తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి రేవంత్ రెడ్డి...!


తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది రేవంత్ రెడ్డి గురించే. రేవంత్ రెడ్డి ఎప్పుడు పార్టీ మారుతాడా..! అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి..కాంగ్రెస్ లో చేరుతున్నట్టు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రేవంత్ ఓ క్షణంలో అయినా కాంగ్రెస్ పార్టీలోకి మారే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ వర్గాలు. ఇప్పుడు తాజాగా మరో వార్త హల్ చల్ చేస్తుంది. తాను కాంగ్రెస్ లో రావడానికి సిద్ధమే అని… తనకు టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు తన వర్గానికి చెందిన నాయకులకు మొత్తం కలుపుకుని 35 టికెట్లు ఇవ్వాలని ఆయన కాంగ్రెస్ హైకమాండ్ ముందు కండీషన్ పెట్టారట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... కాంగ్రెస్ పార్టీ రేవంత్ డిమాండ్లకు దాదాపుగా అంగీకరించిందని తెలుస్తోంది. దీంతో రాజకీయ విశ్లేషకులు మరో కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తీరు చూస్తుంటే... వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి కాబోయేది రేవంత్ రెడ్డి అని అర్థమవుతోందని అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో బయటి నుంచి వచ్చిన నాయకుడికి మహా అయితే ఐదారు సీట్ల వరకు ఇచ్చే అవకాశం ఉందని… కానీ రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇన్ని సీట్లలో పార్టీని గెలిపిస్తానని హామీ ఇచ్చే వ్యక్తికి ఆ తరువాత సీఎం సీటు కూడా ఇవ్వాల్సి ఉంటుందనే విషయం కాంగ్రెస్ హైకమాండ్ కు బాగా తెలుసనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వీటిన్నింటినీ బట్టి చూస్తుంటే… రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ లోని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో..