నిస్సిగ్గుగా అవినీతి..

 

ఒకప్పుడు జైలుకి వెళ్లినవారిని సమాజం వింతగా చూసేది. జైలు నుంచి తిరిగివచ్చినా కూడా వారిని జనజీవనంలో చేర్చుకునేవారు కాదు. మరీ ఇంతటి పక్షపాతం కాస్త బాధాకరమే అయినా... తప్పు చేసిన మనిషిలో ఎలాగైనా పశ్చాత్తాపాన్ని రగిలించాలన్నదే కారాగారాల ఉద్దేశం. కానీ ఇప్పుడో! పరిస్థితులు మారిపోయాయి. జైలుకి వెళ్లినవాడు అదేదో ఉత్సవానికి బయల్దేరినట్లుగా కోలాహలంగా బయల్దేరుతున్నాడు. అక్కడి నుంచే తనకు కాగల కార్యాలన్నింటినీ చక్కబెట్టుకుంటున్నాడు. ఇక తిరిగి వచ్చిన తరువాత ఏదో రాచకార్యం మీదనో, స్వాతంత్ర్య ఉద్యమంలోనో పాల్గొని వచ్చినవాడిలా రొమ్ము విరుచుకుని తిరుగుతున్నాడు. తాజాగా తమిళుర చిన్నమ్మ శశికళ ప్రవర్తనే ఇందుకు ఓ ఉదాహరణ.

 

బెంగళూరు సెంట్రల్ జైలులో గడపవలసిన శశికళ ఓ నాలుగేళ్లకు సరిపడా డ్రామాను రంగరించి బయల్దేరారు. వేదనిలయాన్ని జాగ్రత్తగా చూసుకోమంటూ అప్పగింతలను అందించి, జయలలిత సమాధి వద్దకు చేరుకున్నారు. అక్కడ టీవీ ఛానళ్లకు కనువిందు చేసేలా వీరశపథాలు చేసి, సమాధిలోని జయలలితను ఓ మూడుసార్లు తట్టారు. ఈ వీధిభాగోతాన్ని మరింత రసవత్తరంగా మార్చేందుకు రోడ్డు మార్గం గుండా బెంగళూరుకి పయనమయ్యారు. అలాగని పోనీ శశికళమ్మ, జయలలిత ఆశయాలకు అనుగుణంగానే ప్రవర్తిస్తున్నారా అంటే అదీ లేదయ్యే! వెళ్తూ వెళ్తూ జయ ఈసడించి పార్టీ నుంచి వెళ్లగొట్టిన తన బంధువు దినకరన్‌కు పార్టీ బాధ్యతలను అప్పగించారు.

 

అక్రమ ఆస్తుల కేసులో శశికళకు సుప్రీం మొట్టికాయలు వేసి మరీ జైలులోకి నెట్టిన విషయం ప్రపంచమంతా గ్రహించింది. కానీ ఇదేదో వీరపోరాటంలా శశికళ బిల్డప్‌ ఇవ్వడం ఏమిటి? దానికి జనం హోరుమంటూ ఆమెకు మద్దతుగా నిలవడం ఏమిటి? ఆఖరికి శశికళ జైలుకి వెళ్లినా కూడా ఆమె మాటే చెల్లుబాటయ్యేలా, ఆమె విధేయుడైన పళిని ముఖ్యమంత్రి కావడం ఏమిటి? ఇదంతా చూస్తుంటే లోపం ఎవరిలో ఉందో అన్న మీమాంస మొదలవ్వక తప్పదు.

 

రాజకీయాలు మనకెందుకని మనం ఎప్పుడైతే వాటికి దూరంగా ఉన్నామో, ఎందుకూ పనికిరానివారంతా అందులోకి ప్రవేశించడం మొదలుపెట్టారు. సహజంగానే ఇలాంటివారిలో నైతిక విలువలు ఉంటాయని ఆశించడం కష్టం. కాబట్టి జనం కూడా రాజకీయాలలో అవినీతి సహజమే అన్న దృక్పథంతో నిండిపోయారు. ఫలితంగానే మనం చూస్తున్న భాగోతాలు! పనికిమాలిన నాయకులు ప్రజల కోసం కాకుండా కేవలం అధికారంలోకి రావడం కోసమే ప్రయత్నించడం. అలా అడ్డదారినా, దొడ్డిదారినా, డబ్బుదారినా అధికారంలోకి వచ్చిన తరువాత అందినంత మేరా దోచుకోవడం ఓ క్రతువులా మారిపోయింది. ఒకవేళ తాము చేసిన అవినీతి బయటపడి, కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చినా... పెద్దగా సిగ్గుపడాల్సిన పనిలేకుండా పోయింది. ఏదో ఒకసారి అవినీతి చేస్తే బాధపడాలి కానీ, అసలు అవినీతే జీవిత విధానం అయితే అందులో మనస్సాక్షికి చోటేముంటుంది. దాంతో అలాంటి నాయకులని చూసీ చూసీ అలవాటైపోయిన జనం కూడా వారికి జేజేలు పలకడం మొదలుపెట్టారు.

 

తమిళనాట జయమ్మ అయినా, తెలుగునాట జగన్‌ అయినా ఇదే కథ! కాకపోతే ఈసారి న్యాయస్థానాలు కాస్త ఘాటుగా ప్రవర్తించడం ఒక్కటే ఊరట కలిగించే అంశం. మరి ఆ న్యాయస్థానాలు కడదాకా తమ మాట మీద నిలబడి అవినీతిపరుల తాట ఒలుస్తాయా లేదా అన్నదే వేచిచూడాల్సిన విషయం. అదే కనుక సాధ్యమైతే మన ప్రజాస్వామ్యానికి మంచి రోజులు వచ్చినట్లే!