పాఠశాల త్వరగా మొదలవుతుందా అయితే ఇబ్బందే!

 

మీ పిల్లల పాఠశాల త్వరగా ప్రారంభమవుతున్న కారణంగా తగినంత నిద్ర సరిపోవడం లేదా? అయితే, కాస్త జాగ్రత్త వహించండి. ఎందుకంటే, మీ పిల్లలలో డిప్రెషన్ మరియు ఆందోళన వంటివి అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఉదయం 8.30 గంటలకు ముందుగా పాఠశాల మొదలవుతున్న పిల్లలకు, శరీరం సక్రమంగా పనిచేయడం కోసం అవసరం అయిన 8-10 గంటల నిద్ర అవకాశం లేకపోవడం మూలాన రకరకాల సమస్యలు వచ్చి పడుతున్నాయి.

 

ఒక రీసెర్చ్ ప్రకారం, రాత్రి మంచి నిద్ర పొందడానికి ఒక విద్యార్ధి అన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా, త్వరగా పాఠశాల వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు విపరీతమయిన మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. అయితే, పాఠశాల ఆలస్యంగా మొదలయ్యే యువకులు అన్ని విషయాల్లో చురుగ్గా ఉన్నారని వెల్లడయింది.

 

పాఠశాల సమయాలు నిద్ర అలవాట్లను మాత్రమే కాకుండా శరీరం యొక్క రోజువారీ పనితీరును కూడా ప్రభావితం చేస్తాయి. ఇది యుక్తవయస్సులో ఊబకాయం, గుండె వ్యాధి మరియు ఇతర ప్రధాన సమస్యలను తీవ్రతరం చేస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, ఎనిమిది నుండి పది గంటలు నిద్ర పోవడం, కెఫిన్ ని తక్కువగా తీసుకోవడం, టెలివిజన్, సెల్ ఫోన్ మరియు వీడియో గేమ్లను నిద్రకి ఉపక్రమించడానికి ముందు ఆఫ్ చేయడం వలన నాణ్యమయిన నిద్ర పొందడమే కాకుండా తద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

 

పరిశోధకులు దేశవ్యాప్తంగా 14 మరియు 17 ఏళ్ల మధ్య 197 విద్యార్ధుల నుండి డేటాను సేకరించేందుకు ఒక ఆన్లైన్ సాధనాన్ని ఉపయోగించారు. వాళ్ళు ఈ పరిశోధనలో గమనించింది ఏంటంటే, మంచి నిద్ర మూలంగా విద్యార్థుల్లో డిప్రెషన్ మరియు ఆందోళన సమస్యలు తక్కువగా వస్తాయి.

 

ఉదయం 8.30 తర్వాత పాఠశాలకు వెళ్లే విద్యార్థుల్లో ఈ లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు.