దిశ నిందితుల ఎన్‌‌కౌంటర్ పై సుప్రీం కీలక నిర్ణయం

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పూర్‌కర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. సిర్పూర్‌కర్ తో పాటు వీఎన్ రేఖ, సీబీఐ మాజీ అధికారి కార్తికేయన్ సభ్యులుగా ఉంటారు. ఆరునెలల్లో విచారణను పూర్తిచేయాలని సుప్రీం ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. దిశ ఎన్‌కౌంటర్‌పై అన్నికోర్టులలో దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు స్టే విధించింది.
 
తెలంగాణ ప్రభుత్వం తరఫున మాజీ అడ్వకేట్ జనరల్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కమిటీ ఏర్పాటును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్‌కౌంటర్ వెనక ఎలాంటి దురుద్దేశం లేదని తెలిపారు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారని వివరించారు. దిశ మొబైల్ ఇస్తామని చెప్పి రాళ్లతో దాడి చేశారని.. ఆ తరువాత తుపాకీ తీసుకొని కాల్పులు జరిపారని, దీంతో పోలీసులు కాల్పులు జరపడంతో నిందితులు చనిపోయారని పేర్కొన్నారు. ఘటనపై ఇప్పటికే జాతీయ మావన హక్కలు కమిషన్ విచారణ జరిపిందని రోహత్గి గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం సిట్‌తో దర్యాప్తు జరిపిస్తోందని చెప్పారు. ఈ సమయంలో మరో విచారణ కమిటీ అవసరం లేదని సూచించారు. కానీ సీజేఐ బాబ్డే.. ఈ వాదనలను అంగీకరించలేదు. నిజానిజాలు ప్రజలకు తెలియాల్సి ఉందని.. ఎన్‌కౌంటర్ జరిగిన తీరుపై అనుమానాలు తొలగించాల్సిన అవసరం ఉందని సీజేఐ వ్యాఖ్యానించారు. తాము ఏర్పాటుచేసిన  విచారణ కమిటీకి తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. సిట్ దర్యాప్తుతో పాటు సమాంతరంగా విచారణ జరుగుతుందని తెలియజేసింది. సిట్ తన దర్యాప్తు వివరాలను విచారణ కమిటీతో పంచుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది.