దేశంలో సంక్రాంతి – ఒకోచోట ఒకోలా!

సంక్రాంతి తెలుగువారికి ముఖ్యమైన పండుగ అన్న విషయం తెలిసిందే! మన పక్కనే ఉన్న తమిళనాడులో కూడా పొంగల్‌ పేరుతో దీనిని ఘనంగా జరుపుకుంటారనే విషయమూ చాలామందికి తెలుసు. కానీ దేశంలోని అనేక రాష్ట్రాలలో దీనిని వేర్వేరు పేర్లతో ఘనంగా చేసుకుంటారు. వాటిలో కొన్ని...

పౌష్‌ సంక్రాంతి (పశ్చిమబెంగాల్):-

పుష్య మాసంలో వస్తుంది కాబట్టి బెంగాలీయులు ఈ పండుగను పౌష్‌ సంక్రాంతి అని పిలుచుకుంటారు. వీరి పంటలు కూడా ఇప్పుడే ఇళ్లకు చేరుకుంటాయి. అలా ఇంటికి చేరిన కొత్త బియ్యానికి, ఖర్జూరపు బెల్లాన్ని కలిపి రకరకాల పిండివంటలు చేసుకుంటారు. మూడురోజులపాటు జరుపుకొనే ఈ పండుగ రోజుల్లో వీరు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఇక మకరసంక్రాంతి రోజునే గంగావతరణ జరిగిందని ఓ నమ్మకం. అది జరిగింది కోల్‌కతాకు సమీపంలో ఉన్న గంగాసాగర్ అనే ప్రాంతంలో కాబట్టి, అక్కడ ఉన్న గంగానదిలో స్నానామాచరించేందుకు లక్షలమంది తరలివెళ్తారు.

పంజాబ్‌ (మాఘి):-

తెలుగువారు భోగి జరుపుకొనే రోజునే పంజాబీయులు లోరి అనే పండుగ చేసుకుంటారు. ఈ రోజున విశాలమైన మైదానాలలో మంటలు వేసుకుని దాని చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ భాంగ్రా అనే సంప్రదాయ నృత్యం చేస్తారు. దీనికి అనుగుణమైన భాంగ్రా పాటలు పాడుతూ, డోలు వాయిస్తూ సాగే కోలాహలం చూసి తీరాల్సిందే! ఇక లోరి మర్నాడు ‘మాఘి’ పేరుతో పండుగ చేసుకుంటారు. పంజాబీల కాలమానం ప్రకారం మాఘి, మాఘమాసంలోని తొలిరోజు. మాఘినాడు పాలు, చెరుకురసంతో ఖీర్‌ చేసుకుంటారు.

ఘుఘుటి (ఉత్తరాఖండ్‌):-

ఉత్తరాఖండ్‌లోని కుమావ్‌ వంటి ప్రాంతాలలో సంక్రాంతిని భలే చిత్రంగా జరుపుకొంటారు. ఈ రోజుని వారు ఉత్తరాయణంలో మొదటి రోజుగా భావిస్తారు. చలికాలంలో వలస వెళ్లిపోయిన పక్షులన్నీ ఈ రోజు తిరిగివస్తాయని నమ్ముతారు. బహుశా పూర్వీకుల ఆత్మలకు ప్రతిరూపాలన్న నమ్మకం అనో ఏమో నల్లకాకులను కూడా ఈ రోజు స్వాగతిస్తారు. వాటి కోసం వెతికి మరీ రకరకాల తీపిపదార్థాలను అందిస్తారు. అందుకనే ఈ పండుగకు ‘కాలా కవ్వా’ (నల్లకాకి) అన్న పేరు కూడా ఉంది.

సుగ్గి (కర్ణాటక):-

కన్నడ భాషలో సుగ్గి అంటే పంట లేదా విందు అన్న అర్థం వస్తుంది. ఈ రోజున కన్నడిగులు కొత్తబట్టలు, పూజాపునస్కారాలతో పండుగన ఘనంగా చేసుకుంటారు. దీనికి తోడుగా అక్కడ ఓ చిత్రమైన సంప్రదాయం కూడా కొనసాగుతూ వస్తోంది. ఎల్లు బిరోదు పేరుతో నువ్వుల ఉండలను ఇచ్చిపుచ్చుకుంటారు. కర్ణాటకలోని స్త్రీలు ఈ నువ్వుల ఉండలతో పాటుగా, అరటిపళ్లు, చెరుకుగడలు, పసుపుకుంకుమలను ముత్తయిదువలకు పంచుతారు.

మాఘ బిహు (అసోం):-

అసోంలో సంక్రాంతి కూడా చాలా చిత్రంగా సాగుతుంది. సంక్రాంతి ముందురోజున వెదురు, ఎండుగడ్డి వంటివాటితో గుడిసెలను నిర్మించుకుంటారు. ఆ రోజంతా ఈ పాకలలో ఆడుతూపాడుతూ గడిపేస్తారు. మర్నాడు ఉదయం వీటిని తగలబెట్టేస్తారు. మన గోదావరి జిల్లాలలో కనిపించే కోడిపందాలు, ఎడ్లపందాల వంటి ఆటలు అసోంలో కూడా జరుగుతాయి. కొబ్బరి, నువ్వులతో రకరకాల పిండిపదార్థాలను చేసుకుంటారు.

పైన చెప్పుకొన్న రాష్ట్రాలే కాదు! బీహార్‌, హర్యానా, గుజరాత్‌, హిమాచల్ ప్రదేశ్‌... ఇలా ప్రతి రాష్ట్రంలోనూ సంక్రాంతి ఏదో ఒక పేరున విభిన్నంగా జరుగుతూనే ఉంటుంది. దేశం ఒక్కటే అయినా అందులోని ప్రతి ప్రాంతానికీ తనదైన సంప్రదాయం ఉందన్న విషయాన్ని రుజువు చేస్తుంటుంది.

 

- నిర్జర.