కాంగ్రెస్ మెడకి చుట్టుకొంటున్న జగన్ కేసులు

 

సీబీఐ రాష్ట్ర హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి పేరును కూడా చార్జ్ షీట్ లో చేర్చడంతోకాంగ్రెస్ ప్రభుత్వంలో కలకలం చెలరేగింది. ఇది ముందు నుండి ఊహిస్తున్నదే అయినప్పటికీ ఆఘడియలు ఇంత త్వరగా వచ్చేస్తాయని ఊహించకపోవడంతో కలవరం తప్పలేదు. హోంమంత్రిగా యావత్ రాష్ట్ర పోలీసు శాఖకు అధినేత్రిగా ఉన్న సబితా ఇంద్రరెడ్డిపై చిల్లర నేరగాళ్ళపై మోపే 420వంటి సెక్షన్ల క్రింద చార్జ్ షీట్ దాఖలు చేయడం అవమానకరమే.

 

ఇప్పటికే సీబీఐ చార్జ్ షీటులోకి పేరు ఎక్కిన మంత్రి ధర్మాన ప్రసాదరావును వెనకేసుకొస్తూ కాపాడుతున్నారని ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా పటించుకోని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీద ఇప్పుడు హోంమంత్రి సబితాఇంద్రారెడ్డిని కాపాడే పెద్ద బాధ్యత కూడా పడింది. ఆమె రాజీనామాకు అనుమతిస్తే, మంత్రి ధర్మానను మాత్రం ఎందుకు కాపాడుతున్నారనే ప్రశ్న తలెత్తుతుంది. ఒకవేళ ఆమెను కూడా వెనకేసుకొస్తే కళంకిత మంత్రివర్గం అని ప్రతిపక్షాలు చేసే విమర్శలను తట్టుకోవలసి ఉంటుంది.

 

అయితే ఇటువంటి విమర్శలకు మంత్రులు, ప్రభుత్వాలు జడిసే రోజులు ఎప్పుడో పోయాయి. ఎవరేమిఅన్నా కూడా పట్టించుకోకుండా ముందుకు సాగిపోవడమే కాకుండా, తమపై విమర్శలు చేస్తున్న వారు గతంలో చేసిన తప్పులను ఎత్తి చూపిస్తూ మీరు తప్పు చేయగాలేనిది మేము చేస్తే మాత్రం తప్పేమిటి అని ప్రతిపక్షాలపై విరుచుకుపడి వారి నోళ్ళు మూయించగల సరికొత్త విధానం ప్రభుత్వంతో సహా దాదాపు అన్నిరాజకీయ పార్టీలు అవలంబిస్తున్నాయి గనుక సబితాఇంద్రారెడ్డిపై వచ్చే విమర్శలను కూడా ప్రభుత్వం ఇదేపద్దతిలో త్రిప్పి కొట్టవచ్చును.

 

నిన్నసబితాఇంద్రారెడ్డి ముఖ్యమంత్రిని కలిసినప్పుడు తొందరపడి రాజీనామా చేయవద్దని, మంత్రి ధర్మానపై కూడా సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసిందని, ఆయన కేసు కోర్టులో నడుస్తోంది గనుక, కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకొందామని చెప్పినట్లు వార్త వచ్చింది. ఇప్పటికే ధర్మానపై సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేయడం, కోర్టులో కేసు నడుస్తుండటం తమ ప్రభుత్వానికి ప్రతికూలాంశమని ముఖ్యమంత్రి భావించకపోగా, దానినే ఆధారం చేసుకొని ఇప్పుడు సబితాఇంద్రారెడ్డిని కూడా వెనకేసుకురావడానికి ఉపయోగించుకోవడం మన రాజకీయ వ్యవస్థలో వచ్చిన పరిణతికి అద్దం పడుతోంది.

 

ఏది ఏమయినప్పటికీ, రాష్ట్రంలో నేరాలు అరికట్టవలసిన హోం మంత్రిపైనే నేరారోపణ జరిగినప్పుడు, పదవిలో కొనసాగేందుకు మార్గాలు వెతుకుతూ, ప్రజలకు ప్రతిపక్షాలకు సంజాయిషీలు ఇచ్చుకొంటూ అవమానకర పరిస్థితులు ఎదుర్కొనేబదులు ఆమె స్వయంగా రాజీనామా చేసి ఉండి ఉంటె బాగుండేది. కానీ, ఆవిధంగా చేస్తే హోంమంత్రిగా ఆమెకిప్పుడున్న రక్షణ కవచం తొలగిపోతుంది గనుక, మరుక్షణం సీబీఐ ఆమెను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది గనుక ఆమె రాజీనామా చేయకపోవచ్చును.

 

ఆమె రాజీనామా చేయకుండా మరికొంత కాలం తనని తానూ కాపాడుకోవచ్చునేమో గానీ, ఒకసారి సీబీఐ చార్జ్ షీటులో పేరు కూడా ఎక్కిన తరువాత ఎంతో కాలం కాపాడుకోలేక పోవచ్చును. కనీసం కోర్టు మెట్లు ఎక్కక తప్పని పరిస్థితి ఉంటుంది.

 

ఇక ఈ వ్యవహారం అధికార కాంగ్రెస్ పార్టీకి కక్కలేని మ్రింగలేని పరిస్థితి సృష్టించిందని చెప్పవచ్చును. జగన్ మోహన్ రెడ్డి మీద సందించిన సీబీఐ అస్త్రం ఇప్పుడు తిరిగి తిరిగి తన పార్టీ నేతలనే బలితీసుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరిణామమే. ఇంతకాలం (సీబీఐ) చట్టం తన పని తానూ చేసుకుపోతుందని చిలకపలుకులు వల్లిస్తూ వచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కూడా ఆ పలుకులు వల్లిస్తే అర్ధం వేరేలా ఉంటుంది.

 

ఈ పరిణామాలకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా స్పందిస్తుందనేది కూడా చాలా ఆసక్తికరంగానే ఉంటుంది. ఆ పార్టీ పరిస్థితి కూడా ఇంచు మించు కాంగ్రెస్ పరిస్థితే అని చెప్పవచ్చును. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసమర్దుడని నిత్యం విరుచుకుపడే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డిని కూడా అవినీతి మంత్రి అని విమర్శించగలరా?

 

‘విశ్వసనీయత’ గురించి టముకు వేసుకొనే ఆ పార్టీ నేతలు అవినీతి రొంపిలో కూరుకుపోయిన తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కారణంగా ఎదుట వారి అవినీతిని ప్రశ్నించే సాహసం చేయలేరు. కనీసం ‘అవినీతి’ అనే పదం పలకడానికి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది గనుకనే నేడు హోంమంత్రి సబితాఇంద్రారెడ్డిని విమర్శించలేరు, సమర్ధించ లేరు కూడా. కారణం అందరికీ తెలిసినదే. స్వర్గీయ వైయస్సార్ హయాంలో గనుల శాఖా మంత్రిగా పనిచేసిన ఆమె తమ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి లబ్దికలిగించే నిర్ణయం తీసుకొన్నారని సీబీఐ చేస్తున్న ఆరోపణలే అందుకు కారణం.

 

ఇక, నడుస్తున్న ఈ సీబీఐ సీరియల్లో ఒకటొకటిగా బయటపడుతున్న ఆసక్తికరమయిన ఈ సన్నివేశాలు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ పార్టీల మద్య ఎంత అవినాభావ సంబందాలున్నాయో అద్దం పడుతున్నాయి. తుంటి మీద కొడితే మూతి పళ్ళు రాలినట్లు, జగన్ మోహన్ రెడ్డి మీద కేసులు వేస్తే కాంగ్రెస్ మంత్రులు జైళ్ళకి వెళ్ళే పరిస్థితులు ఏర్పడ్డాయిప్పుడు.