కార్బైడ్‌ పండ్లు ప్రాణాంతకాలు!

 

పండ్లంటే ఎవరికి ఇష్టం ఉండదు! అందులోనూ మామిడి, అరటి, యాపిల్‌ అంటే నోరూరనివారు ఎవరుంటారు? కాని ఆ పండ్లని మగ్గపెట్టేందుకు వాడే విషపదార్థాల గురించి వింటుంటేనే భయం కలుగుతోంది. మరీ ముఖ్యంగా కార్బైడ్‌తో పండించిన పండ్లని ముట్టుకోవాలంటేనే దడ పుడుతోంది. మరి నిజంగానే కార్బైడ్‌ అంత ప్రమాదకరమైనదా? అయితే దాన్ని ఎందుకు వాడుతున్నారు? దాని బారిన పడకుండా ఉండటం ఎలా?... మీరే చూడండి!

 

ఇందుకు వాడతారు!

మామిడి, అరటి వంటి పండ్లను చెట్టు మీద నుంచి కోసిన తరువాత కూడా మగ్గేందుకు కాస్త సమయం పడుతుంది. ఇది నిదానంగా జరిగే చర్య. పైగా వాటిని మగ్గపెట్టేందుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా కాకుండా కాస్త కేల్షియం కార్బైడ్‌ని కనుక వాటి మీద ప్రయోగిస్తే... అవి ఇట్టే పండిపోతాయి. లేదా కనీసం పండినట్లు కనిపిస్తాయి. ఇందులో మరో లాభం కూడా ఉంది! పచ్చిగా ఉండగానే కాయలని కోయడం, అవి గట్టిగా ఉన్నప్పుడే మార్కెట్‌కు తరలించడం వల్ల పండ్లు దెబ్బతినే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. పైగా కార్బైడ్‌తో పండిన పండ్లు లోపల ఇంకా పచ్చిగానే ఉంటాయి కాబట్టి చాలా రోజులు నిలవ ఉంటాయి కూడా! ఇక మిలమిలా మెరిసిపోయే కార్బైడ్‌ పండ్లని చూసిన కొనుగోలుదారులకి, వాటిని రుచి చూడాలన్ని ఆశ ఎలాగూ కలుగుతుంది.

 

ఇదీ ప్రమాదం!

కేల్షియం కార్బైడ్‌లో అర్సెనిక్‌, ఫాస్పరస్‌ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి అధిక మొతాదులో శరీరంలోకి చేరితే ఏర్పడే సమస్యలు అన్నీఇన్నీ కావు. తలనొప్పి, కళ్లు తిరగడం, నిద్రలేమి మొదలుకొని నరాలకు సంబంధించిన నానారకాల సమస్యలకూ ఇది దారితీయవచ్చు. చర్మం మీద కూడా కార్బైడ్‌ ప్రభావం అధికంగా ఉంటుంది. దద్దుర్లు నుంచి చర్మక్యాన్సర్‌ వరకూ కార్బైడ్‌ పండ్లని తినేవారిలే ఎలాంటి రోగమైనా తలెత్తవచ్చు. ఇక గుండె, మెదడు, కీళ్లు, జీర్ణాశయం వంటి శరీర భాగాల మీద ఈ కార్బైడ్‌ తీవ్ర ప్రభావం చూపుతుందనే వార్తలూ వినిపిస్తూ ఉంటాయి. గర్భిణీ స్త్రీలు కనుక కార్బైడ్‌తో మగ్గపెట్టిన పండ్లని తింటే... అవి వారికీ, వారి కడుపులో ఉన్న బిడ్డకీ కూడా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

 

మరేం చేయడం!

కార్బైడ్‌ గురించి ప్రభుత్వాలు, న్యాయస్థానాలు ఎన్ని హెచ్చరికలు చేసినా కూడా, రూపాయి కోసం వ్యాపారస్తులు పడే కక్కుర్తి ముందు ఉపయోగం లేకుండా పోతోంది. ఆరోగ్య శాఖ అధికారులు కూడా కార్బైడ్‌ వాడకాన్ని చూసీచూడనట్లు ఊరుకుంటారన్న ఆరోపణలూ ఉన్నాయి. కాబట్టి కార్బైడ్‌ పండ్ల నుంచి దూరంగా ఉండాల్సిన బాధ్యత వినియోగదారులదే. ఇప్పుడు కార్బైడ్‌తో పండించని పండ్లు అంటూ ప్రత్యేకంగా కొన్ని దుకాణాలు వెలుస్తున్నాయి. నమ్మకం ఉంటే వాటిలో పండ్లను తీసుకోవచ్చు. లేదా పండ్లని కొనుగోలు చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకున్నా సరిపోతుంది.

 

- కార్బైడ్‌తో పండించిన పండ్లు చూడ్డానికి మరీ పచ్చగా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తాయి.

 

- చాలా సందర్భాలలో పండ్లు ఒక చోట మగ్గి, మరో చోట పచ్చిగా ఉన్నట్లు రెండు రంగులలో ఉంటాయి.

 

- పైకి పండిపోయినట్లు ఉండి, లోపల పచ్చిగా ఉందంటే.... అది ఖచ్చితంగా కార్బైడ్‌ మహిమే!

 

- కార్బైడ్‌తో పండిన పండ్లు కృత్రిమంగా మగ్గి ఉంటాయి కాబట్టి, వాటిలోని తీపిశాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది.

 

- అన్నింటికీ మించి మామూలు పండ్లు మగ్గినప్పుడు వచ్చే ఆ సువాసన, కార్బైడ్ పండ్లలో కనిపించదు. అంటే రంగు, రుచి, వాసనల ద్వారా ఫలానా పండు కార్బైడ్‌తో మగ్గించారు అని తేలిపోతుందన్నమాట.

 

ఇదీ కార్బైడ్ పండ్ల కథ! ఇంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఒకోసారి మోసపోయే ప్రమాదం ఉంది కనుక, తినబోయే ముందర కాసేపు పండ్లను నీటి ధార కింద ఉంచితే, వాటిలోని విష రసాయనాలు చాలావరకూ కొట్టుకుపోయే అవకాశం ఉందని సూచిస్తున్నారు నిపుణులు.

 

- నిర్జర.