మనమూ రీఛార్జ్ అవ్వాల్సిందే

 

మనకి ఎంతో అత్యవసరమైన సెల్‌ఫెన్, ఛార్జింగ్ లైట్ వంటి వాటికి ఒక్కరోజు ఛార్జింగ్ పెట్టడం మానేయ్యండి. వెంటనే అవి ఇక ఏమాత్రం మేం పనిచేయమంటూ మొరాయిస్తాయి. కాబట్టే మనం ఎంతో జాగ్రత్తగా, గుర్తుపెట్టుకుని మరీ వాటిని ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేస్తుంటాం. వస్తువులకే రీఛార్జ్ అంత ముఖ్యమైనప్పుడు మరి మనుషులం మనకు రీఛార్జ్ అక్కర్లేదా? చెప్పండి? తప్పకుండా కావాలి. కానీ, మనమో... మనసుకు, శరీరానికి రీఛార్జ్ కావాలన్న విషయాన్ని కూడా గుర్తించకుండా మనలో ఎనర్జీ దొరికినంతవరకు వాడేసుకుంటుంటాం. ఫలితం.. తెలియని నిర్లిప్తత, దేనిపైనా ఆసక్తి లేకపోవడం, తెలియని అనారోగ్యంతో సతమతమవటం. ఆ ఇబ్బందులు ఏవీ వద్దు అనుకుంటే మనల్ని మనం ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకుంటుండాలి. అందుకు నిపుణులు చేస్తున్న కొన్ని సూచనలు చూద్దాం.

 

రీఛార్జ్‌తో రెట్టింపు ఉత్సాహం


చాలాసార్లు మనం ఇంటిపనయినా లేదా ఆఫీసు పనయినా ఏదైనా కానివ్వండి. ఒకదాని తర్వాత ఒకటి అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. కొన్ని పనులు అనుకుని, అవి పూర్తయ్యేదాకా ఏమాత్రం విశ్రాంతి తీసుకోం. దాని వలన నిజానికి మన పనిచేసే నైపుణ్యం, సామర్థ్యం వంటివి తగ్గుతాయిట. అదే ఒక పనికి, మరోపనికి మధ్య కొద్దిపాటి విశ్రాంతి తీసుకున్నా చాలు.. మనసు, మెదడు, శరీరం అన్నీ ‘రీఛార్జ్’ అయ్యి, రెట్టించిన ఉత్సాహంతో తరువాత పనని చేపడతాంట.

 

సంపూర్ణ నైపుణ్యం సాధించడానికి...


జీవితంలో వరుసగా టార్గెట్స్ నిర్ణయించుకుని, ఒకదాని తరువాత మరోటి సాధించుకుంటూ వెళ్ళాలన్న సంకల్పం మంచిదే కానీ, ఆ ధ్యాసలో పడి ‘ఆనందానికి’ దూరం కాకూడదు. మన మనసులోని ఒత్తిడిని ఎప్పటికప్పుడు కడిగేసుకుంటూ మనసుని తిరిగి రీఛార్జ్ చేసుకుంటూ వుంటే కొత్త శక్తిని కూడగట్టుకున్నవాళ్ళం అవుతాం. ఒత్తిడి లేనప్పుడు తప్పకుండా మన సంపూర్ణ నైపుణ్యం బయటపడుతుంది. ఎప్పుడైతే మనం మన సర్వశక్తులు పెట్టి ఒక పని చేస్తామో అప్పుడాపని తప్పకుండా మంచి ఫలితాలని అందిస్తుంది.

 

చిన్న చిన్న పనులతో రీఛార్జ్

 

పిల్లలతో హాలిడేస్‌కి బయటకి వెళ్ళటం, ఆదివారాలు అన్ని పనులకూ టాటా చెప్పేసి విశ్రాంతిగా గడపటం, తెలిసినవారు - బంధువులు పిలిస్తే ఆ ఫంక్షన్లకి తప్పకుండా హాజరు కావటం వంటివి నిజానికి మంచి రీఛార్జ్‌ని అందించే అవకాశాలు. కానీ మనం మన రొటీన్‌కి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని వీటన్నిటి నుంచి తప్పించుకుంటుంటాం. అయితే కాస్త సమన్వయపరుచుకోవడం తెలిస్తే అవేం పెద్ద విషయాలు కాదు.

రీఛార్జ్ ప్రణాళిక అవసరం


రీఛార్జ్ అవటం కూడా మన రొటీన్ పనులలాగా ఎంతో ముఖ్యమైనదని గ్రహించాలి. దానికి తగ్గ సమయాన్ని మన షెడ్యూలులో చేర్చాలి. తప్పనిసరిగా గంటకో ఐదు నిమిషాలు, రోజుకో గంట, వారానికోపూట, నెలకోరోజు, సంవత్సరానికోవారం... ఇలా ఎప్పటికప్పుడు ఓ షెడ్యూల్‌ని ఏర్పరచుకోవాలి. హాయిగా గడపటానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అది ఒక అలవాటుగా మారిపోవాలి. అప్పుడు మనసు, మెదడు, శరీరం అన్నీ ఎప్పటికప్పుడు రీఛార్జ్ అవుతూ మనల్ని ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంచుతాయి. కొత్త ఉత్తేజాన్ని, శక్తిని కూడగట్టుకుని లక్ష్యాలని సాధించడానికి సిద్ధమవుతాయి.

బ్యాటరీ ఖాళీ అయ్యేవరకూ ఊరుకుంటూ సడన్‌గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది సెల్ ఫోన్. అలాగే మనం పూర్తిగా ఖాళీ అయ్యేవరకు రీఛార్జ్ కాకపోతే లక్ష్యాలని సాధించడంలో, మన దైనందిన జీవితాన్ని ఆనందంగా మార్చుకోవడంలో వెనకబడిపోతాం. అందుకే రీఛార్జ్ తప్పనిసరి... ఏమంటారు?

-రమ