ప‌య్యావుల కేశ‌వ్ ఓడిపోవాలని కోరుకుంటున్న టీడీపీ నేతలు!!

 

ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు మే 23 న వెలువడనున్నాయి. మరి విజయం ఎవరిని వరిస్తుందో తెలీదు కానీ ప్రధాన పార్టీల నేతలు మాత్రం ఎవరికి వారు గెలుపు మాదంటే మాదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఎవరి ధీమా నిజం కానుందో మే 23 న తేలనుంది. అయితే టీడీపీ.. ఒక నియోజకవర్గంలో ఎక్కడ తమ పార్టీ అభ్యర్థి గెలుస్తాడోనని తెగ కలవరపడిపోతుందట. అదేంటి పార్టీ అభ్యర్థి గెలిస్తే సంతోషమేగా అనుకుంటున్నారా? దానికి ఓ సెంటిమెంట్ ఉందిలేండి. ఆ అభ్యర్థి గెలిస్తే టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమవుతుందట. ఇంతకీ ఆ అభ్యర్థి ఎవరో కాదు టీడీపీ సీనియర్ నేత ప‌య్యావుల కేశ‌వ్.

ప‌య్యావుల కేశ‌వ్‌.. ఈ ఎన్నికల్లో అనంత‌పురం జిల్లా లోని ఉర‌వ‌కొండ నుండి టీడీపీ అభ్య‌ర్దిగా బ‌రిలో ఉన్నారు. ఆయన గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం.. ఏంటీ ప‌య్యావుల కేశ‌వ్ గెలుస్తున్నారా.. వామ్మో!! అంటూ తెగ టెన్షన్ పడుతున్నారు. పయ్యావుల 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. ఈ రెండు సార్లు టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక‌ 2014 ఎన్నికల్లో పయ్యావుల ఓడిపోయారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చింది. 2014 ఎన్నిక‌ల్లో ప‌య్యావులపై పోటీ చేసిన వైసీపీ అభ్య‌ర్ది విశ్వేశ్వ‌రరెడ్డి 2275 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత టీడీపీ అధినేత చంద్ర‌బాబు కేశ‌వ్‌కు ఎమ్మెల్సీగా అవ‌కాశం క‌ల్పించి.. శాస‌న మండ‌లిలో చీఫ్ విప్‌గా నియ‌మించారు.

ఉర‌వ‌కొండ నుండి తాజా ఎన్నిక‌ల్లో మ‌రో సారి టీడీపీ అభ్య‌ర్దిగా ప‌య్యావుల బ‌రిలో దిగారు. 2014లో ఓడిన నాటి నుండే ప‌య్యావుల 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం వ్యూహాలు అమ‌లు చేసారు. ఇక‌, అక్క‌డ వైసీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విశ్వేశ్వ‌ర రెడ్డిని బ‌రిలో ఉన్నారు. ఇద్ద‌రి మ‌ధ్య హోరాహోరీ పోరు సాగింది. ఈ ఎన్నిక‌ల్లో ఉర‌వ‌కొండ నుండి ఖ‌చ్చితంగా ప‌య్యావుల గెలుస్తార‌నే ధీమాతో స్థానిక నేతలు ఉన్నారు. అయితే రాష్ట్ర నేత‌లు మాత్రం పయ్యావుల గెలిస్తే 2004, 2009 ఎన్నికల సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమోనని టెన్షన్ పడుతున్నారు. మరి ప‌య్యావుల ఈసారైనా సెంటిమెంట్ బ్రేక్ చేస్తారో లేక అలానే కంటిన్యూ చేస్తారో చూడాలి.