వీఐపీలకు దాసోహం… సామాన్య ఖైదీలపై దాష్టీకం!

 

కొందరు వివాదాల్లో చిక్కుకుంటారు! మరి కొందర్ని వివాదాలే చుట్టుముడతాయి! కాని, దివంగత తమిళనాడు సీఎం జయలలిత నిచ్చెలి శశికళ మాత్రం మూడో టైపు! అసలామె వివాదాల్లో చిక్కడం, వివాదాలామెను చుట్టుముట్టడం… ఏదీ జరగదు! ఆమె నిత్యం వివాదానికి ప్రతిరూపంగా కొనసాగుతుంటారు! ఇది ఇప్పటి స్థితి కాదు. ఎక్కడో తమిళనాడులో మారుమూల పల్లెలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ్ల కర్ణాటకలో కూర్చుని తమిళనాడుని, దిల్లీని ఆమె డిస్టబ్ చేస్తున్నారు. ఇంత చేయాలంటే ఆమె వివాదానికి నిలువెత్తు రూపం కాకుండా సాధ్యమా?

 

శశికళ చుట్టూ ఎప్పుడెప్పుడు ఎన్ని వివాదాలు ముసురుకున్నాయో ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. కాని, మెరీనా బీచ్ లో జయమ్మ సమాధిపై మూడుసార్లు చరిచినట్టు ప్రమాణం చేసిన ఆమె ఇక కొన్నాళ్లు, కొన్నేళ్లు సైలెంట్ అవుతారని అంతా భావించారు. కాని, నిత్యం వివాదంలా చర్చకు దారి తీసే శశికళ ఇప్పుడు జైల్లోంచి కూడా పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతున్నారు. ఆమెకు వీవీఐపీ ట్రీట్మెంట్ లభిస్తోందని అక్కడి పోలీస్ అధికారిణి రూప వెల్లడించిన విషయం తెల్సిందే! ప్రత్యేక కిచెన్ తో కూడిన రాణిభోగం శశికళతో లభిస్తోందని రూప మీడియాకి కూడా లీక్ ఇచ్చేశారు! ఆ వివాదం ఇంకా సద్దుమణగలేదు!

 

ఉరుము ఉరిమి మంగళం మీద పడిదంటూ ఓ సామెత చెబుతారు. అలా తయారైంది శశికళతో పాటూ సేమ్ జైల్లో వుంటోన్న కొందరు ఖైదీల పరిస్థితి! దాదాపు 30మందిని కర్ణాటకలోని పరప్పన అగ్రహారం జైలు పోలీసులు చావచితగ్గొట్టారట! ఎందుకూ అంటే… శశికళకి రాచమర్యాదలు చేసి డబ్బులేని సాధారణ ఖైదీలైన తమకు దారుణమైన వసతులు కల్పిస్తున్నారని వారు ఆరోపించారట. అదే విషయం చిన్నమ్మ రాణివాసం బయటపెట్టిన డీఐజీ రూపకి వివరిస్తామని పట్టుబట్టారట! ధర్నా కూడా చేయటంతో రెచ్చిపోయిన జైలు అధికారులు వారందర్నీ ఉతికి ఆరేయించి … మైసూర్, బెల్గాం, బళ్లారి వంటి ఇతర జైళ్లకు తరలించారట. ఇదంతా ఇప్పటి వరకూ సీక్రెట్ గానే జరిగిపోయింది. కాని, శశికళ మేడమ్ కు దాసోహం అంటూ ఇతర ఖైదీలకు నరకం చూపుతున్నారని బీజేపి నేత శోభా మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించటంతో విషయం బయటకొచ్చింది!

 

శశికళ ఎఫెక్ట్ పన్నీర్ సెల్వం మొదలు పలనీ స్వామీ దాకా చాలా మందికే పడింది! ఇప్పుడు పాపం… ఆమె వుంటోన్న జైల్లోని సామాన్య ఖైదీలకు చిన్నమ్మ ఎఫెక్ట్ పెద్దగానే తగిలింది! అటూ డీఐజీ రూప ఈమె డబ్బులు పడేసి సుఖ, సౌకర్యాలు కొంటోందని చెప్పటంతో ఆమెనూ ట్రాఫిక్ శాఖలో పడేశారు పోలీస్ అధికారులు! మొత్తానికి వాయుగుండం లాంటి వివాదాల సుడిగుండం … శశికళ ఇప్పుడు తమిళనాడు నుంచి కర్ణాటక మీదకి కేంద్రీకృతమైంది! ఈ మొత్తం రాజభోగాల వ్యవహారం కర్ణాటకను ఏలుతున్న కాంగ్రెస్ మెడకూ చుట్టుకునేలా వుంది…