మంత్రిగారి అసందర్భ ప్రసంగం

 

పదవి, అధికారం మరి నోటిని అదుపుతప్పేయలా చేస్తాయా లేక మనిషిలో ఉండే సహజ సిద్దమయిన చపలచిత్తమే నోరు జారెలా చేస్తుందో ఖచ్చితంగా చెప్పలేము కానీ, సాధారణంగా అధికారంలో ఉన్నవారు చాలామంది నోరు జారడం తరచూ మనం గమనిస్తుంటాము. కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణకు హైదరాబాదులో నిన్న ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ పురస్కారాన్నిప్రధానం చేస్తున్నసందర్భంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి గీతారెడ్డి తదితరులు అందరూ పాల్గొన్న సభలో సర్వే సత్యనారాయణ గారి ప్రసంగం ఇలా సాగింది.

 

“మంత్రి గీతారెడ్డికి కూడా ఆమె తల్లిలాగే మంచి నాయకత్వ లక్షణాలున్నాయి. అందువల్ల, ఆమె కూడా ముఖ్యమంత్రి పదవికి అన్నివిధాల అర్హురాలు. దేవుడు అవకాశమిస్తే భవిష్యత్తులో ఆమె ముఖ్యమంత్రి పదవి చేపడతారు. అంటే, ఇప్పుడున్న ముఖ్యమంత్రిని దించాలనేది నా ఉద్దేశ్యం కాదు. ఒకవేళ రాష్ట్రవిభజన జరిగి తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే, ఆమె మొట్టమొదటి ముఖ్యమంత్రి అవుతారు. ఆమెకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా నేను సోనియాగాంధీ మీద ఒత్తిడి తెస్తాను.”

 

“అసలు మొదట ఆమెకే ఉపముఖ్య మంత్రి పదవి దక్కవలసింది. కానీ, తెలంగాణలో మాదిగల జనాభా ఎక్కువగా ఉన్నందునే, దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది. ఏమయినప్పటికీ, తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే ఆమెనే ముఖ్యమంత్రి చేసేందుకు నేను కృషి చేస్తాను,” అన్నారు.

 

ఇంతటితో ఆగినా కొంత బాగుండేది, కానీ ఆయన తన ప్రసంగమ కొనసాగిస్తూ, "కొన్ని రోజుల క్రితం తెలంగాణ బర్నింగ్ అంశం కారణంగా కొన్ని అడ్డంకులు వచ్చాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కుర్చీలోంచి దించేయాలని కొందరు అవకాశవాదులు చాలా గట్టిగా ప్రయత్నించారు. అప్పుడు నేనే స్వయంగా సోనియా గాంధీని కలిసి, ఆ పని చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తరచూ ముఖ్యమంత్రులను మారుస్తుందని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తే, ప్రజలలోకి తప్పుడు సంకేతాలు వెళతాయని ఆమెకు నచ్చజెప్పాక ఆమె ఆ ప్రయత్నం విరమించుకొన్నారు. (అంటే కిరణ్ కుమార్ రెడ్డి పదవిని నేనే కాపాడాను అని ఆయన ఉద్దేశ్యం అన్నమాట.)

 

ఆ తరువాత గీతారెడ్డి కులం గురించి ప్రస్తావిస్తూ “ఆమె దళిత మహిళ అయినప్పటికీ ఒక అగ్ర కులస్తునితో వివాహం జరిగింది,” అంటూ మరో అసందర్భ ప్రకటన చేసారు. తరువాత, ఆయన ప్రసంగం రిజర్వేషన్ల మీదకి మళ్ళింది. “దళితుడనయిన నేను గత ఎన్నికల్లో జనరల్ స్థానమైన మల్కాజ్గిరి నుంచి పోటీ చేశాను. దళితులలో ‘క్రీమీ లేయర్’ కు చెందిన వెంకటస్వామికి, గీతారెడ్డికి, నాకు, ఐఎఎస్ల పిల్లలకు అసలు రిజర్వేషన్లు ఎందుకు?'' అని ప్రశ్నించారు. తమను తాము దళితులలో ‘టాటా’లుగా ఆయన అభివర్ణించుకొంటూ, తమ స్థాయి నేతలకీ, ఐఎఎస్ ఆఫీసర్లకి ఏవిధమయిన రేజర్వేషన్లూ ఉండనవసరం లేదని ఆయన అభిప్రాయ పడ్డారు.

 

సర్వే గారి ఈ ప్రసంగం, పక్కనే ఉన్న ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, గీతారెడ్డికి ఆయన తమను పొగుడుతున్నాడో లేక తమ పరువు తీస్తున్నాడో అర్ధం కాని పరిస్థితి. ఆయనను సన్మానం చేసి అవార్డు ప్రధానం చేద్దామని ఆహ్వానిస్తే, ఆయన ఈవిధంగా అప్రస్తుత ప్రసంగం చేసి అందరినీ ఇబ్బంది పరిచాడు.

 

సభకు సంబందించని అంశాలను ఉటంకిస్తూ ఆయన చేసిన అసందర్భ ప్రసంగం బహుశః కేంద్రమంత్రిగా తానూ వారందరికన్నా ఒక మెట్టు పైన ఉన్నానని చాటుకోవడానికో లేక రాష్ట్ర రాజకీయాలను తానూ శాసించగలనని చెప్పుకోవడానికో తెలియదు కానీ మొత్తం మీద తన అసందర్భ ప్రసంగంతో అందరినీ ఇబ్బందికర పరిస్థితుల్లో నిలబెట్టి అవార్డు స్వీకరించాడాయన.