రేవంత్‌ రాజీనామా చేశారా..? ఎవ్వరూ నోరుమెదపరేంటీ..?

టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి నెలలు గడుస్తోంది. విజయవాడలో చంద్రబాబును కలిసి వస్తూ వస్తూ.. టీడీపీ టిక్కెట్‌పై గెలిచిన ఎంఎల్ఏ పదవి నాకొద్దంటూ.. రాజీనామా సమర్పించినట్టు ఆయనే స్వయంగా మీడియా ముందు ప్రకటించారు కూడా.. అంతకు పార్టీలు మారినవారంతా తమ తమ పదవులకు రిజైన్ చేయలేదు.. కానీ రేవంత్ రాజీనామా చేసి కాంగ్రెస్ చేరారని అందరూ ఆయనను అభినందించారు. కానీ.. పరిస్థితులు చూస్తుంటే రేవంత్ కూడా రాజీనామా విషయంలో వ్యూహాత్మకంగా పావులు కదిపారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆయన తన రిజైన్‌ లెటర్‌ను పార్టీ అధినేత చంద్రబాబుకు సమర్పించారు కానీ.. స్పీకర్‌కు పంపలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

 

మరి ఇంత జరిగినా ఎవ్వరూ ఎందుకు నోరు మెదపడం లేదంటే ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికి ముఖ్యం. రేవంత్ అనర్హత గురించి తెలుగుదేశం ప్రశ్నిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించకుండా పార్టీలో చేర్చుకున్న చంద్రబాబు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇక కేసీఆర్‌ది ఇదే రకమైన పరిస్దితి.. తన అధికారం చెక్కుచెదరకుండా ఉండేందుకు.. ఎవ్వరూ తనకు పోటీకాకుండా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలను నామ రూపాల్లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న గులాబీ బాస్. ఆ వ్యూహాంలో చాలా వరకు విజయం సాధించారు. అలా టీఆర్ఎస్‌లో చేర్చుకున్న వారందరి చేత రాజీనామాలు చేయించలేదు. ఒకవేళ రాజీనామాలు చేయిస్తే.. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు 20 నుంచి 30 ఉపఎన్నికలు ఖాయం. ఈ తలనొప్పంతా ఎందుకని.. రేవంత్‌ విషయంలో ఎక్కడి వారక్కడే గప్‌చుప్ అంటోంది.

 

ఇక లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ కాంగ్రెస్. కొడంగల్‌లో హస్తం పార్టీ ఉపఎన్నికలకు వెళ్లిందే అనుకున్నాం.. కానీ అక్కడ కేసీఆర్ వదులుతాడా..? సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగించైనా సరే.. రేవంత్‌ను అడ్డుకుంటాడు.. కాంగ్రెస్ గెలిస్తే మంచిదే. ఒకవేళ అటు ఇటైతే మాత్రం ఎన్నికల వేళ శ్రేణుల మానసిక స్థైర్యం దెబ్బతిన్నట్లే. ఉపఎన్నికల్లోనూ.. ఇటీవల ముగిసిన ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కారు జోరుగా దూసుకెళ్లింది. ఇంకేదైనా బైపోల్ వచ్చినా.. ఇదే రిజల్ట్ ఖాయమని సర్వేలు చెబుతున్న తరుణంలో.. కాంగ్రెస్ హైకమాండ్ సాహసం చేయదని విశ్లేషకులు భావిస్తున్నారు. సో.. రేవంత్‌ను కదిపేవారు కానీ.. ఇదేంటని అడిగేవారు కానీ లేరని పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.