కేసీఆర్‌పై సూమోటో కేసు

 

తెలంగాణ హోం మత్రి నాయిని నర్సింహా రెడ్డి 2014 లో ముషీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలనుకున్నారు.కానీ కేసీఆర్‌ నాయిని ని ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేయమని సూచించారట.బాగా డబ్బున్న సుధీర్‌రెడ్డి మీద పోటీ చేయలేనని నాయిని అనటంతో రూ.10 కోట్లు ఇస్తా పోటీ చెయ్యమని కేసీఆర్‌ అన్నారట.కానీ దానికి నాయిని సుముఖత చూపకపోవటంతో ఎమ్మెల్సీగా చేసి నా కేబినెట్‌లో పదవిస్తానని హామీ ఇచ్చారట.అన్నమాట ప్రకారమే నాయినికి హోమ్ మంత్రి పదవి కట్టబెట్టారు.కానీ రానున్న ఎన్నికల్లో మాత్రం నాయిని తన అల్లుడుకి ముషీరాబాద్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయతిన్స్తున్నారు.శ్రీనివాస రెడ్డి కి టికెట్ విషయంపై చర్చించేందుకు ప్రయత్నిస్తున్న నాయినికి కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ దొరకట్లేదట.టికెట్ విషయం పక్కనపెడితే  కేసీఆర్‌  రూ.10 కోట్లు ఇస్తా అన్నారని నాయిని చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుంటుంది.

నాయిని నర్సింహా రెడ్డి చేసిన ప్రకటనను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ సూమోటోగా స్వీకరించి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది.అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు‌ రేవంత్‌రెడ్డి కోరారు. ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి ఖర్చు పరిమితి రూ.28 లక్షలుకాగా ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 10 కోట్లు ఇస్తానని చెప్పినట్లు స్వయంగా నాయిని నర్సింహారెడ్డి చేసిన ప్రకటనను పరిగణనలోకి తీసుకోవాలని రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.అధికార పార్టీ డబ్బుతో గెలవాలనుకుంటోందని,రూ.25 వేల కోట్లు మేర అక్రమ సంపాదన ఉందని తాము చేస్తున్న ఆరోపణలు నిజమయ్యాయని ద్వజమెత్తారు.నియోజక వర్గానికి రూ. 10 కోట్లు, తన నియోజక వర్గం కొడంగల్‌లో రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు అధికార పార్టీ సిద్ధంగా ఉందని ఆయన ఆరోపించారు.ప్రతిపక్ష నేతలపై కాకుండా ముఖ్యమంత్రి ఉంటున్న ప్రగతిభవన్‌, మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు, ఎంపీ కవిత ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేయాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు.