పసుపు టాక్సీలకి ప్రమాదాలు జరగవు

ఓలాలు, ఉబర్లు వచ్చేసిన తరువాత ఏది కారో, ఏది టాక్సీనో కనుక్కోవడం కష్టమైపోయింది. కానీ ఒకప్పుడు టాక్సీ అంటే స్పష్టంగా పచ్చటి పసుపురంగులోనే ఉండేది. ఇప్పటికీ చాలా దేశాలలో టాక్సీ అంటే అల్లంత దూరాన పసుపు రంగులో కనిపించే వాహనమే!


టాక్సీలు పసుపురంగులో ఉండటానికి ప్రత్యేకించిన కారణాలు ఏవీ లేవు. 1907లో టాక్సీ సర్వీసులను ప్రారంభించినప్పుడు, మిగతా వాహనాలకంటే భిన్నంగా కనిపించాలి కాబట్టి... అరుదుగా ఉండే పసుపు రంగుని ఎంచుకున్నారు. రోడ్డు మీద వేగంగా దూసుకుపోయే వాహనాల మధ్య పసుపురంగుని గుర్తించడం నిజంగానే తేలికని కొన్ని అధ్యయనాలు రుజువుచేశాయి.

 

ఇప్పుడు ఏకంగా పసుపురంగు టాక్సీలకి ప్రమాదాలు కూడా తక్కువ జరుగుతాయంటూ ఓ పరిశోధన నిరూపిస్తోంది. సింగపూర్‌ జాతీయ విశ్వవిద్యాలయంలోని నిపుణులు ఈ పరిశోధన కోసం 16,700 కార్లున్న ఓ టాక్సీ సంస్థను (The Singapore taxi company) ఎన్నుకొన్నారు. ఈ కంపెనీలో మూడింత ఒక వంతు పసుపు కార్లుంటే, మరో రెండు వంతులు నీలం కార్లున్నాయి. వీటన్నింటినీ ఓ 36 నెలలపాటు దగ్గరగా పరిశీలించారు. చివరికి పసుపురంగు టాక్సీలకి ప్రమాదం జరిగే అవకాశం పదిశాతం తక్కువని తేల్చారు.

 

ఇలా ప్రమాదాలు తక్కువ జరగడం వల్ల మనుషులకి దెబ్బలు తగిలే అవకాశాలు ఎలాగూ తగ్గుతాయి... కార్లకి రిపేర్ల పేరుతో వేల రూపాయలు వదిలించుకునే శ్రమా తగ్గుతుందని గుర్తుచేస్తున్నారు. The Singapore taxi companyనే తీసుకుంటే... ఇందులో ఉన్న నీలం కార్లని కూడా పసుపురంగులోకి మార్చేయడం వల్ల ఏటా 917 ప్రమాదాలు తప్పిపోతాయనీ, కోటి రూపాయలకు పైగా ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు.

 

ఇంతకీ పసుపురంగుకీ ప్రమాదాలు తగ్గడానికి మధ్య సంబంధం ఏమిటీ! అంటే కారణం తేలికగానే స్ఫురిస్తుంది. రోడ్డు మీద పోయే ముదురురంగు కార్లతో పోలిస్తే పసుపు టాక్సీలు కంటికి సులభంగా కనిపిస్తాయి. అవి ఎంత దూరంలో ఉన్నాయో అంచనా వేయడం తేలికవుతుంది, దగ్గరగా ఉన్నప్పుడు పక్కకి తప్పుకోవడంలోనూ అంచనా తప్పదు. అంచేత, ప్రమాదాలూ తక్కువగానే సంభవిస్తాయి.


పసుపు టాక్సీలు సురక్షితం అని తేలడంతో... ప్రజారవాణా అంతా కూడా పసుపు టాక్సీలలో ఉండేలా చర్యలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. మరి ఆ మాటని ప్రభుత్వాలు వింటాయో లేదో!

 

- నిర్జర.