పోలవరం రివర్స్ టెండరింగ్...కేంద్రానికి ఇష్టం లేదా ?

 

ఏపీ సీఎంగా పాలనాపగ్గాలు చేపట్టిన జగన్ తనదైన మార్క్ వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల నుంచి తప్పుకోవాలని నవయుగ కంపెనీకి నోటీసులు జారీ చేసింది.  జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందని అంటూ దానిని వెలికి తీస్తానని పేర్కొంటూ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది జగన్ ప్రభుత్వం. 

నిపుణుల కమిటీ నివేదిక మేరకు ప్రాజెక్టు నిర్మాణ వ్యయ అంచనాలను పెంచారని జగన్ సర్కారు భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ దిశగా అడుగులేస్తోంది. అయితే తాజాగా పోలవరం టెండర్లను రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం పట్ల కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు. ‘డ్యామ్ సేఫ్టీ బిల్లు 2019’పై టీడీపీ ఎంపీ జయదేవ్ నిన్న పార్లమెంట్‌లో మాట్లాడారు. 

పోలవరం ప్రాజెక్టుకు రూ.55 వేల కోట్లను మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. నిర్ణీత గడువులోగా ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడాలని పేర్కోన్నారు. ఏపీ ప్రజలు పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీ ప్రజలు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. ‘‘ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీలు 150 ఏళ్ల క్రితం కట్టినవి. రాష్ట్రంలో ఉన్న మరో 50 డ్యామ్‌లు, రిజర్వాయర్లు పాతవని, ఈ డ్యామ్‌ల భద్రత గురించి ఏ చర్యలు తీసుకుంటున్నారని గల్లా జయదేవ్ కేంద్ర మంత్రిని ప్రశ్నించారు. 

అయితే గల్లా జయదేవ్ ప్రశ్నల పట్ల స్పందించిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజెక్టు వ్యయం కచ్చితంగా పెరుగుతుందని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో కచ్చితంగా చెప్పాలేని పరిస్థితులు ఏర్పడతాయని కూడా అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కావడంతో దీని వ్యయాన్ని కేంద్రమే భరిస్తోందని, అలా ఇప్పటి వరకూ కేంద్రం రూ.5 వేల కోట్లు ఖర్చు చేసిందని అందులో రూ.3 వేల కోట్లకు సంబంధించి ఆడిట్ పూర్తయ్యిందని ఆయన చెప్పుకొచ్చారు. 

ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందనేది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. కొత్తగా టెండర్లను పిలవాలనుకోవడం ఈ పోలవరం ప్రాజెక్టుకు ఇబ్బందిగా మారనుందని ఆయన పేర్కొన్నారు. అలా పిలవడం వలన ప్రాజెక్టు వ్యయం మళ్ళీ పెరుగుతుందని మంత్రి తెలిపారు. టెండర్ల రద్దు ప్రభావం ప్రాజెక్టు మీద పడుతుందని, ప్రాజెక్ట్ వ్యయం పెరగడంతో పాటు సమయం కూడా వృధా అవుతుందని అన్నారు. 

అందుకే గత రాష్ట్ర ప్రభుత్వం అందుకే టెండర్లను రద్దు చేయకుండా ప్రాజెక్ట్ వేగాన్ని పెంచేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించిందని ఆయన పేర్కోన్నారు. అయితే పోలవరం మీద కేంద్ర మంత్రి ఇలా స్పందించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. దీనిని బట్టి చూస్తే జగన్ చేస్తున్న పనిని కేంద్రం వ్యతిరేకిస్తోంది, మరి జగన్ ఏమని కవర్ చేసుకుంటారో చూడాలి మరి.