డిసెంబర్ ఆఖరికి రష్యా వ్యాక్సిన్.. భారత్ కు 10 కోట్ల వ్యాక్సిన్ డోసులు..! 

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో రష్యా ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్‌ "స్పుత్నిక్‌-v"ని రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒక అంతర్జాతీయ సంస్థ పర్యవేక్షణలో ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అయితే తాజాగా కుదిరిన ఒక ఒప్పందం ప్రకారం రష్యా వ్యాక్సిన్ 10 కోట్ల డోసులు భారత్ కు అందనున్నాయి. ఈ వ్యాక్సిన్ పై సకాలంలో ప్రయోగ పరీక్షలు పూర్తయి, భారత ఔషధ నియంత్రణ సంస్థ నుండి వేగంగా అనుమతులు లభిస్తే డిసెంబరు నుండి ఈ వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం కావచ్చని తెలుస్తోంది.

 

భారత్ లో ఈ వ్యాక్సిన్ ట్రయల్స్, ఉత్పత్తి, పంపిణి కోసం హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్ ‌ల్యాబ్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నామని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) సీఈవో కిరిల్‌ దిమిత్రీవ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్‌ రెడ్డీస్‌ కో-చైర్మన్‌ జి.వి.ప్రసాద్‌ కూడా ఈ ఒప్పందాన్ని ధ్రువీకరించారు. "స్పుత్నిక్‌-v" మూడోదశ ప్రయోగ ట్రయల్స్, పంపిణీ విషయంలో ఆర్‌డీఐఎఫ్ తో కలిసి రెడ్డీస్ ల్యాబ్స్ పనిచేయనున్నట్లు ప్రసాద్‌ ప్రకటించారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌కు అనుమతుల అంశం ప్రస్తుతం ఔషధ నియంత్రణ సంస్థల పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు. ఇండియా‌లోని వ్యాక్సిన్‌ తయారీ సంస్థల సహాయ సహకారాలతో మొత్తం 30 కోట్ల డోసుల ఉత్పత్తికి రష్యా ఒప్పందాలు కుదుర్చుకోగా, వాటిలో 10 కోట్ల డోసుల వ్యాక్సిన్ ను డాక్టర్‌ రెడ్డీస్ ‌ల్యాబ్స్ ద్వారా మనదేశంలో పంపిణీ చేయనుంది.