ఇసుక ముంచేస్తుంది...జాగ్రత్త..! అధికారులకు జగన్ వార్నింగ్

మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశాన్ని నిలువునా ముంచేసిన వాటిలో ఇసుకదే అతిపెద్ద పాత్ర. ఇసుక మాఫియాతో కలిసి సామాన్య ప్రజలకు టీడీపీ నేతలు చుక్కలు చూపించడంతో, ఆ ఎఫెక్ట్ పార్టీపై తీవ్రంగా పడింది. అందుకే, ఎవ్వరూ ఊహించనివిధంగా టీడీపీ నెంబర్ 23కి పడిపోయింది. ఇదే మాట చెబుతూ జనసేనాని పవన్ కల్యాణ్... వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత ఎన్నికల్లో టీడీపీని ముంచేసింది ఇసుకేనని.... ఇప్పుడు అదే ఇసుకతో జగన్ సర్కారు గేమ్స్ ఆడుతోందని, ఇలాగైతే, టీడీపీకి పట్టిన గతే... వైసీపీకి పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. పవన్ విశ్లేషణలో నిజంగా వాస్తవముంది. టీడీపీని ముంచేసిన వాటిలో ఇసుకది అతిపెద్ద పాత్రేనని అంగీకరించాల్సి ఉంటుంది. గల్లీ లీడర్ నుంచి చోటామోట నేత వరకు దొరికినకాడికి దొరికినట్లు ఇసుకను దోచేసి... అధిక ధరలతో సామాన్యులకు చుక్కలు చూపించారు. పేరుకు ఉచితం అంటూ బాబు ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు కాకపోవడంతో చెడ్డపేరు మూటగట్టుకోవాల్సి వచ్చింది.

ఇప్పుడు అలాంటి పరిస్థితులే జగన్ కు ఎదురవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వంద రోజుల వరకు ఇసుక తవ్వకాలను నిలిపివేసి వైసీపీ ప్రభుత్వం... ఇటీవలే కొత్త పాలసీని ప్రకటించి, ఇసుక సరఫరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంట్లో కూర్చొని ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తేచాలు చౌకధరకే ఇంటికి ఇసుక సరఫరా చేస్తామంటూ జగన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, శాండ్ పాలసీ ప్రకటించి, ఇసుక సప్లైకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, జగన్ ప్రభుత్వంపై మాత్రం ఇంకా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇసుక కొరతపై ఆరోపణలు వస్తున్నాయి. డిమాండ్ కి తగినట్టుగా ఇసుక సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించిన సీఎం జగన్.... ఇసుక పాలసీ అమలు జరుగుతున్న తీరు... ఇసుక సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఎక్కడికక్కడ ఇసుక రీచ్ లు, అలాగే స్టాక్ యార్డులు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఇసుక కొరత ఉంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే ఇసుక అక్రమ రవాణా, మాఫియాను, అవినీతిని అరికట్టడానికి చెక్ పోస్టుల దగ్గర సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ప్రస్తుతం 25 రీచ్ లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, భారీ వర్షాలు వరదల కారణంగా కొత్త రీచ్ లను ఏర్పాటు చేయలేకపోతున్నట్లు అధికారులు వివరించారు. అయితే, ఇసుక విషయంలో రాళ్లేయడానికి చాలామంది చూస్తున్నారన్న జగన్మోహన్‌రెడ్డి.... ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.