టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి?

 

కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను ఎలాగైనా ఓడించి అధికారం దక్కించుకోవాలనుకుంది. కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలతో కలిసి కాంగ్రెస్ ప్రజకూటమి కూడా ఏర్పాటు చేసింది. ఒకానొక దశలో టీఆర్ఎస్, ప్రజకూటమిల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగుతుంది అనుకున్నారంతా. కానీ ఫలితాలు వార్ వన్ సైడ్ అని తేల్చేశాయి. టీఆర్ఎస్ 88 సీట్లతో ఘన విజయం సాధించి అధికారం నిలబెట్టుకుంది. ప్రజకూటమి మాత్రం కేవలం 21 సీట్లతో సరిపెట్టుకుంది. అందులో కాంగ్రెస్ కి 19 సీట్లు రాగా, టీడీపీకి 2 సీట్లు వచ్చాయి. ఇక టీజెఎస్, సీపీఐ అయితే ఖాతా కూడా తెరవలేదు. ఒకరకంగా చెప్పాలంటే పోటీ ఇస్తుందనుకున్న కూటమి.. టీఆర్ఎస్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. కూటమి ఓటమికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీల పొత్తుని ప్రజలు స్వాగతించలేదని, అభ్యర్థుల ఎంపిక సరిగా జరగలేదని, అభ్యర్థుల ప్రకటన ఆలస్యమైందని ఇలా ఎవరికీ తోచిన కారణాలు వారు చెప్తున్నారు. అయితే ఈ ఓటమిని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. అవసరమైతే రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్నికలకు ముందు.. కూటమి గెలిచినా ఓడినా పూర్తీ బాధ్యత నాదే అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అంతేకాదు ఓడిపోతే గాంధీ భవన్ లో అడుగు కూడా పెట్టనని అన్నారు. మరి ఈ మాటలకు ఉత్తమ్ కట్టుబడి ఉన్నారో లేదో తెలీదు కానీ.. పార్టీలోని కొందరు నేతలు మాత్రం నాయకత్వ మార్పు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ రానున్న ఐదారు నెలల్లో పంచాయతీ, స్థానిక సంస్థలు, సహకార, మున్సిపాల్టీ, పార్లమెంట్ ఇలా వరుసగా ఎన్నికలు ఉన్నాయి. ఓటమి నిరుత్సాహంతో ఉన్న కార్యకర్తలు ఉత్సాహంగా పని చేయాలంటే నాయకత్వ మార్పు జరగాలనే అభిప్రాయం కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికే అధిష్టానం కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ టీపీసీసీ అధ్యక్షుడిని మార్చాల్సి వస్తే ఆ పదవి రేవంత్ రెడ్డిని వరించే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు దాదాపు ఓడిపోయారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క వంటి నేతలు మాత్రం తక్కువ మెజారిటీతో బయటపడ్డారు. రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయారు. అయితే రేవంత్ రెడ్డికి రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో అభిమానులున్నారు. ప్రభుత్వం మీద ధీటుగా విమర్శలు చేస్తూ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నారు. అలాంటి దూకుడున్న నేతకి పగ్గాలు అప్పగిస్తే కార్యకర్తల్లో నూతనోత్సాహం వచ్చి చురుగ్గా పనిచేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి పార్టీలో యువ రక్తం రావాలని కోరుకుంటున్న రాహుల్ గాంధీ.. తెలంగాణ పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగిస్తారేమో చూడాలి.