సడక్ బంద్ పై ఢీ అంటే ఢీ

 

తెలంగాణా రాష్ట్ర సాధనకోసం టిజెఎసి, టి.ఆర్.ఎస్. కలిసి చేస్తున్న ఉద్యమాలలో భాగంగా నేడు ఉదయం ఏడు గంటలనుండి రాత్రి ఏడు గంటల వరకు హైదరాబాద్-కర్నూలు హైవేపై సడక్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. టి.ఆర్.ఎస్., టి.జెఎసి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెపుతుండగా అటు పోలీసు యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయాలనే యోచనలో వుంది. హైదరాబాద్-కర్నూలు జాతీయ రహదారి మార్గంలో శంషాబాద్ నుంచి ఆలంపూర్ వరకు జెఎసిలోని రాజకీయ పార్టీలు టి.ఆర్.ఎస్., బిజెపి. న్యూడెమోక్రసీ, ఉద్యోగ-ప్రజాసంఘాల నేతలు ఇప్పటికే మొహరించారు. సడక్ బంద్ కోసం టి.ఆర్.ఎస్. ఐదు కేంద్రాలను గుర్తించింది. ఆ ఐదు కేంద్రాలు శంషాబాద్, జడ్చర్ల, భూత్పూర్, కొత్తపేట, ఆలంపూర్. ఆలంపూర్ వద్ద టి.ఆర్.ఎస్.ఎల్సీ. ఉపనేత ఈటెల రాజేందర్, జెఎసి చైర్మన్ కోదండరాం, పాలమాకుల వద్ద టి.ఆర్.ఎస్.ఎల్సీ. నేత టి.హరీష్ రావు, తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత ఇన్ చార్జులుగా ఉన్నారు.