కేసీఆర్‌కు రాజీనామా లేఖ రాసిన కండెక్టర్... ఆత్మభిమానాన్ని చంపుకొని చేసే ఉద్యోగం నాకొద్దు

రెండు మాసాలు సమ్మె చేశారు.. రెక్కాడితే కానీ డొక్కాడదని తెలిసి కూడా ఫలితం కోసం ముందడుగు వేశారు. ప్రభుత్వానికి.. విపక్షాలకి.. మధ్య కార్మికులు అనిగిపోయారనే విధంగా అనుకునే స్థాయిలో సమ్మె ముగింపు దారితీసింది. ఇదిలా ఉండగా.. సూర్యాపేట డిపో , ఎల్.కృష్ణ అనే ఆర్టీసీ కండెక్టర్.. సమ్మె కాలంలో తాను అనుభవించిన క్షోభను..మనోవేధనను ఒక లేఖలో సీఎం కేసీఆర్ గారికి రాసాడు. ఆ లేఖలో ఇలా రాసాడు." గౌరవనీయులైన తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి , తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ గౌరవంతో ఉద్యోగం చేద్దామనుకున్నా.. ఆత్మగౌరవంతో బతుకుదామనుకున్నా..కానీ మీలాంటి గొప్ప మనిషి ఉన్న ఈ రాష్ట్రంలో ఆత్మ గౌరవంతో కాదు కదా కనీసం తెలంగాణలో ఎందుకు పుట్టాను రా నాయనా అనే విధంగా తీవ్ర మానసిక వేదనకు గురై.. నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. మీకు మాట తప్పడం మాయ మాటలు చెప్పి మోసం చేయడం తెలుసని మా కార్మికలోకం లేటుగా తెలుసుకుంది.

మీరు ఉద్యోగంలో నుండి తీసేయడం కాదు.. నేనే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. దీనికి కారణం లేకపోలేదు సార్.. మా తెలంగాణలో నియంతృత్వం చూస్తా అని అనుకోలేదు. 1200 మంది ఆత్మహత్య చేసుకుంటే మన కేసీఆర్ సారూ ఉన్నారు కదా అనుకున్నాను. ఆంధ్రా పాలకులు నిజంగా మోసం చేశారేమో మనల్ని ఈయన బాగా చూసుకుంటారని అనుకున్నా కానీ సార్.. 20 మందికి పైగా కార్మికులు చనిపోతే మీరు కనీసం స్పందించలేదు చూడండి సార్ అప్పుడనిపించింది సార్ తెలంగాణ మా కోసం కాదు తెలంగాణ కేవలం మీలాంటి నాయకుల కోసమే అని. నా అక్క చెల్లెమ్మలు లాఠీ దెబ్బలు తింటారని కలలో కూడా ఊహించలేదు సార్.. కానీ మీ బంగారు తెలంగాణలో అది సాధ్యమైంది. సార్ నా చెల్లెళ్లు ఏడుస్తుంటే.. రోజూ నా సోదరులు బాధపడుతుంటే.. తట్టుకోలేకపోతున్నా.. సార్, కానీ ఒక్కటి మాత్రం నిజం సార్ నా ఆర్టీసీ అక్కాచెల్లెళ్ళ ఉసురు ఖచ్చితంగా మీకు తగులుతుంది.

సార్ నేను సూర్యపేట డిపోలో ఆర్టీసీ కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న మీలాంటి ఒక్క మోసకారి, ఒక్క మాటకారి, ఒక్క మానవత్వం లేని ఒక నిరంకుశ ప్రభుత్వంలో నా ఆత్మాభిమానాన్ని చంపుకుని ఉద్యోగిగా పని చేయలేను. అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా నా పేరు ఎల్ కృష్ణ, నా స్టాఫ్ నెంబర్ 176822, సూర్యాపేట డిపో సార్ నాది, నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను మీ సంస్థ నుండి నాకు రావలసిన బకాయిలు ఇప్పించి నా రాజీనామాను ఆమోదించగలరని నా యొక్క మనవి.

అయ్యా సీఎం సార్ గారూ మీరు ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకొండి. ఇప్పుడు మీ వైఖరి గుర్తు చేసుకోండి, పాపం సార్ ఆర్టీసీ వాళ్లు మిమ్మల్ని చాలా అభిమానించారు సార్. కానీ మీరు ఇలా చేస్తారని కలలో కూడా ఊహించి ఉండరు. సార్ ఆర్టీసీ కార్మికులు వాళ్లకొచ్చే రూ.16,000 రూపాయల జీతం తీసుకుని ఫ్యామిలీని చూసుకుంటూ చాలా గౌరవంగా బతుకుతున్నారు సార్.మీరు వాళ్ళకేమీ ఇవ్వకున్నా కనీసం పిలిచి మాట్లాడి ఉంటే మీ మీద గౌరవంతో ప్రాణాలిచ్చే వారు సార్. కనీసం నేను మీ బంగారు తెలంగాణలో సంతోషంగా లేను, కనీసం మా తల్లితండ్రులను అయినా సంతోషంగా ఉండేటట్లు నెలనెలా వాళ్ళకి వృద్ధాప్య పింఛన్ నివ్వండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి.. మా కేసీఆర్ అని ఓటు వేశారు సార్. ప్రతి రోజూ ఈ అరెస్ట్ లేంది, ఈ లాఠీ దెబ్బలు ఏంది సార్, నా ఆర్టీసీ సోదరులు ఏం తప్పు చేశారని ఇంకా ఎంతమందిని ఆత్మహత్యలూ చేసుకునేటట్టు చేస్తారు. అందుకే ఇవన్నీ భరించలేకనే నా ఆత్మాభిమానాన్ని చంపుకునే ఉద్యోగం చేయలేను, అందుకే నేను మీ బంగారు తెలంగాణలో ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగిని కాదు, మీ మాయ మాటలు నమ్మి మోసపోయిన తెలంగాణ సమాజంలోని వ్యక్తిని, నీ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగిగా ఉన్నాను కాబట్టి తక్షణమే నా తల్లితండ్రులకు వృద్ధాప్య పింఛను ఒకటి ఇవ్వండి. పేరు మీద సెంటు భూమి లేదు కాబట్టి మూడెకరాల పొలం, అలాగే నా పిల్లలకి ప్రభుత్వ స్కూల్ లో చదువు, నాకు ఉండటానికి ఇల్లు లేదు కనుక డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వండి ఒకవేళ మీరు ఏమి ఇవ్వకున్నా సమాజంలో గౌరవంగా బ్రతికే అవకాశం కల్పించాలని కోరుతూ అలాగే నా ఉద్యోగ రాజీనామాను తక్షణమే ఆమోదించగలరు. ఇట్లు ఎల్ కృష్ణ, స్టాఫ్ నెంబర్ 176822, ఆర్టీసీ కండక్టర్ సూర్యాపేట డిపో. " ఇలా తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ గారికి పంపించాడు. ఇలా అందరూ రాస్తే రోజు పుస్తకాలు చదవడం మానేసి లెటర్లు చదువుకోవాలని కొందరు అంటుంటే.. అలా చదివితేనైనా మానవత్వం అనేది పుట్టుకొస్తది మా కేసీఆర్ కి అని కొందరు అంటున్నారు.