ఎంఐఎం వెరైటీ విధానం!

 

 

 

హైదరాబాద్‌లో రాజకీయంగా మంచి పట్టు వున్న ఎం.ఐ.ఎం. పార్టీ రాష్ట్ర విభజన విషయంలో వ్యవహరిస్తున్న విధానం చాలా వెరైటీగా, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మొదటి నుంచీ రాష్ట్రం సమైక్యంగా వుండాలని వాదిస్తూ వచ్చిన ఎం.ఐ.ఎం. మీద తెలుగు ప్రజలకు ఎంతో గౌరవం ఏర్పడింది. విభజనవాదులు రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చేసే ప్రయత్నాలను ఎం.ఐ.ఎం. అడ్డుకుంటుందన్న నమ్మకం అందరిలోనూ పెరిగింది.

 

 

అయితే ఆమధ్య ఎం.ఐ.ఎం. అకస్మాత్తుగా తన విధానాన్ని మార్చుకుంది. ‘‘రాష్ట్రం సమైక్యంగానే వుండాలి. ఒకవేళ రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే రాయల తెలంగాణ ఏర్పడాలి’’ అని ఒక విచిత్రమైన వాదనని తెరమీదకు తీసుకొచ్చింది. దాంతో సమైక్యవాదులందరూ ఈ వాదనను ఎలా అర్థం చేసుకోవాలో అర్థంకాక కన్ఫ్యూజ్ అయిపోయారు.  రాయల తెలంగాణ ఏర్పాటయితే ఎం.ఐ.ఎం.కి ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేకపోయినా అలాంటి స్టేట్‌మెంట్ ఎం.ఐ.ఎం. నేతల నుంచి ఎందుకొచ్చిందో ఆ భగవంతుడికే తెలియాలి. విభజన తప్పదంటే హైదరాబాద్‌లో సీమాంధ్రులు ప్రశాంతంగా ఉండాలంటే హైదరాబాద్‌ని యూటీ చేయాలన్న డిమాండ్ తెరమీదకి వచ్చినప్పుడు... మీ ప్రశాంతత సంగతి మాకెందుకు.. హైదరాబాద్‌ని యూటీ చేయడానికి మేం ఒప్పుకోం అని ఎం.ఐ.ఎం. తేల్చిపారేసింది.




ఎం.ఐ.ఎం.కి తమమీద మీద అభిమానం లేకపోతే లేకపోయింది.. కనీసం జాలీ దయా కూడా లేకుండా పోయాయే అని సీమాంధ్రులు బాధపడుతున్నారు. ఈమధ్యకాలంలో ఎం.ఐ.ఎం. తన రాయల తెలంగాణ నినాదంలో మార్పులు, చేర్పులు కూడా చేసింది. రాయల తెలంగాణ అంటే మొత్తం తెలంగాణ జిల్లాలు, నాలుగు రాయలసీమ జిల్లాలతో ఏర్పడేది కాదట. పది తెలంగాణ జిల్లాలు ప్లస్ రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలతో ఏర్పడిన రాయల తెలంగాణ ఏర్పడితేనే ఎం.ఐ.ఎం. ఒప్పుకుంటుందట. రాయలసీమలోని రెండు జిల్లాల మీద ప్రేమ ఎందుకో, మిగతా రెండు జిల్లాలు చేసిన పాపమేమిటో ఎం.ఐ.ఎం. నాయకులకు తప్ప ఎవరికీ అర్థంకాని విషయం. మొత్తమ్మీద రాష్ట్ర విభజన ఇష్యూలో తెలుగు ప్రజలను అయోమయానికి  గురిచేయడానికి ఎం.ఐ.ఎం. కూడా తనవంతు కృషి చేస్తోంది.