రేవంత్ రెడ్డి కొత్త ఆరోపణలు

 

కాంగ్రెస్ పార్టీతో తెదేపా దాని అధ్యక్షుడు చంద్రబాబు కుమ్మక్కయరని వైకాపా నేతలు ఆరోపిస్తుంటే, తల్లీపిల్ల కాంగ్రెస్ పార్టీలు ఒకదానినొకటి రక్షించుకొంటున్నాయని తెదేపా ఆరోపిస్తోంది. కానీ, వారి మద్యలో వేలు పెట్టేందుకు కాంగ్రెస్ మాత్రం ఎన్నడూ ప్రయత్నం చేయకపోవడం విశేషం. దానిని బట్టి కాంగ్రెస్ లోపాయికారిగా ఆ రెండు పార్టీలతో కూడా రహస్యంగా పొత్తులు పెట్టుకొని వాటితో డబుల్ గేం ఆడుతోందా అనే అనుమానం కలుగుతోంది.

 

వైకాపాతో ఆ పార్టీకి జగన్ అక్రమాస్తుల కేసులో అవినావ భావ సంబంధం ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. ఆ రెండు పార్టీలను వేరు చేస్తూ వాటి మద్య ఉన్నఓ సన్నటి గీత జగన్ కేసులతో చెరిగిపోవడంతో ఇక్కడ తుంటి మీద కొడితే అక్కడ పళ్ళు రాలుతాయన్నట్లు తయారయింది ఆ రెండు పార్టీల పరిస్థితి.

 

ఇక, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ తెదేపా దయా దాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉందనేది వైకాపా ఆరోపణ. తెదేపా తలుచుకొంటే అవిశ్వాసం పెట్టి కిరణ్ కుమార్ ప్రభుత్వాన్ని చిటికలో కూల్చగలదని, కానీ జగన్ను జైలు నుండి బయటకి రానీయకుండా ఉండేందుకే అవిశ్వాసానికి వెనకాడుతోందని వైకాపా ఆరోపణలు.

 

వీరి ఆరోపణ ప్రత్యారోపణలతో ప్రజలలో ఎవరి మాట నమ్మాలో తెలియని పరిస్థితి నెలకొంది. కానీ, ఆ రెండు పార్టీలు మాత్రం రాజకీయ చదరంగం సాగిస్తూనే ఉన్నాయి.

 

జగన్ అక్రమాస్తుల కేసులో మొన్న విజయసాయి రెడ్డిని కూడా జగన్ ఉన్న చంచల్ గూడా జైలుకే తరలించడంతో వారినందరినీ, ఒకే జైలులో ఎందుకు పెడుతున్నారని తెదేపా నేత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్నీ ప్రశ్నించారు. జగన్‌ కోరిక మేరకు వారినందరినీ ఒకే జైలులో పెట్టి వారికి ఆయన పరోక్షంగా సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. సునీల్‌ రెడ్డిని కూడా అదే జైలులో కొనసాగిస్తూ,జగన్‌కు వ్యక్తిగత సహాయకుడిగా పని చేస్తున్నందునే ఆయన బెయిల్‌ పిటిషన్‌ కూడా ఇంతవరకు వేయకపోవడం చూస్తే, ఈ వ్యవహాల వెనుక కిరణ్ కుమార్ రెడ్డి పరోక్ష సహాయసహకారలున్నాయని అర్ధం అవుతోందని ఆయన ఆరోపించారు.ఇప్పటికయినా ప్రభుత్వం వారందరినీ వేర్వేరు జైళ్ళలో పెట్టాలని రేవంత్ డిమాండ్ చేసారు.

 

అదేవిధంగా జగన్ కి వ్యతిరేఖంగా మాట్లాడుతున్న డీయల్, శంకర్ రావు, బొత్స, దామోదర రాజానరసింహ వంటివారినందరినీ కూడా ఆయన ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం ప్రజలు గమనిస్తున్నారని రేవంత్ మరో కొత్త ఆరోపణ కూడా చేసారు. తద్వారా వారిలో ముఖ్యమంత్రి పట్ల మరింత వ్యతిరేఖత పెంచాలని ప్రయత్నించినట్లు అర్ధం అవుతోంది.అయితే, సీబీఐ కోర్టు విజయసాయి రెడ్డికి రిమాండ్ విదిస్తే, దానికి ముఖ్యమంత్రే కారణమన్నట్లు రేవంత్ రెడ్డి మాట్లాడటం విచిత్రం.