రేవంత్ వెళ్తున్నాడంటే.. టీడీపీ సైలెంట్ ఎందుకయ్యింది..?

ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ ఒకటే.. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారనే.. ఏ రెండు ఖద్దరు చొక్కాలు కలిసినా దీని పైనే చర్చ.. ఇంతకూ రేవంత్ పార్టీ మారతారా..? తెలంగాణ తెలుగుదేశంలో కేసీఆర్‌ను ఢీకొట్టగల మొనగాడు.. ముఖ్యమంత్రి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న రేవంత్‌ అలాంటి గోల్డెన్ ఛాన్స్‌ని మిస్ చేసుకొని టీడీపీకి వీడ్కోలు పలుకుతాడా..? ఇవే అందరి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్నలు.

 

సరే ఈ సంగతి పక్కనబెడితే.. ఏ పార్టీలోనైనా ఒక సాధారణ నేత వేరే పార్టీలోకి జంప్ అవుతున్నాడని తెలిస్తేనే ఆ పార్టీ మొత్తం అలర్ట్ అవుతుంది. బుజ్జగించో.. లాలించో ఆ నాయకుడిని పార్టీ మారకుండా చూస్తారు. అంతెందుకు తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆకర్ష్ ఉధృతంగా సాగిన కాలంలో తమ నేతలు పక్క పార్టీల్లోకి వెళ్లకుండా ఉండేందుకు అధినేతలు చాలా ప్రయత్నించారు. కానీ రేవంత్ వంటి కీలకనేత బయటకు వెళ్తున్నట్లు వార్తలు వస్తుంటే తెలుగుదేశం నేతలకు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. ఏపీ టీడీపీ కానీ.. టీటీడీపీ కానీ పిన్‌డ్రాఫ్ సైలెంట్.. ఒక్కరంటే ఒక్కరు కిక్కురుమంటే ఒట్టు.

 

సరే అది పోతే పోని.. ప్రెస్ మీట్ పెట్టి యనమలకు 2వేల కోట్ల కాంట్రాక్టు.. పరిటాల, పయ్యావుల కుటుంబానికి బీర్ల ఫ్యాక్టరీ అంటూ సొంతపార్టీ నేతలపై అవాకులు, చవాకులు పేలితే కీలకనేతలెవరూ స్పందించలేదు. నిన్నటికి నిన్న రేవంత్ ఆరోపణలపై స్పందించాల్సిందిగా మీడియా ప్రతినిధులు మంత్రి దేవినేని ఉమాను కోరినా ఆయన సమాధానాన్ని దాటవేశారు. ఒక్క పరిటాల శ్రీరామ్‌ మాత్రం కాస్త ఫైరయ్యాడు. తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలన్నదే రేవంత్ లక్ష్యమని.. ఆ ఉద్దేశ్యంతోనే ఇన్నాళ్లు టీడీపీలో కొనసాగారని చెప్పారు. అయితే ఆ లక్ష్యసాధనలో భాగంగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారని శ్రీరామ్ ఆరోపించారు. ఏదో తెలిసో తెలియకో కుర్రతనంతో పరిటాల శ్రీరామ్ ఏదో కౌంటర్ అన్నట్లుగా మాట్లాడాడే తప్ప ఎవరి నోటా మాట లేదు. టీడీపీ అధినాయకత్వం పాటిస్తున్న ఈ వ్యూహాత్మక మౌనం వెనుక మతలబు ఏంటో అర్థంకాక తలలు పండిన రాజకీయ వేత్తలు సైతం జుట్టుపీక్కుంటున్నారు.