తొక్కుదామనుకుంటే ఏకు మేకయ్యాడు రేవంత్ !

 

ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసి తిరిగి పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించి మొదటి సారి లోక్ సభలో అడుగుపెట్టిన మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తెరాస దుమ్ము దులిపి పారేశారు. జీరో అవర్ లో ఆయన లేవనెత్తిన అంశాలు పలువురుని ఆకట్టుకున్నాయి. పోడు భూముల వివాద అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించి ఇటీవల అటవీ శాఖ అధికారిణి అనితపై జరిగిన దాడి సహా పోడు భూముల సమస్యల గురించి మాట్లాడి దశాబ్దాలుగా ప్రభుత్వం, ఆదివాసీల మధ్య నలుగుతున్న భూ సమస్య పరిష్కారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. 

రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే తెలంగాణలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, తద్వారా శాంతిభద్రతల సమస్య తలెత్తుతోందని కాగజ్ నగర్ దాడిని ప్రస్తావించారు. ఐదు లక్షల హెక్టార్ల భూముల విషయంలో సమస్య కొన్నేళ్లుగా సాగుతోందన్నారు. అడవిని పోడు చేసి ఆదివాసీలు జీవిస్తుండగా వారిని వెళ్లగొట్టేందుకు సర్కార్‌ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఐదో షెడ్యూల్‌లో ఉన్న సున్నితమైన ఈ సమస్య విషయంలో కేంద్ర అటవీ, హోంశాఖ మంత్రులు జోక్యం చేసుకొని తక్షణమే సమీక్ష జరపాలని కోరుతున్నానని రేవంత్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు. 

ఇక కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా సభలో మాట్లాడారు. ఇంటర్ విద్యార్థుల అంశాన్ని సంజయ్‌ ప్రస్తావించారు. అయితే ఈ విషయాలు ఇప్పుడు హైలైట్ గా నిలుస్తున్నాయి. దానికి కారణం ఈ ఇద్దరూ అసెంబ్లీకి పోటీ చేసి ఓడి మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ కి పోటీ చేసి గెలిచారు. అయితే సంజయ్ సంగతి ఏమో కానీ రేవంత్ ని మాత్రం అప్పట్లో కేసీయార్ గట్టిగా టార్గెట్ చేశారు. అదేదో సినిమాలో అన్నట్టు గేటుని ఎంత గట్టిగా నెడితే అంత బలంగా వెనక్కి వస్తుందని అలాగే వచ్చి నేషనల్ లెవల్లో కెసీఆర్ కి చెమటలు పట్టిస్తున్నాడు రేవంత్. బీజేపీలోకి వెళ్తాడని ప్రచారం కూడా జరుగుతోంది. నిజంగా అది గనుక జరిగిందా ? కేసీఆర్ ఒంటెత్తు పోకడ పాలనకి చరమ గీతం పాడడానికి బీజేపీ మొదటి అడుగు వేసినట్టే.