ఒక పరాజయం 100 తప్పులు.. ఇసుక తుఫాను ధాటికి కొట్టుకుపోయిన టీడీపీ

 

సామాన్య ప్రజలకు భారం కాకుండా చేయాలన్న ఉద్దేశంతో ఏపీలో ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చిన టీడీపీ.. కథ అడ్డం తిరిగి, చివరకు ఇసుక తుఫాను ధాటికి కొట్టుకుపోయిందా అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీలో ఇసుక మాఫియా ఎప్పటినుంచో ఉంది. ఈ మాఫియా ఇసుకను బంగారంలాగా సామాన్యులకు అందుబాటులో లేని ధరలతో చుక్కలు చూపిస్తోంది. దీంతో కొందరు సీనియర్ అధికారులు ఇసుకను ప్రభుత్వ ఆదాయ వనరుగా భావించకుండా ఫ్రీ చేస్తే.. అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇసుక మాఫియా ఆటలు కూడా సాగవని అప్పుడు ఏపీ సీఎంగా ఉన్న బాబుకి సలహా ఇచ్చారు. దీంతో బాబు ఇసుకని ఫ్రీ చేసారు. ఇది మంచి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయమే అయినప్పటికీ.. కొందరి తీరు కారణంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు, పార్టీ నష్టపోయింది.

ఫ్రీ ఇసుక మాకే అన్నట్టుగా కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు రెచ్చిపోయారు. ఇసుక మాఫియాతో చేతులు కలిపి.. ఇసుకను స్థానిక ప్రజలకు అందని ద్రాక్షలా చేసారు. తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాలకు తరలించి కోట్లకు కోట్లు సంపాదించారు. గత ఐదేళ్ళలో ఈ ఇసుక మాఫియా వల్ల ఎన్నో దాడులు కూడా జరిగాయి. ప్రజలు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా బాబు ఈ విషయాన్ని ఎందుకనో అంత సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించలేదు. ఇసుక మాఫియాను అరికట్టే ప్రయత్నం చేయలేదు. ఇదే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకొని బాబు కొంపముంచింది. మొత్తానికి ఇసుక తుఫాను ధాటికి టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది.