కోడెల ఆత్మహత్యకు కారణమేంటి?.. తప్పెవరిది?

 

'బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి' అనడానికి కోడెల జీవితాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చేమో. గుంటూరు జిల్లాలో ప్రజలకు సుపరిచితుడైన వైద్యుడిగా ముద్ర వేసుకున్న కోడెల.. రాజకీయాల్లోకి ప్రవేశించి చెరగని ముద్ర వేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి సీనియర్ నేతగా రాష్ట్రవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్ గా విశేష సేవలందించారు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. గత కొంత కాలంగా వరుస ఆరోపణలతో సతమతమవుతున్న కోడెల.. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని తుదిశ్వాస విడిచారు.

2014 లో టీడీపీ విజయం తరువాత స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన కోడెల.. 2019 ఎన్నికలకు ముందు వరకు తన బాధ్యతను నిర్వర్తించారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమితో ఆయనను సమస్యలు చుట్టుముట్టాయి. వరుస ఆరోపణలతో ఆయన ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కోడెల ఫ్యామిలీ సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో కోడెల టాక్స్ పేరుతో.. ప్రజలను ఇబ్బంది పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా కోడెల కుమారుడు, కూతురిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఇద్దరు పలువురి వద్ద డబ్బులు వసూలు చేసారని, కొందరికి డబ్బులు ఎగ్గొట్టారని ఇలా రకరకాలు ఆరోపణలు వచ్చాయి.

అంతేకాదు కోడెల కుటుంబం మీద ఇంకా ఆరోపణలు వచ్చాయి. కోడెల అసెంబ్లీ ఫర్నీచర్ మాయం చేసారని అధికార పార్టీ ఆరోపించింది. అయితే కోడెల మాత్రం తాను చెప్పే ఫర్నీచర్ తీసుకెళ్లానని, తిరిగి అప్పగించడానికి లేఖలు కూడా రాసానని చెప్పుకొచ్చారు. ఈ అసెంబ్లీ ఫర్నీచర్ అంశంలో కోడెల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

వీటికితోడు ఆయన అద్దె పేరుతో ప్రభుత్వ సొమ్ముని దోచేస్తున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఆయన గుంటూరులోని తన భవనాన్ని, వైద్య శాఖకు అద్దెకిచ్చి.. సరైన వసతులు లేకపోయినా అధికమొత్తంలో అద్దె వసూలు చేసారని వార్తలొచ్చాయి. అంతేకాదు ఆసుపత్రులకు సరఫరా చేసే దూది విషయంలో కూడా కోడెల కుటుంబం అవినీతికి పాల్పడిందని ఆరోపణలు వినిపించాయి. ఆసుప్రతులకు దూది సరఫరా చేసే కాంట్రాక్టు తీసుకున్న కోడెల ఫ్యామిలీ.. నాసిరకం దూదిని తెప్పించి సరఫరా చేసారని ప్రచారం జరిగింది.  

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కోడెల మీద ఇలా వరుస ఆరోపణలు వచ్చాయి. అయితే ఇదంతా కక్ష సాధింపేనని కోడెల పదేపదే ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ గా ఉన్న సమయంలో తన బాధ్యతను నిర్వర్తిస్తూ.. వైసీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసానని.. కానీ వైసీపీ అధికారంలో వచ్చిన తరువాత దాన్ని మనసులో పెట్టుకొని తనను రాజకీయ వేధింపులకు గురి చేస్తుందని కోడెల ఫీలయ్యారు. అంతేకాదు ఈ వరుస ఆరోపణలతో కోడెల గుండెపోటుతో ఆసుపత్రిలో కూడా చేరారు. అయినా ఆయన మీద ఆరోపణలు ఆగలేదు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల ఆత్మహత్య చేసుకుని లోకాన్ని విడిచారు. తెలుగు రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నేతగా పేరు తెచ్చుకున్న కోడెల.. ఆరోపణలు, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం నిజంగా దురదృష్టకరం.