వీడియోగేమ్‌తో మతిమరపు మీద పరిశోధన

 

పోకెమాన్‌గో లాంటి వీడియోగేమ్స్‌తో ఇప్పటి యువత వెర్రెత్తిపోతోందని పెద్దలు తిట్టుకోవచ్చుగాక! కానీ సాంకేతికతను ఉపయోగించుకునే నేర్పు తెలియాలే కానీ ఆ వీడియోగేమ్స్‌తోనే అద్భుతమైన పరిశోధనలు చేపట్టవచ్చునని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు.

 


దారి తప్పిపోతారు
మతిమరపు అనే మాట చాలా చిన్న పదమే కావచ్చు. కానీ అది ఒక వ్యాధిగా పరిణమించినప్పుడు జీవితం నరకప్రాయమవుతుంది. ముఖ్యంగా అల్జీమర్స్ వంటి మతిమరపు వ్యాధులతో మనిషి తన జీవితాన్నే మర్చిపోయే పరిస్థితి వస్తుంది. సాధారణంగా మనిషి తను రోజూ వెళ్లే చోటుకి కూడా వెళ్లలేక దారితప్పిపోతుంటే, అతనిలోని మతిమరపు తీవ్రరూపాన్ని దాల్చిందని తెలుసుకుంటారు. అందుకనే ఇలా దారి తప్పిపోవడం/ కనుక్కోవడం అన్న సూత్రం ఆధారంగా బ్రిటన్‌ శాస్ర్తవేత్తలు ఒక వీడియోగేమ్‌ను రూపొందించారు.

 

Sea Hero Quest

 


ఇదే ఈ వీడియో గేమ్ పేరు. ఇందులో ఒక వయసు మళ్లిన నావికుడు తన గమ్యాన్ని మర్చిపోతాడు. మనం అతనికి సాయపడుతూ తిరిగిన అతని దారులన్నింటినీ గుర్తుచేయడమే ఈ ఆటలోని లక్ష్యం. ఇందులో భాగంగా ద్వీపాలను చుట్టుకుంటూ, మంచుకొండలను తప్పించుకుంటూ నావని నడిపించాల్సి ఉంటుంది. మధ్యమధ్యలో మన బంధువులకు నావ ఉనికి తెలిసేలా ఆకాశంలోకి తారాజువ్వలను వదలడం, కొన్ని సూచనల ఆధారంగా దిశను మార్చుకోవడం చేస్తుండాలి.

 

పాతిక లక్షలమంది ఆటగాళ్లు


3D టెక్నాలజీ ఏ వీడియోగేమ్‌కీ తీసిపోని విధంగా ఈ Sea Hero Quest సాగుతుంది. అందుకనే దీనిని ఏకంగా పాతిక లక్షలమంది డౌన్లోడ్‌ చేసుకుని ఆడారు. ఆటగాళ్లు ఈ ఆటని ఆడేటప్పుడు వారి ప్రతీ చర్యా రికార్డు అవుతుంది. అది పరిశోధకులకు చేరుతుంది. దాని ద్వారా వేర్వేరు వయసులవారిలో ‘సరైన దారులని కనుక్కోగలగడం’ అనే సామర్థ్యం ఎంతమేరకు ఉందో పరిశీలించే అవకాశం ఉంది. అంతేకాదు! దారులను గుర్తుంచుకోవడంలో స్త్రీ పురుషుల మధ్య ఏమన్నా వ్యత్యాసం ఉందేమో గ్రహించగలుగుతారు. ఇంకా వేర్వేరు దేశాల వారి మధ్య ఈ నైపుణ్యంలో ఏమన్నా తేడా ఉందేమో తెలిసిపోతుంది.

 


ఇవీ ఫలితాలు!


మనుషులలో మతిమరపుని గమనించడం అనే అత్యంత క్లిష్టమైన పరిశోధన Sea Hero Quest ద్వారా అతి సులువుగా సాగిపోయిందంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే ఈ ఆటని రెండు నిమిషాలపాటు ఆడితే అది ల్యాబొరేటరీలో 5 గంటలు పరిశోధన చేసినదానితో సమానమట. అలా దాదాపు 9,500 సంవత్సరాలతో సమానమైన ఫలితాలను శాస్త్రవేత్తలు సాధించగలిగారు. వాటిని నిశితంగా గమనించేందుకు చాలా సమయమే పడుతుంది. కానీ ప్రాథమిక ఫలితాలు మాత్రం ఇవీ...

 


- 19 ఏళ్ల నుంచి దారిని గుర్తుంచుకొనే సామర్థ్యం నిదానంగా తగ్గిపోతుందట. 19 ఏళ్ల వయసులో 74 శాతంగా ఉన్న ఈ సామర్థ్యం 75 ఏళ్లు వచ్చేసరికి కేవలం 46 శాతమే ఉంటుంది.


- దారిని గుర్తుంచుకోవడంలో ఆడవారికంటే మగవారి నిపుణుత ఎక్కువగా ఉంటుందని తేలింది. అయితే ఇది స్వతహాగా వారు బయటతిరగడం వల్ల ఏర్పడిందా లేకపోతే తరచూ వీడియోగేమ్స్‌ ఆడటం వల్ల వాళ్లు లక్ష్యాన్ని ఛేదించగలిగారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది.


- నార్డిక్‌ దేశాలు అనబడే డెన్మార్క్‌, స్వీడన్‌ వంటి దేశ ప్రజలు మిగతావారితో పోలిస్తే త్వరగా దారిని పోల్చుకుంటారని బయటపడింది. బహుశా ఈ సామర్థ్యం వారి జన్యువులలోనే నిక్షిప్తం అయి ఉంటుందని భావిస్తున్నారు.

 


ఏది ఏమైనా ఈ Sea Hero Quest మతిమరపు మీద సరికొత్త విశ్లేషణలకు ఆస్కారం ఇస్తోంది. దీని ద్వారా అల్జీమర్స్‌ వంటి వ్యాధులను తొలిదశలోనే గుర్తించి వాటికి చికిత్సను మొదలుపెట్టే మార్గాన్ని సుగమం చేస్తోంది. అసలు మతిమరపు ఎందుకు ఏర్పడుతుంది? దానిని నివారించే అవకాశం ఏదన్నా ఉందా? అనే ప్రశ్నలకు జవాబులను వెతికే ప్రయత్నమూ ఈ పరిశోధనతో ఊపందుకున్నట్లయ్యింది.

 

 

- నిర్జర.