అడ్డా కూలీల కడుపు కొడుతున్న ఇసుక కొరత !

 

భవన నిర్మాణంలో ముడి సరుకయిన ఇసుక మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించిన నియంత్రణ, దాదాపు నలభై లక్షల పైగానే ఉన్న భవన నిర్మాణ రంగ కార్మికులు, ఆ రంగం పై ఆధార పడ్డ ఉపాధి వర్గాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇసుక నిషేదం, నిరోధము, నియంత్రణ అన్నీ కలగలిసి గందరగోళం ఏర్పడుతోంది. భవన నిర్మాణంలో ఇసుక కేవలం ఒక ముడి పదార్దమే కాదు ఇంకా ఎక్కువనే చెప్పాలి. 

నిజానికి ఇసుక సరఫరా ఆగిపోవడం తో రాష్ట్రము లోని పలు ప్రధాన నగరాల్లో నిర్మాణ రంగ పరిశ్రమలో తీవ్ర ప్రభావం పడింది. భవన నిర్మాణ కార్మికులు, సిమెంట్ డీలర్లు, ఐరన్, చిప్స్ వ్యాపారస్తులు, రవాణా రంగానికి చెందిన రిక్షా, ఆటో కార్మికులు, తాపీ మేస్త్రీలు, కూలీలు, వడ్రంగి మేస్త్రీలు, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ తదితర వృత్తుల వారు గత కొన్నాళ్లుగా ఉపాధి లేక విలవిలల్లాడుతున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక విధానం ప్రకటించడంతో తెలుగుదేశం ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం రద్దయినట్టయ్యింది. అక్రమ ఇసుక తవ్వకాలు, ఇసుక దొంగ వ్యాపారం, స్మగ్లింగ్ వంటి సమస్యల వలన ఈ కొత్త విధానం అవసరం అయ్యిందని జగన్ ప్రభుత్వం చెబుతోంది. పదిహేను రోజుల్లోనే ఈ విధానం అమలులోకి వస్తుందని ప్రకటించిన ప్రభుత్వం దాదాపుగా నెలా పదిహేను రోజులు అయినప్పటికీ ఇంకా ఈ నిషేదం కొనసాగించడం భవన నిర్మాణ రంగం మీద ఆధార పడ్డవారికి తీవ్ర ఇబ్బందులు కలగ చేస్తోంది. 

ప్రభుత్వ చర్యలు ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఉండాల్సినవి పోయి లేని కొత్త సమస్యలను సృష్టించేవి కావడం శోచనీయం. దీంతో ఇసుక ధర ఆకాశాన్ని అంటుతోంది, అధికార యంత్రాంగం ఇతర జిల్లాల నుంచి ఇసుక సరఫరాకు ప్రయత్నాలు చేస్తోంది.  ఒక్క గుంటూరు జిల్లాలోనే దాదాపుగా ఐదు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం ఉండడంతో అధికారులు ఈ కొరతను తీర్చడానికి గోదావరి జిల్లాల నుండి ఇసుకని తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఈ కొరత వలన బ్లాక్ మార్కెట్ వ్యాపారులు ఇసుక ధరను అమాంతం ఆకాశానికి ఎత్తేసారు. సాధారణంగా నాలుగువేల రూపాయలుగా ఉండే ట్రక్ లోడు ఇసుక ధర అమాంతంగా ఇరవై వేలకి చేరింది. ఈ కొత్త ఇసుక విధానంలో ఇసుక రీచ్ లలో జిల్లా కలెక్టర్ అధీనంలో ఉంటాయి, ఇసుకను ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన సరఫరా చేస్తారు, స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో కావాల్సిన ఇసుక కోసం అప్ప్లై చేసుకుని రసీదు తీసుకుని సంబంధిత ఇసుక రీచ్ నుండి ఇసుకను పొందాల్సి ఉంటుంది. 

ప్రభుత్వం నిర్మిస్తున్న గృహనిర్మాణ  ప్రాజెక్ట్ లకి తోలి ప్రాధాన్యత గానూ, వ్యక్తిగత గృహ నిర్మాణాలకు ఇతర ప్రభుత్వ ప్రాజెక్ట్ లకి రెండవ ప్రాధాన్యతగానూ, అపార్ట్మెంట్ లకి మూడవ ప్రాధాన్యతగానూ ఈ విధానం రూపొందించబడింది. ప్రస్తుత ధర ప్రకారం ట్రక్ ఇసుక రేటు మూడు వందలగానూ ముప్పై రూపాయల లోడింగ్ ఛార్జ్ గాను ఉన్నది. ఈ ఇసుక కొరత వలన సొంత ఇంటి నిర్మాణం చేసుకుంటున్న మధ్యతరగతి ప్రజల స్వగృహ స్వప్నం ఆలస్యం అవుతోంది.  

ప్రభుత్వ విధానాలు గతంలో జరిగిన తప్పులను సమీక్షిస్తూనే నిర్మాణ కార్మికుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకోకుండా తీసుకున్న ఇటువంటి అనాలోచిత చర్య వలన రెక్కాడితే కానీ డొక్కాడని అసంఘటిత కార్మిక వర్గం రోడ్డున పడింది. రాష్ట్రంలో ప్రధాన పట్టణాలు అయిన విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి వంటి పట్టణాల్లో నిర్మాణ పనులన్నీ నిలిచి పోయాయి. కొనసాగుతున్న నిర్మాణాలకు ఆటకం లేకుండా, గత ప్రభుత్వం అవలంభించిన అవకతవక విధానాలను సమీక్షిస్తూనే నిర్మాణ రంగ కార్మికుల ఉపాధి పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించాల్సి ఉంది

.