ఎవరికి వాళ్లే సీఎంలు...

 

నేను ఎప్పటికైనా సీఎం అవుతా... నాకు ముఖ్యమంత్రి పదవే లక్ష్యం..ఇంత ధైర్యంగా ఈ మాటలు చెబుతున్నది ఎవరబ్బా అనుకుంటున్నారా... ఎవరో కాదు రేవంత్ రెడ్డి. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. నిజానికి టీడీపీ లో ఉన్నప్పుడు ఉన్న రేవంత్ రెడ్డికి..కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డికి చాలా తేడానే ఉందని చెప్పొచ్చు. టీడీపీలో ఉన్న రోజుల్లో రేవంత్ రెడ్డి  మీడియా ముందుకు వచ్చారంటే  సెన్సేషనే. కేసీఆర్ పై ఆయన చేసినట్టుగా  ఇంకెవరూ విమర్శలు గుప్పించేవారు కారు... అంత ధైర్యంగా కేసీఆర్ పై మాటల యుద్దం చేసిన ఘనత కూడా రేవంత్ రెడ్డికే దక్కింది. అంతేకాదు ఎవరికి భయపడని కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డికి కాస్త భయపడినట్టే చెప్పొచ్చు. అందుకే పక్కా ప్లాన్ చేసి ఓటుకు నోటు కేసులో ఇరికించారన్న వార్తలు కూడా వచ్చాయి. ఇక ఆతరువాత రేవంత్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పడం.. కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం జరిగాయి. అయితే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న కొత్తలో ఉన్నంత ఊపుగా రేవంత్ ఇప్పుడు లేరని చెప్పొచ్చు. వారంలో నాలుగైదు ప్రెస్‌మీట్లు పెట్టే రేవంత్.. ఇప్పుడు నెలకొకటి రెండింటికే పరిమితమవుతున్నాడు.

 

ఇదిలా ఉండగా..ఉన్నట్టుంది ఇప్పుడు ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి రావడంతో రేవంత్ రెడ్డి దీనిపై స్పందించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ఎప్పటిలాగే కేసీఆర్ పై దుమ్మెత్తిపోశారు. మోదీ-కేడీ కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగానే ఏసీబీ కేసుల సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ప్రసార సాధనాల్లో, పత్రికల్లో తాటికాయంత అక్షరాలతో రాయించి కేసు జరిగిన రోజు కంటే దానికి ఎక్కువ ప్రాధాన్యతను కల్పించి మమ్మల్ని భయపెట్టో.. బెదిరించో, లొంగదీసుకునో.. తమ రాజకీయ ప్రయోజనాన్ని కాపాడు కోవడానికి అటు మోదీ-ఇటు కేడీ ఆడుతున్న నాటకంలో భాగమే.. కేసీఆర్ రివ్యూ వ్యవహారం" అని రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం చేశారు. అంతేకాదు ఇంకా పలు సంచలన వ్యాఖ్యలే చేసారు. " పార్టీ నాయకత్వం నన్ను సరిగ్గా వాడుకోవడం లేదు. నా స్థాయికి తగిన పదవి ఇవ్వాలని పలుమార్లు అధిష్టానాన్ని డిమాండ్ చేశాను. నాకు ముఖ్యమంత్రి పదవే లక్ష్యం. ఇప్పుడు కాకున్నా, కొన్నేళ్ల తర్వాతనైనా సీఎం అవుతాను. కాంగ్రెస్‌ పార్టీలో చాలామంది నేతలు తన మాటను వింటారు. నా సలహా మేరకే వేటుపడిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌ కుమార్‌లు దీక్ష చేశారు" అని రేవంత్ రెడ్డి తన మనసులోని కొన్ని మాటలను బయటపెట్టారు. దీంతో రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతల్లో కలకలం రేపుతున్నాయి. నిజానికి కాంగ్రెస్ లో ఉన్న వారందరూ తలలు పండిన నేతలే. దీంతో ఎవరికి వారు తమే ముఖ్యమంత్రి అవుతామని  ఎవరి స్టేట్మెంట్స్ వాళ్లు ఇచ్చేస్తుంటారు. ఇటీవల ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసిన సీనియర్ నేత జానారెడ్డి తాను అన్ని విధాలా ముఖ్యమంత్రి పదవికి అర్హుడునని చెప్పుకున్నారు. మరి ఇప్పుడు వాళ్లందరూ రేవంత్ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూద్దాం..