తెలంగాణ జల దోపిడీ.. అప్పుడు ఆంధ్రోళ్లు.. ఇప్పుడు కెసిఆర్: బీజేపీ నేత ఫైర్

 

 

టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రముఖ బీజేపీ నేత, మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జలదోపిడీ జరుగుతోందని ఆయన ఆరోపించారు. గతంలో ఆంధ్రోళ్లు జల దోపిడీ చేస్తున్నారని టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారని అయితే ఇప్పుడు కేసీఆర్‌ పాలనలోనూ అదే జరుగుతోందని విమర్శించారు. గోదావరి నీటిని నది పరిసర ప్రాంతాలకు ఇవ్వకుండా అనవసరమైన రిజర్వాయర్లు కట్టి ఎక్కడికో తీసుకెళ్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇలాంటి చర్యలను జలదోపిడీ కాకపోతే ఏమంటారని తెలంగాణ ప్రభుత్వాన్ని సోమారపు ప్రశించారు. ఈ జలదోపిడీ ఆపకపోతే ప్రబుత్వానికి ప్రజలే సరైన సమాధానం చెప్తారని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో అసలు ప్రభుత్వం ఉందా అన్న సందేహం కలుగుతోందని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా కేసీఆర్ నెరవేర్చలేదని ఆరోపించారు. సోమారపు సత్యనారాయణ గతంలో ఆర్టీసీ చైర్మన్ గా పని చేసిన విషయం తెలిసిందే. ఐతే మొన్న డిసెంబర్ లో జరిగిన ఎన్నికలలో  రామగుండం నుండి సోమారపు సత్యనారాయణ పై విజయం సాధించిన ఇండిపెండెంట్ కోరుకంటి చంద్రశేఖర్ ను టిఆర్ఎస్ లో చేర్చుకోవడం పై అధిష్టానం తో విభేదించి ఆయన బీజేపీ లో చేరిన విషయం తెలిసిందే.