జగన్ కు సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ? వైసీపీ మైండ్ బ్లాక్

గత ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఈ ఎన్నికలలో వైసీపీ పుట్టి ముంచేదిగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో బాబాయ్ ని హత్య చేశారంటూ విపక్షంపై ఆరోపణలు గుప్పించడం ద్వారా సానుభూతి వర్షించి జగన్ పార్టీ విజయానికి దోహదపడిన వివేహా హత్య కేసు.. ఐదేళ్లు గిర్రున తిరిగేసరికి జగన్ కు చుట్టుకుంది. హత్య కేసు నిందితులకు వత్తాసు పలుకుతున్న జగన్ పై సొంత కుటుంబీకులే విమర్శలు గుప్పిస్తుండటం, కేసు దర్యాప్తు, విచారణలో వేళ్లన్నీ వైసీపీ కడప లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి అవినాష్ రెడ్డివైపే చూపుతుండటం, ఆ అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తున్నారంటూ జగన్ పై అన్ని వర్గాల నుంచీ విమర్శలు వెల్లువెత్తుతుండటం ఎన్నికల సమయంలో   వైసీపీకి పెద్ద ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల వేళ వివేకా హత్య కేసుపై ఎవరూ మాట్లాడకూడదంటూ కడప కోర్టు నుంచి గ్యాగ్ అర్డర్ తెచ్చుకున్నారు. అయితే కడప కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీతారెడ్డి, పులివెందుల తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవిలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కేసు బుధవారం విచారణకు రావాల్సి ఉండగా ఆ బెంచ్ న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ అనడంతో విచారణ వాయిదా పడింది. కొత్త బెంచ్  ముందుకు ఆ కేసు విచారణకు రానుంది.   అయితే  వివేకా హత్య పై మాట్లాడకూడదంటూ కడప కోర్టు పేర్కొన్న జాబితాలో లేని సౌభాగ్యమ్మ సరిగ్గా జగన్ పులివెందులలో నామినేషన్ వేసే సమయానికి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో వివేకా హత్య కేసులో నిందితులకు మద్దతుగా నిలబడుతున్నావంటే సూటిగా పేర్కొని వైసీపీకి మైండ్ బ్లాక్ అయ్యేలా చేశారు. వాస్తవానికి ఈ సారి ఎన్నికలలో జగన్ కు తెలుగుదేశం కూటమి మాత్రమే కాదు సొంత కుటుంబం కూడా ప్రతిపక్షంగా మారింది. వివేకా హత్యకేసులో న్యాయం కోసం పోరాడుతున్న చెల్లెళ్లనే పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణిస్తూ వారు తెలుగుదేశం స్క్రిప్టు చదువుతున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ విమర్శల గుప్పిస్తోంది. అక్కడితో ఆగకుండా షర్మిల వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ ఆమెను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తోంది. ఇక ఇప్పుడు జగన్ స్వయంగా రంగంలోకి దిగి వైసీపీ సోషల్ మీడియాలో పేర్కొన్న అంశాలనే ఎన్నికల ప్రచార సభలలో ప్రస్తావిస్తున్నారు.   ఈ నేపథ్యంలోనే  వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ  జగన్ కు ఓ బహిరంగ లేఖ ద్వారా షాక్ ఇచ్చారు. ఆ లేఖ కూడా జగన్ పులివెందులలో నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలోనే విడుదల చేశారు. ఆ లేఖలో   నీ తండ్రి వైస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు నువ్వెంత మనోవేదన చెందావో వివేకా హత్య జరిగిన నాటి నుండి నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదనకు గురయ్యింది. ఇటువంటి సందర్భంలో అన్నగా చెల్లికి అండగా నిలవాల్సిన నువ్వు ఇలా వివేకా హత్యకు కారణమైన వారికి రక్షణగా నిలవడం  తగునా జగన్..? అంటూ సూటిగా ప్రశ్నించారు.  సునీత కు అండగా నిలబడిన నీ సొంత చెల్లి షర్మిలను కూడా టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న నువ్వు నోరెత్తకపోవడమేంటంటూ నిలదీశారు. సరిగ్గా జగన్ నామినేషన్ దాఖలు చేసే రోజునే జగన్  కు ఆమె  పిన్నమ్మ బహిరంగ లేఖ రాయడం వైసీపీని దిగ్భ్రమకు గురి చేసింది. ఆమె సూటిగా, సుత్తి లేకుండా చెల్లెళ్ల పట్ల జగన్ వ్యవహరిస్తున్న తీరును ఆ లేఖలో ఎండగట్టడంతో ఆ లేఖపై ఎలా స్పందించాలో తెలియక జగన్ సహా వైసీపీ నేతలకు మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి. అంతే కాకుండా జగన్ సొంత బాబాయ్ హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న, దర్యాప్తు సంస్థలు వేలెత్తి చూపుతున్న అవినాష్ రెడ్డికి రక్షణగా నిలుస్తున్న జగన్ ను తప్పుపట్టడంతో జగన్ డిఫెన్స్ లో పడ్డట్టేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా సౌభాగ్యమ్మపై కూడా షర్మిల, సునీతమ్మల వలె ఎదురుదాడికి దిగుతుందా? ఆమెపై కూడా పెయిడ్ ఆర్టిస్ట్ ముద్ర వేస్తుందా చూడాల్సి ఉంది. జగన్ అండ్ కో  మేరకు చంద్రబాబు స్క్రిప్ట్ చదివేవారి జాబితాలో ఇప్పుడు సౌభాగ్యమ్మను కూడా చేరుస్తారా చూడాల్సి ఉంది. ఏది ఏమైనా వివేకా హత్య కేసు జగన్ కు ఈ ఎన్నికల వేళ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నదనడంలో సందేహం లేదు.  
Publish Date: Apr 25, 2024 3:19PM

బెజవాడ సెంట్రల్ బరిలో ఇండిపెండెంట్ గా జొన్నవిత్తుల

సినీ గేయ రచయత జొన్నవిత్తుల ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. సినీ రంగం నుంచి జొన్నవిత్తుల కంటే ముందు ఎందరో రాజకీయాలలోకి ప్రవేశించారు. వారిలో కొందరు తమదైన ముద్ర వేశారు. మరి కొందరు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. అయితే ఇందులో జొన్నవిత్తుల ఏ కోవలోకి వస్తారన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఈ సారి ఎన్నికలలో సినీ రంగానికి చెందిన పలువురు ఎన్నికల బరిలో నిలిచిన సంగతి విదితమే. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే హిందూపురం నుంచి  తెలుగుదేశం అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఇదే నియోజకవర్గం నుంచి రెండు సార్లు విజయం సాధించిన బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక మంత్రి రోజా వైసీపీ అభ్యర్థిగా నగరి నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి గత రెండు ఎన్నికలలో విజయం సాధించిన రోజా ఈ సారి ఎదురీదుతున్నారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇక విషయానికి వస్తే జొన్నవిత్తుల విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నారు. విజయవాడ అంటేనే రాజకీయాలకు క్యాపిటల్ వంటిది. అటువంటి విజయవాడ నుంచి జొన్నవిత్తుల ఇండిపెండెంట్ గా పోటీలోకి దిగి ఏ మేరకు ప్రభావం చూపుతారని పరిశీలకులు అంటున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా బోండా ఉమామహేశ్వరరావు పోటీ చేస్తున్నారు. అలాగే వైసీపీ నుంచి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బరిలో ఉన్నారు.  వీరితో పోటీలో ఇండిపెండెంట్ గా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఏ మేరకు ప్రభావం చూపుతారన్నది కాలమే నిర్ణయిస్తుంది.  
Publish Date: Apr 25, 2024 2:30PM

EVM మళ్ళీ మళ్ళీ గెలిచింది, గెలుస్తుంది!

ఎన్నికలు వస్తె, పదే పదే ఈవిఎం ల మీద దుమ్మెత్తి పోసే వారికి కొదవలేదు. గత 40 ఏళ్లుగా అనేక అవరోధాలను అధిగమించి, భారత దేశ సాంకేతికతకు తిరుగులేదని ఓటింగు యంత్రాలు అనేక సార్లు నిరూపించుకున్నాయి. ఇప్పుడు భారత ఉన్నత న్యాయస్థానం మరోమారు ఓటింగు యంత్రాలు పట్ల పూర్తి విశ్వాసం వెలువరించింది. వూహాజనిత ఆరోపణలపై ఓటింగు యంత్రాలపని తీరును తప్పు పట్టలేమని స్పష్టం చేసింది. ఓటింగు యంత్రాలను వ్యతిరేకించే వారి వాదన మన దేశ సాంకేతికతను అవమానించేలా ఉంటుంది. ప్రపంచంలో ఫలానా దేశాల్లో వాడటం లేదు, ఫలానా దేశాలు నిషేధించాయి కనుక ఓటింగు యంత్రాలు నమ్మదగినవి కావు అని వాదిస్తారు. బుర్ర తక్కువ లేదా భారత దేశం కనుగొన్న ఓటింగు యంత్రాలను మేము ఎందుకు వాడాలి అనే బలుపుతో ఆయాదేశాలు వాడటం లేదు అని కోణంలో ఆలోచించరు.  లక్షలాది ఓటింగు యంత్రాలు గల్లంతు అయ్యాయి అనే ఆరోపణ రాజకీయ పరమైంది. ఒకవేళ ఓటింగు యంత్రాలు దొంగిలించబడ్డా... వాటితో ఏమీ చేయలేరు.  ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎంతమంది దుమ్మెత్తి పోసినా,  ఓటింగు యంత్రాలుతోనే ఎన్నికలు నిర్వహిస్తున్న భారత ఎన్నికల సంఘం త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళుతుంది. ఈవిఎంలపై దేశంలో పెద్ద ఎత్తున‌ చర్చ సాగుతోంది. ఈవిఎంల ద్వారా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  ఎన్నికల కమిషన్ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. ఈవిఎంల ద్వారా అక్రమాలకు పాల్పడే అవకాశం లేదని అంటోంది. సాంకేతిక సమస్యలపై ఈవిఎంలు మొరాయించే అవకాశం మాత్రమే ఉంది గానీ అక్రమాలకు పాల్పడే లేదా ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండదని అంటోంది.  ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు సుర‌క్షిత‌మైన‌వ‌నీ, ఇవి భారతదేశానికి గర్వకారణమని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర చెబుతున్నారు.  EVM సింగిల్ చిప్ ప్రోగ్రామ్ మాత్రమేన‌నీ, ఫ్రీక్వెన్సీ లేదనీ.. కాబట్టి హ్యాకింగ్ ప్రశ్నే లేదని తెలిపారు. వాటిని ట్యాంపరింగ్ చేయడం లేదా హ్యాక్ చేయడం సాధ్యం కాదన్నారు. భార‌త దేశం ఎంతో వేగంగా, సకాలంలో, ఖచ్చితంగా ఎన్నికల ఫలితాలను  అందించగలదో తెలుసుకోవడానికి అనేక దేశాలు ఆసక్తిగా ఉన్నాయని అన్నారు.  ఈవీఎం అనేది సింగిల్ చిప్ ప్రోగ్రామ్ అని సుశీల్‌ చంద్ర తెలిపారు. దీనిని ట్యాంపరింగ్‌ చేయలేరని, హ్యాకింగ్ ప్రశ్నే తలెత్తదని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో VVPAT ఆడిట్ ట్రయల్ కూడా ఉంటుందన్నారు. దీంతో ఈవీఎంలు ఖచ్చితమైన ఫలితాలను ఇస్తాయని వివరించారు. చాలా తక్కువ సమయంలో వేగంగా, ఖచ్చితమైన ఎన్నికల ఫలితాలు భారత్‌లో ఎలా సాధ్యం అని పలు దేశాలు ఆశ్చర్యపోతున్నాయని అన్నారు.  ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాతత, అవగాహన చాలా కీలకమని, అందువల్ల ఈవీఎంల క్రమబద్ధమైన నిల్వ, నిర్వహణ, తరలింపు కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, చెక్‌లిస్ట్ అనుసరించడం చాలా కీలకమని ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండే చెబుతున్నారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌
Publish Date: Apr 25, 2024 1:24PM

జగన్.. బ్యాండ్ ఎయిడ్ ఎప్పుడు తీస్తారు సారూ!?

ఎన్నికల అంశంగా, సానుభూతి వర్షం కురిపించేలా మారుతుందని ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలూ భావించిన రాయి దాడి సంఘటన చివరకు అధికార పార్టీ పరువును దిగజార్చడానికి మాత్రమే దోహదపడింది. రాయి దాడి సంఘటన నాటి నుంచీ ఓ వారం రోజుల పాటు రాష్ట్ర రాజకీయాలలో దాని గురించి తప్ప మరో చర్చ లేకుండా పోయింది. రాయిదాడి సంఘటనను హత్యా యత్నం అంటూ మీడియాలో వైసీపీ నేతల ప్రకటనలతో సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ కూడా ఆ దాడిని ఖండిస్తూ  ట్వీట్ చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు,  జనసేనాని పవన్ కల్యాణ్ కూడా దాడి ఘటనను ఖండిస్తూ ప్రకట చేశారు. సీఎం కార్యక్రమంలో భద్రతా వైఫల్యంపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని బాధ్యులపై చర్యకు కూడా డిమాండ్ చేశారు. సరే ఒకింత ఆలస్యమైనా సీఎం కార్యక్రమంలో భద్రతా వైఫల్యాలతో పాటు ఇతర ఫిర్యాదులను కూడా పరిగణననలోకి తీసుకున్న ఎన్నికల సంఘం రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలిస్ పై బదలీ వేటు వేసింది. అక్కడకు ఆ అంకం ముగిసినట్లుగానే భావించాలి. కానీ జగన్ లో మాత్రం ఆ దాడి నుంచి ఇంకా సానుభూతి పిండుకోవచ్చన్న దింపులు కళ్లెం ఆశ మిగిలే ఉన్నట్లుంది. అందుకే ఇప్పటికీ ఆయన నుదుటి మీద కనుబొమలను కవర్ చేసేలా బ్యాండ్ ఎయిడ్ ను అలాగే కొనసాగిస్తున్నారు. వాస్తవానికి రాయి తగిలిందని చెప్పి నుదురు పట్టుకున్న తరువాత జగన్ కు నుదుటిపై గుండ్రంగా ఒక చిన్న బ్యాండ్ ఎయిడ్ వేశారు. అయితే ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ పదుల సంఖ్యలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకున్న తరువాత ఆ బ్యాండ్ ఎయిడ్ సైజు ఒక్క సారిగా పెరిగిపోయింది. నుదుటి భాగాన్నే కాకుండా కనుబొమను కూడా వకర్ చేస్తూ పెద్ద బ్యాండ్ ఎయిడ్ ఇప్పుడు ఆయనకు సహజ కవచకుండలంగా మారిపోయి కనిపిస్తున్నది.  హత్యాయత్నం అని వైసీపీ ఎంతగా బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నించినా జనం నమ్మలేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రమే కాదు చివరాఖరికి సొంత చెల్లెలు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూడా జగన్ పై జరిగింది గులకరాయి దాడే అని పదే పదే చెబుతున్నారు. సరే అది పక్కన పెడితే గాయం తగిలి ఇన్ని రోజులైనా వైద్యులు ఇంకా జగన్ నుదుటిపై ఉన్న బ్యాండ్ ఎయిడ్ ను ఎందుకు తీయలేదా అని వైసీపీ శ్రేణుల్లోనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగా సానుభూతి కోసమే ఇబ్బంది అయినా బ్యాండ్ ఎయిడ్ ను అలా భరిస్తూ కొనసాగిస్తున్నారా అన్న జోకులు కూడా పేలుతున్నాయి. ఇక ఆంధ్రాలో అయితే జగన్ స్టైల్ లో నుదుటిమీద బ్యాండ్ ఎయిడ్ పెట్టుకుంటూ యూత్ ఓ లెవల్ లో  ట్రోల్ చేస్తున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగిసే దాకా జగన్ నుదుటిమీద ఆ బాండ్ ఎయిడ్ ను అలా ఓ ఆభరణంలా మెయిన్ టెయిన్ చేస్తారేమో అంటూ నెటిజనులు ఓ రేంజ్ లో ఆటాడుకుంటున్నారు.  
Publish Date: Apr 25, 2024 1:02PM

మల్కాజ్‌గిరిలో సత్తా చాటేది ఎవరు? ఓటరు ఎటు వైపు?

మల్కాజ్ గిరి పై పట్టుకోసం రాజకీయపార్టీలు హోరా హోరీగా త‌ల‌ప‌డుతున్నాయి.  ఇక్క‌డ మూడు పార్టీల మ‌ధ్య ఆసక్తికరమైన పోరు నెల‌కొంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో  దేశంలోని అన్ని రాష్ట్రాల, ప్రాంతాల ప్ర‌జ‌లు ఉంటారు. అందుకే మ‌ల్కాజ్ గిరి అంటే మినీ ఇండియాగా పేరుంది. పైగా దేశంలోని అతిపెద్ద లోక్ స‌భ సెగ్మెంట్ల‌లో కూడా మ‌ల్కాజ్ గిరి ఒక‌టి. సీఎం రేవంత్ రెడ్డి మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డి నుండే ప్రాతినిధ్యం వ‌హించారు. ఇప్పుడు  బీఆర్ ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ నేత‌లంతా ఫోక‌స్ చేస్తున్నారు. మ‌ల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థి రాగిడి ల‌క్ష్మారెడ్డి బ‌రిలో వున్నారు. ఇత‌నికి అండ‌గా మ‌ల్లారెడ్డి వున్నారు.  మ‌ల్కాజ్ గిరి ప‌రిధిలోని మేడ్చ‌ల్, మ‌ల్కాజ్ గిరిలో మ‌ల్లారెడ్డి, ఆయ‌న అల్లుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరికి భారీ అనుచ‌ర‌గ‌ణం కూడా ఉండ‌గా, గ‌తంలో మ‌ల్కాజ్ గిరి నుండి మ‌ల్లారెడ్డి ఎంపీగా కూడా ప‌నిచేశారు.  మ‌ల్కాజ్‌గిరి ఎంపీ నియోజ‌క‌వ‌ర్గంలో ఏడుగురు ఎమ్మెల్యేలు మ‌న ద‌గ్గ‌ర్నే ఉన్నారు. 200 మందికి పైగా కార్పొరేట‌ర్లు కూడా బీఆర్ఎస్ కు చెందిన వారే ఉన్నారు.  ప‌దేండ్ల నిజానికి, వంద రోజుల అబ‌ద్దానికి, మ‌రో ప‌దేండ్ల విధ్వంస కేంద్ర పాల‌న‌కి  మ‌ధ్య యుద్దం అంటూ బీఆర్ ఎస్ ప్ర‌చారం చేస్తోంది.  ఈటెల‌కు, ప‌ట్నం సునీతాకు ఇంగ్లీషు, హిందీలో మాట్లాడ‌డం రాదు. వాళ్ళు పార్ల‌మెంట్‌కు వెళ్ళి ఏం మాట్లాడ‌తారాని బీఆర్ ఎస్ నిల‌దీస్తోంది. అదే రాగిడి ల‌క్ష్మారెడ్డికి ఇంగ్లీష్, హిందీలో అద్భుతంగా మాట్లాడుతారు.. ప‌క్కా లోకల్ వ్య‌క్తి అయిన‌ అత‌ను మీ గొంతుక‌గా పార్ల‌మెంట్‌లో మాట్లాడుతారని బీఆర్ ఎస్ ప్ర‌చారం చేస్తోంది.  తెలంగాణ‌కు బీజేపీ ప్ర‌భుత్వం చేసిందేమీ లేదని చెప్పారు కేటీఆర్ ప‌దే ప‌దే చెబుతున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాలకు ఎన్నో మెడిక‌ల్ కాలేజీలు ఇచ్చిన కేంద్రం, తెలంగాణకు మాత్రం గుండు సున్నా చుట్టిందని, కనీసం ఒక్క న‌వోద‌య పాఠ‌శాల కూడా ఇవ్వ‌లేదని, కొత్త‌గా ఒక్క విద్యాసంస్థ ఇవ్వ‌కుండా ప్ర‌ధాని కాల‌యాప‌న చేశారని అన్నారు.   కాంగ్రెస్ నుండి ప‌ట్నం సునీతా మ‌హేంద‌ర్‌రెడ్డి పోటీ లో ఉన్నారు. మంత్రి తుమ్మ‌ల‌కు ఇక్క‌డ ఇంచార్జ్ ఇవ్వ‌టంతో గెలుపుపై కాంగ్రెస్ న‌మ్మ‌కంగా ఉంది.  సిట్టింగ్ సీటుపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. గ‌త ఎన్నిక‌ల్లో రేవంత్ రెడ్డి గెలుపొందిన నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో మల్కాజిగిరి సీటును కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనైనా ఈ స్థానంలో విజయం సాధించడమే కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతోంది.  అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్ల‌మెంట్ ప‌రిధిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెల‌వ‌క పోవడం కొంచెం మైనస్. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా, ఇక్కడి ప్రజలు మాత్రం బీఆర్ఎస్ కు జై కొట్టారు. చేవెళ్ల నుంచి అనుకున్న అభ్యర్థిని, ఎందుకో మల్కాజిగిరిలో బరిలో దింపారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌రిగిన త‌ప్పిదాలు జ‌ర‌గ‌కుండా, విజ‌య‌కేత‌నం ఎగుర‌వేయాల‌ని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. తాము గెలిస్తేనే నియోజకవర్గం అభివృద్ధి సాధ్యం అంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కూక‌ట్‌ప‌ల్లి, కుత్బుల్లాపూర్‌, మేడ్చల్‌, మ‌ల్కాజ్‌గిరి, ఉప్పల్‌, ఎల్బీన‌గ‌ర్, కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో అంత‌ర్భాగ‌మైన ఈ నియోజకవర్గాలు కీలక ప్రాంతాలు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 7 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మల్కాజిగిరి నియోజ‌క‌వ‌ర్గంలో దేశ ర‌క్షణ‌ రంగానికి చెందిన ఏయిర్ ఫోర్స్‌, ఆర్మీ స్థావరాలతో పాటు పారిశ్రామిక‌రంగం, విద్యారంగానికి సంబంధించిన ప్రతిష్టాత్మకమైన యూనిర్శిటీలకు  కేరాఫ్ అడ్రస్‌గా ఉంది.  ఈ నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు 38 ల‌క్షల ఓట‌ర్లు ఉన్నారు.     నార్త్ ఇండియా నుండి ఎక్కువ మంది నివాస‌ముంటున్న సీటు కావ‌టంతో గెలుపు ఈజీ అవుతుంద‌న్న ఆశ‌ల్లో బీజేపీ నేత‌లు ఉన్నారు. ఇటీవ‌ల గ‌జ్వేల్, హుజురాబాద్ నుండి పోటీ చేసిన ఈట‌ల రాజేంద‌ర్  బీజేపీ అభ్య‌ర్థిగా ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు.  మ‌ల్కాజిగిరి ఎంపీ స్థానాన్ని నెగ్గాలని బీజేపీ సైతం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని వ్యూహాలు రచిస్తోంది. మోదీ ప్రధానిగా హ్యాట్రిక్ కొడతారని చెబుతూ పార్లమెంట్ స్థానాలను గెలిపించాలని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ప్రధాని న‌రేంద్ర మోదీ ఇటీవల మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో రోడ్ షో సైతం నిర్వహించారు. మోదీ ప్రజాద‌ర‌ణ క‌లిసొస్తుంద‌ని అధిష్టానం ధీమాతో ఉంది. బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ వంటి బ‌ల‌మైన అభ్యర్థి బరిలో ఉన్నారు. ఒక్కసారి కూడా మ‌ల్కాజిగిరి సీటు నెగ్గకపోవడంతో తో ఈసారి ఖ‌చ్చితంగా సాధించాలని ప‌ట్టుద‌ల‌తో ఉంది.  ఈసారి మాత్రం మోదీ మేనియాతో నెగ్గాలని ప్లాన్ చేస్తోంది. సిట్టింగ్ సీటు కోసం కాంగ్రెస్ ఫోకస్ చేస్తుండగా, కనీసం ఒక్కసారైనా మల్కాజిగిరిపై తమ జెండా ఎగరేయాలని బీఆర్ఎస్, బీజేపీ భావిస్తున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరిలో బీజేపీకి మంచి ఓట్‌ బ్యాంక్‌ ఏర్పడింది. వ్యక్తిగతంగా తనకున్న ఇమేజ్‌, పార్టీ సపోర్ట్‌.. ఈ రెండు కలిసివచ్చే అంశాలు ఉన్నట్లు ఈటెల లెక్కలు వేసుకుంటున్నారట.   తెలంగాణవాదుల్లో ఉదారవాదిగా ఉన్న ఈటల రాజేందర్ రెండు ప్రాంతాల ప్రజలు, గ్రేటర్ హైదరాబాద్‌లో కలిసిమెలిసి జీవించాలని కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 14 శాతం ఓట్లు, 8 సీట్లు సాధించడంలో కీలకమయ్యారు. ఈటల ప్రచారం నిర్వహించిన చోట్ల బీజేపీ అభ్యర్థులకు ఘననీయంగా ఓట్లు రావడం కూడా ఆయన పట్ల తెలంగాణ ప్రజల్లో ఉన్న క్రేజ్‌ను చాటుతోంది.  గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నినాదాన్ని బీజేపీ తీసుకోడానికి ముఖ్య కారణం ఈటల అని గుర్తుంచుకోవాలి. ఈ లోకసభ ఎన్నికల్లో 10 స్థానాలు గెలుచుకోవాలని, 35 శాతం ఓట్లు రాబట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.   ఇక్క‌డ పోటీ  కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉండటం, దేశ వ్యాప్తంగా బీజేపీకి ఉన్న సానుకూలత కలిసి వస్తాయన్న అభిప్రాయం ఉంది. ఈటల రాజేందర్ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సన్నిహితంగా ఉండటం కూడా ఎన్నికల్లో కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. హైదరాబాద్‌లో మరీ ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో హిందుత్వం, బీజేపీకి అడ్వాంటేజ్ అన్న భావన ఉంది.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌
Publish Date: Apr 25, 2024 10:57AM

భార్యలు భర్తల నుండి ఏం కోరుకుంటారు...బంధం దృఢంగా ఉండటానికి ఏది ముఖ్యం?

విజయవంతమైన,  సంతోషకరమైన వివాహా బంధానికి ప్రేమ మాత్రమే ముఖ్యం  కాదు. బంధంలో  భార్యను సంతోషంగా ఉంచడం కూడా చాలా ముఖ్యం.  ప్రతి భార్యకు తన భర్త నుండి కొన్ని అంచనాలు ఉంటాయి.  అవి నెరవేరితే బంధంలో తగాదాలు తగ్గుతాయి.   బంధం కూడా బలపడుతుంది. అవి నేరవేరకపోతే మాత్రం బంధం బలహీనంగా మారుతుంది. చిన్న ప్రయత్నాలు మానవ సంబంధాలలో దేనినైనా బలోపేతం చేయగలవు.  భార్యాభర్తల సంబంధం విషయానికి వస్తే అది మరింత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వివాహం అనేది ఒక పవిత్ర బంధం. దీనిలో ప్రేమ, గౌరవం,  అవగాహన అనే పునాదిపై కలిసి జీవితాన్నిగడపాల్సి ఉంటుంది.   ఇది పరస్పర అవగాహనతోనూ, బంధంలో పలు విషయాల పట్ల సహనంతో ఉండటం ద్వారా జరుగుతుంది. స్త్రీలు తమ భర్తల గురించి కొన్ని అంచనాలను కలిగి ఉంటారు. వాటిని నెరవేర్చడం ద్వారా ఏ భర్త అయినా తన భార్యను సంతోషంగా ఉంచగలడు. భార్యలు భర్తల నుంచి ఏమి ఆశిస్తారో తెలుసుకుంటే.. ప్రేమ.. ప్రతి స్త్రీ తన భర్త నుండి ప్రేమ,  ఎమోషనల్ సపోర్ట్ ఆశిస్తుంది. ఉద్యోగం చేసే మహిళ అయినా లేదా గృహిణి అయినా.. ఇద్దరూ తమ జీవిత భాగస్వామి అడుగడుగునా తమకు తోడ్పాటు అందించాలని కోరుకుంటారు. ప్రేమను వ్యక్తపరచడం కూడా వారికి ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమను వ్యక్తం చేయడం ద్వారా భార్యాభర్తల బంధం లోతుగా, దృఢంగా మారుతుంది. శ్రద్ద..  ఒకరిని ఎంతగా ప్రేమిస్తున్నారో వ్యక్తం చేయడానికి ఉత్తమ మార్గం వారి పట్ల శ్రద్ధ వహించడం.  భార్యకు ఇంటి పనిలో సహాయం చేయడం, ఆమె మానసిక స్థితి సరిగా లేకుంటే ఆమె ముఖంలో చిరునవ్వు తీసుకురావడానికి ప్రయత్నించడం, ఆమె అనారోగ్యంతో లేదా ఇతర పనులలో బాగా బిజీగా ఉన్నట్లయితే ఆమెకు ఇష్టమైన ఆహారాన్ని వండడం లేదా ఆర్డర్ చేయడం,  ఆమెకు తినిపించడం, ఆమె చెప్పేది శ్రద్ధగా వినడం, ఆమె కోసం సమయం కేటాయించడం..  ఇవన్నీ చిన్నవి కానీ శ్రద్ధ చూపిస్తున్నామని చెప్పడానికి ఇవి చాలా మంచి మార్గాలు. గౌరవం.. ఏదైనా సంబంధానికి పునాది గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. భార్యలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వని భర్తలు ఎందరో ఉన్నారు. వివాహిత సంబంధంలో దీనిని పొందడానికి భార్యలు ఎక్కువగా పోరాడవలసి ఉంటుంది. భార్యలు తమ భర్తలను ప్రేమించడమే కాకుండా వారి అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వారి నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలని, సమానంగా చూడాలని,  తమ ఆత్మగౌరవాన్ని తమకు ఇష్టమైనవారి దగ్గర   దెబ్బతీయకూడదని భార్యలు కోరుకుంటారు. భర్త ఇవన్నీ చేస్తే భార్యలు తమను ఎంతగా గౌరవిస్తారో గ్రహించగలుగుతారు కమ్యూనికేషన్.. భార్యాభర్తల మధ్య ఎలాంటి సంకోచం లేకుండా ఓపెన్ కమ్యూనికేషన్ ఉండటం చాలా ముఖ్యం. భార్య తన భర్త తనతో ప్రతిదీ పంచుకోవాలని,  జడ్జ్ చేయకుండా జాగ్రత్తగా వినాలని కోరుకుంటుంది. భార్యాభర్తల బంధంలో  ఒకరికొకరు నిజాయితీగా,  మంచి  నమ్మకంతో  కలిగి ఉండటం చాలా ముఖ్యం. కానీ ఫలానా వ్యక్తి వల్ల భార్య అభద్రతా భావంతో బాధపడుతుంటే, భర్త ఆమెను పట్టించుకోకుండా ఉండటం సరికాదు.  ఈ భావాన్ని తొలగించడానికి భర్త ప్రయత్నించాలి. తద్వారా వారి మధ్య నమ్మకం బలపడుతుంది. అవగాహన.. భార్యాభర్తల మధ్య సంబంధాలలో పరస్పర అవగాహన చాలా ముఖ్యం. చాలా మంది మహిళలు తమ భర్తలు తమను అర్థం చేసుకోవడం లేదని భార్యలను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని మనస్తత్వంతో ఉంటారని ఫిర్యాదు చేస్తారు. కానీ ప్రతి భర్త తన భార్య ఇష్టాలు,  అభిరుచులను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇదే వారి బంధానికి శ్రీరామ రక్ష.                                                             *నిశ్శబ్ద.
Publish Date: Apr 25, 2024 10:34AM