దేశ భవిష్యత్తు కోసమే మా కలయిక

 

బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటిని ఏకతాటిపైకి తెచ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు జాతీయ స్థాయి నేతలతో భేటీ అవుతున్నారు.ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు భేటీ అయ్యారు.భేటీలో బీజేపీ వ్యతిరేక కూటమి సహా తెలంగాణలో పొత్తు పై చర్చలు జరిపారు.భేటీ అనంతరం రాహుల్ గాంధీ,చంద్రబాబు ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు మాట్లాడుతూ..నేడు మన దేశాన్ని కాపాడవలసి ఉందన్నారు. ఇది ప్రజాస్వామికంగా తప్పనిసరి పరిస్థితి అన్నారు. అన్ని పక్షాలు కలిసి రావలసిన అవసరం ఉందన్నారు. తాను 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ఇటువంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని పార్టీలూ కలిసి రావలసిన సమయం ఆసన్నమైందన్నారు.కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమని, ఇతర పార్టీలు కూడా కలిసి వస్తున్నాయని, అన్ని పార్టీలు కలిసి కూర్చొని దేశ ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికల పొత్తుల గురించి ఆలోచిస్తామని అన్నారు. ప్రస్తుతం దేశాన్ని రక్షించడమే తమ కర్తవ్యమన్నారు.

రాహుల్ గాంధీ మాట్లాడుతూ...దేశ భవిష్యత్తును కాపాడవలసి ఉందన్నారు. మన దేశానికి ప్రస్తుతం చాలా సంక్లిష్ట సమయమని చెప్పారు. ఎన్నికల పొత్తుల గురించి మీడియా ప్రశ్నలపై రాహుల్ స్పందిస్తూ మీడియాకు సెన్సేషనలిజం కావాలన్నారు. దేశంలోని ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను కాపాడటమే ముఖ్యమని, తాము దాని గురించే ఆలోచిస్తున్నామని అన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంపై దర్యాప్తు చేయగలిగిన దర్యాప్తు సంస్థలపై దాడులు జరుగుతున్నాయన్నారు. రాఫెల్ లో అవినీతిని ప్రజలు తెలుసుకోవాలన్నారు. బీజేపీని ఓడించడమే లక్ష్యమన్నారు. పార్టీల మధ్య గతంలో జరిగిన అంశాలను మర్చిపోవాలని నిర్ణయించామన్నారు.అంతా కలిసి బీజేపీని ఓడించేందుకు ప్రయత్నించాలని నిర్ణయించామన్నారు.రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోందన్నారు. అన్ని వివరాలను సరైన సమయంలో తెలియజేస్తామన్నారు. యువత ముందు ఉన్న అతి పెద్ద సమస్యలు ఉపాధి కల్పన, అవినీతి అని తెలిపారు. నరేంద్ర మోదీ బహిరంగంగా మాట్లాడటానికి ఇకపై చాలా కష్టమని వ్యాఖ్యానించారు.