మద్యం దుకాణాల దరఖాస్తులతో ఆశ్చర్యానికి గురైన అధికారులు...

తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్సులకు భారీ స్పందన చూసి ఆశ్చర్యపోతున్న అధికారులు. దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణ రాత్రి పన్నెండు గంటల వరకు కొనసాగింది. మొత్తం నలభై ఐదు వేల దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి తొమ్మిది వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. బుధవారం ఒక్క రోజే ఇరవై వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. గత సంవత్సరం కన్నా అదనంగా నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. దరఖాస్తు దారులతో ఎక్సైజ్ కార్యాలయాలన్నీ కిటకిటలాడాయి. ఎక్సైజ్ అధికారులు టెండర్ల స్వీకరణ పరిశీలనలో బిజీ అయిపోయారు. 

ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక దరఖాస్తులొచ్చాయి. వరంగల్లో రెండు వందల అరవై ఒక్క దుకాణాలకు గాను ఏడు వేల ఐదు వందల ముప్పై నాలుగు దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్ జిల్లాలో నూట డెబ్బై మూడు మద్యం దుకాణాలకు గాను ఒక వెయ్యి మూడు వందల పంతొమ్మిది దరఖాస్తులు వచ్చాయి. రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ జిల్లా లోనూ పోటా పోటీగా దరఖాస్తులు సమర్పించారు. ఏపిలో లిక్కర్ పై నియంత్రణ విధించడంతో అక్కడి వ్యాపారులు తెలంగాణా బాటపట్టారు. ఏపీ నుంచి మద్యం వాప్యారులు తెలంగాణాకి వచ్చి పోటా పోటీగా టెండర్లు వేశారు. ఒకరు ఓకే టెండర్ వేయాలనే నిబంధన ఉన్నప్పటికీ వ్యాపారులు సిండికేట్ గా మారి భారీగా టేండర్లు వేసినట్టు తెలుస్తోంది. అనంతపూర్, గుంటూరు, సత్తెనపల్లి, మాచర్ల, కర్నూలు, విజయవాడ, నంద్యాల ప్రాంతాల వ్యాపారులు గ్రేటర్ శివార్ల లోనే ఏకంగా రెండొందలకు పైగా దరఖాస్తులు సమర్పించినట్లు సమాచారం.