ఉద్యమానికి ‘వంద’నం!

 

 

 

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటూ సీమాంధ్ర ప్రజలు చేస్తున్న శాంతియుత ఉద్యమం వంద రోజుల మైలురాయిని దాటింది. భారతీయ ఉద్యమ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ఈ వందరోజుల్లో లిఖించింది. గాంధీజీ నాయకత్వంలో జరిగిన స్వాతంత్ర్యోద్యమం తర్వాత అంత శాంతియుతంగా, అంత ప్రభావవంతంగా, అంత ఐకమత్యంగా జరుగుతోన్న ఉద్యమం ఇదేనని దేశమంతా కీర్తిస్తోంది. ఉద్యమమంటే ఇలా వుండాలని, దేశంలోని ఏ ఉద్యమకారులకైనా సీమాంధ్రులు చేస్తున్న ఈ ఉద్యమం స్ఫూర్తి ప్రదాత అని ప్రశంసలు లభిస్తున్నాయి.

 

ఉద్యమమంటే హింస, ఆస్తుల ధ్వంసం, పోలీసుల మీద దాడులు, రాళ్ళు విసరడం అనుకునేవాళ్ళు చూసి బుద్ధి తెచ్చుకునేలా సీమాంధ్రుల ఉద్యమం విజయవంతంగా కొనసాగుతోంది. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం నాయకుడు లేని ఉద్యమం. ప్రతి ఒక్క తెలుగువాడూ నాయకుడై నడిపిస్తున్న ఉద్యమం.. రాజకీయ నాయకుల ఊహలకు అందని ఉద్యమం. రాజకీయ నాయకులకు నో ఎంట్రీ అని స్పష్టంగా చెప్పిన ఉద్యమం. శాంతియుతంగా, స్ఫూర్తివంతంగా జరుగుతున్న ఈ ఉద్యమాన్ని చూసి విభజనవాదులు నోళ్ళు తెరిచారు. కుళ్ళుబుద్ధితో ఎన్నో ఆరోపణలు చేశారు. సీమాంధ్ర ఉద్యమాన్ని చులకన చేస్తూ ఎన్నో కామెంట్లు చేశారు. ఉద్యమం మొదలైన దగ్గర్నుంచీ ఇది చల్లారిపోయే ఉద్యమమంటూ అవాకులు చవాకులు పేలారు.




ఇప్పుడు వందరోజులు పూర్తిచేసుకున్న ఉద్యమాన్ని చూసి ఏం మాట్లాడాలో అర్థంకాక, ఎలా విమర్శించాలో బుద్ధికి తట్టక గప్‌చుప్‌గా ఉండిపోయారు. సీమాంధ్రలో ఉద్యమం ఒక్కరోజున కూడా విశ్రమించలేదు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ ఎక్కడ విన్నా సమైక్య హోరే! ఒక్క లాఠీ కూడా విరక్కుండా, ఒక్క లాఠీఛార్జ్ కూడా జరక్కుండా, ఒక్క గొడవ కూడా జరగకుండా జరుగుతున్న సమైక్య ఉద్యమానికి పోలీసులు కూడా సెల్యూట్ చేస్తున్నారు. పట్టు విడవకుండా, మడమ తిప్పకుండా వంద రోజులుగా సమైక్య హోరు ఢిల్లీకి చేరేలా చేస్తున్న సమైక్య ఉద్యమకారులకు వందనాలు!