సచిన్ చేతిలో కాంగ్రెస్ క్లీన్‌బౌల్డ్

 

 Sachin Tendulkar campaigning for Congress, Sachin Tendulkar, Congress rally, Tendulkar campaigning, congress 2014 elections

 

 

సచిన్ టెండూల్కర్ చేతిలో కాంగ్రెస్ పార్టీ క్లీన్‌బౌల్డ్ అయింది. క్రికెట్‌లో రికార్డులు సృష్టిస్తూ, వివాద రహితుడిగా, తన పనేదో తాను చేసుకువెళ్ళేవాడిగా పేరున్న సచిన్ టెండూల్కర్‌ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి నామినేట్ చేయడం ద్వారా రాజ్యసభకి ఎంపిక చేసింది. భారతీయ క్రికెట్ రంగానికి సచిన్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకి రాజ్యసభ సభ్యత్వం వచ్చిందని అందరూ భావించారు. ఎవరూ దీనికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేయలేదు.

 


అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఒక ‘మాస్టర్’ ప్లాన్ వేసింది. రాజ్యసభకు ఎంపిక చేసింది కాబట్టి టెండూల్కర్ కాంగ్రెస్ పార్టీకి రుణపడి వుంటాడని, తాము కోరితే ఎన్నికలలో తమకు ప్రచారం చేస్తాడని కాంగ్రెస్ నాయకత్వం భావించింది. దాంతో మధ్యప్రదేశ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున సచిన్ టెండూల్కర్ ప్రచారం చేయబోతున్నాడంటూ ప్రచారం మొదలుపెట్టేసింది. కాంగ్రెస్ మొదలుపెట్టిన ప్రచారం ఊపందుకుని సచిన్ నిజంగానే కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయబోతున్నాడన్న నమ్మకం అన్ని పార్టీలకీ కలిగింది.




ఈ విషయం తన దృష్టికి రావడంతో సచిన్ టెండూల్కర్ వెంటనే స్పందించాడు. తాను కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయబోవడం లేదని, తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాదని ఫాస్ట్ బాల్ లాంటి స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు. ఆ స్టేట్‌మెంట్ బాల్ ధాటికి కాంగ్రెస్ పార్టీ క్లీన్‌బౌల్డ్ అయింది. తాను వేసిన ప్లాన్ ఇలా తిరగబడిందేంటా అని నాలుక్కరుచుకుంది. ఈ విషయంలో తమ చేతికి మట్టి అంటకుండా నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టింది. అధిష్ఠానం ఆదేశాలు అందుకున్న బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా వెంటనే రంగంలోకి దిగాడు.



సచిన్ టెండూల్కర్ చేత ఎన్నికలలో ప్రచారం చేయించాలన్న ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఎంతమాత్రం లేదని, ఈ విషయంలో వినిపించిన వార్తలన్నీ నిరాధారమైనవని ప్రకటించాడు. సచిన్ టెండూల్కర్ గొప్ప క్రికెటర్ అనీ, ఆయన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలన్న ఉద్దేశం తమకి ఎంతమాత్రం లేదని చెప్పాడు. ఈ తెలివితేటలన్నీ సచిన్ చేతిలో క్లీన్‌బౌల్డ్ అవకముందు ప్రదర్శించి వుంటే బాగుండేదని ప్రతిపక్ష పార్టీలవారు అంటున్నారు.