ఏపీకి "లాభం" మిగిల్చిన సదావర్తి

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాల మధ్య తీవ్ర వివాదానికి దారి తీసిన సదావర్తి సత్రానికి చెందిన భూముల రచ్చ ముగిసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు చెన్నైలో తిరిగి వేలాన్ని నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పేద బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు వసతి కల్పించేందుకు, అన్నదానం చేసేందుకు అమరావతిలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు వంశీకులైన లక్ష్మీపతినాయుడు భార్య వెంకటలక్ష్మమ్మ పేరుతో సుమారు 150 ఏళ్ల క్రితం సదావర్తి సత్రాన్ని ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ కోసం అచ్చంపేట మండలం కోగంటివారి పాలెంలో 80 ఎకరాలు, తమిళనాడులోని కాంచీపురం జిల్లా తాళంబూర్ గ్రామంలో 471 ఎకరాలు దానంగా ఇచ్చారు.

 

అయితే సరైన సాక్ష్యాదారాలు, పర్యవేక్షణ లేకపోవడంతో కాంచీపురంలోని భూములన్నీ అన్యాక్రాంతమయ్యాయి. ఈ భూములను చేజిక్కించుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. వచ్చి రావడంతోనే ఈ భూముల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని న్యాయస్థానాల్లో సూట్, రిట్ వేసింది. అనంతరం అన్యాక్రాంతమైన భూములను పరిశీలించేందుకు ఒక అధికారిక బృందాన్ని కాంచీపురం పంపించింది. వీటిలో 83 ఎకరాలు పాక్షికంగా ఆక్రమణకు గురైందని..ఇంకొన్నాళ్లు ఆగితే ఇవి కూడా పూర్తి దురాక్రమణ‌ అయ్యే అవకాశం ఉందని బృందం ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఇక ఉపేక్షిస్తే లాభం లేదని మిగిలి ఉన్న 83 ఎకరాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని ఏపీ దేవాదాయ శాఖ నిర్ణయించింది. దీనిలో భాగంగా చెన్నైలోని రాయపేట పాఠశాలలో రూ.22కోట్లకు భూమలను వేలం వేశారు.

 

అయితే దీనిపై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఎంతో విలువైన సదావర్తి భూములను కారుచౌకగా కట్టబెట్టారంటూ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని విచారించిన న్యాయస్థానం 22 కోట్ల రూపాయలకు అదనంగా మరో 5 కోట్ల రూపాయలు చెల్లించి ఆ భూములను మీరే సొంతం చేసుకోవచ్చంటూ తెలిపింది. ఆ మొత్తాన్ని చెల్లించేందుకు ఆయన ముందుకు రావడంతో డిపాజిట్ చెల్లించాలని ఆదేశించింది. హైకోర్టు సూచన మేరకు ఆర్కే చెల్లించారు..

 

అయితే దీనిపై మరోకరు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో వేలాన్ని రద్దు చేసి మరోసారి బహిరంగ టెండర్ ఆహ్వానిస్తూ వేలాన్ని నిర్వహించాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు నిచ్చింది. దీంతో 18వ తేదీని వేలంపాటకు ముహూర్తంగా నిర్ణయించింది ప్రభుత్వం. చెన్నైలోని టీటీడీ సమాచారం కేంద్రంలో ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ ఆధ్వర్యంలో వేలం పాటను నిర్వహించారు. ఈ వేలంలో 60 కోట్ల 30 లక్షలకు ఈ భూములు అమ్ముడయ్యాయి. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సత్యనారాయణ రెడ్డి వాటిని సొంతం చేసుకున్నారు. తద్వారా 37.90 కోట్ల లాభం వచ్చినట్లయింది. మొత్తానికి అనూహ్య మలుపులు తిరిగిన ఈ వివాదంలో ప్రభుత్వానికి లాభమే చేకూరిందని విశ్లేషకులు అంటున్నారు.