సీమాంధ్రుల చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టేశారు. ఉప్పెనలా లేచిన సమైక్య ఉద్యమాన్ని చల్లబరచడానికి తామవంతు కృషి చేశారు. సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న వాళ్ళని నానా మాటలూ అన్నారు.



నిన్నగాక మొన్న ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు మీద చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేయడం దీనికొక ఉదాహరణ. అశోక్ బాబు మీద ఆగ్రహం వ్యక్తం చేసే సమయంలో కేంద్ర మంత్రి  చిరంజీవి గారి హావభావాలు చూస్తే నిజంగానే రాష్ట్ర విభజన జరగదేమో, ఈయనగారే కేంద్రం మనసు మార్చే ప్రయత్నంలో సీరియస్‌గా వున్నారేమో అన్న నమ్మకం కలిగింది. ఎంతైనా మెగాస్టార్ కదా! ఇక పనబాక లక్ష్మి, పురంధేశ్వరి, కావూరి.. ఇలా ఎవరికి వారు విభజన డ్రామాలో తమ తమ కేరెక్టర్లని విజయవంతంగా పోషించి రక్తి కట్టించారు. సీమాంధ్ర ప్రజల కళ్ళలోంచి రక్తం కారేలా చేశారు. అంతా చేసి ఇప్పుడు మళ్ళీ వీళ్ళ విభజన డ్రామాలో రాజీనామాల అంకానికి తెర లేపారు. అయితే సీమాంధ్ర ప్రజలు మాత్రం ఈసారి వీళ్ళ డ్రామాలను చూస్తూ ఊరుకోరు.