కాంగ్రెస్ కి బిగ్ షాక్.. సబితా కుమారుడు రాజీనామా

 

కాంగ్రెస్ పార్టీకీ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి రాజీనామా చేశారు. రాజేంద్రనగర్ నుండి పోటీ చేసేందుకు కార్తీక్ రెడ్డి ప్రయత్నించారు. మహా కూటమి పొత్తులో భాగంగా రాజేంద్రనగర్ సీటు టీడీపీకి దక్కింది. దీంతో రాజేంద్రనగర్ నుండి గణేష్‌గుప్తాను టీడీపీ తన అభ్యర్ధిగా బరిలోకి దింపింది. దీంతో ఎప్పటి నుంచో టిక్కెట్ ఆశిస్తున్న కార్తీక్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. గురువారం శంషాబాద్‌లో నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌కు టిక్కెట్ కేటాయించకపోవడాన్ని తప్పుపడుతూ ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు ఆ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్‌ తమకు బీఫాం ఇస్తే రాజీనామాలను ఆమోదించనట్టు అని.. ఒకవేళ ఇవ్వకపోతే తమ రాజీనామాలను ఆమోదించినట్టేనన్నారు. ఈ నెల 19లోపు తనకు బీఫాం ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు ప్రకటించారు. అంతేకాదు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధికి ఎవరితో ఓట్లేసి గెలిపిస్తారో గెలిపించుకోవాలని సవాల్  చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ప్రతి  కాంగ్రెస్ పార్టీ  కార్యకర్త రాజీనామా చేస్తారని అన్నారు. మహాకూటమి పేరుతో ఎల్. రమణ టిక్కెట్లు అమ్ముకున్నారంటూ  కార్తీక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.