ఆత్మహత్యకు ఒక్కరోజు ముందు చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టుంటే కోడెల బతికేవారా? 

 

కోడెల గురించి తెలిసినవాళ్లు... ఆయనది చాలా సున్నిత మనస్తత్వం అంటారు. రూపాయి డాక్టర్ గా పేదల ప్రజలకు సేవలందించిన కోడెల ...రాజకీయాల్లోకి వచ్చాకే రాటుదేలారని చెబుతారు. స్వయంగా ఎన్టీఆర్ కోరడంతో చిన్న వయసులోనే రాజకీయాల్లో వచ్చిన కోడెల... అప్పటికే పల్నాడులో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోన్న కాసు కుటుంబానికి ఎదురెళ్లి నర్సరావుపేట నుంచి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు. అయితే, 1983లో కోడెల ఎమ్మెల్యేగా గెలిచాక, కాసు కుటుంబం దాడికి ప్రయత్నించింది. దాంతో కోడెలకు ప్రజలే అండగా నిలబడ్డారు. కోడెలను వాటర్ ట్యాంక్ లో పెట్టి, ఆయనకు రక్షణగా నిలిచారు. ఆ సంఘటనే కోడెలలో పట్టుదల రగిల్చింది. దాంతో ప్రజల అండదండలతో పల్నాడులో పట్టుసాధించిన కోడెల... తర్వాతి కాలంలో రాజకీయంగా రాటుదేలారు. కాసు కుటుంబం అరాచకాలకు ఎదురెళ్లి ప్రజలకు రక్షణగా నిలబడ్డారు. ఆ తెగువే కోడెలను అతికొద్దికాలంలోనే ప్రజానాయకుడిగా చేసింది. దాంతో ఒక్క పల్నాడులోనే కాదు... మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కోడెల పేరు మోరుమోగిపోయింది. తన వ్యక్తిత్వంతో తలదించని నేతగా ఎదిగారు. పల్నాడు పులిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగుదేశంలో ఫైర్‌బ్రాండ్‌గా మారారు. అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు ఆయన గురించి తెలిసినవాళ్లు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హోంమంత్రిగా పనిచేసిన కోడెలకు రాజకీయ వేధింపులు, కక్ష సాధింపు చర్యలు, కేసుల గురించి తెలియకుండా ఉండదు. రాజకీయాల్లో ఇది సహజమే అయినా, జగన్ ప్రభుత్వం మాత్రం... ఎన్నో అడుగులు ముందుకేసి కోడెలకు ఊపిరిసలపనీయకుండా చేసింది. కేసు మీద కేసు పెడుతూ, 3నెలల కాలంలోనే కుటుంబం మొత్తంపై దాదాపు 30 కేసులను పెట్టించి వేధించింది. దాంతో కోడెల కుమిలిపోయారు. మానసికంగా కుంగిపోయారు. 70ఏళ్ల పైబడిన వయసులో ధైర్యం సడలింది. మానసిక-ఆత్మస్థైర్యం దెబ్బతింది. ఆ సమయంలో పార్టీ అండ కోసం కోడెల ఎదురుచూశారు. కానీ అసెంబ్లీ ఫర్నిచర్ దొంగతనం అభియోగాల నేపథ్యంలో... కోడెలకు అండగా నిలిచేందుకు చంద్రబాబు వెనుకంజ వేశారు. కోడెలపై ఎంతో అభిమానమున్నా, అత్యంత సన్నిహితుడైనా, వెనకేసుకొస్తే ఎక్కడ పార్టీకి చెడ్డపేరు వస్తుందోనని బాబు భయపడ్డారు. కోడెలపై, కోడెల కుటుంబంపై జగన్ సర్కార్ ... వరుస కేసులు పెడుతుంటే చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు... పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇవ్వలేదు... కనీసం కోడెలను పరామర్శంచలేదు... ఇదే కోడెలను మరింత కుంగదీసింది. ఒకవైపు జగన్ ప్రభుత్వ వేధింపులు.... మరోవైపు బాబు నుంచి అండ లేకపోవడంతో మానసికంగా కుంగిపోయిన కోడెల... ఎటూపాలుపోక విధిలేని పరిస్థితుల్లోనే ఆత్మహత్యకు ఒడిగట్టారని అంటున్నారు.

కోడెల ఆత్మహత్య తర్వాత చంద్రబాబు .... జగన్ ప్రభుత్వంపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కోడెల మరణాన్ని తలచుకుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి గుంటూరు వరకు కోడెల భౌతికకాయం వెంటే చంద్రబాబు కూడా వచ్చారు. అయితే, ఇదంతా కోడెల బతికుండగా, ఆయనకు అండగా నిలిచి ఉంటే కోడెల బతికుండేవారని అనుకుంటున్నారు. కనీసం కోడెలను జగన్ ప్రభుత్వం వేధిస్తోందంటూ నిన్న పెట్టినట్లు ...కనీసం మూడ్రోజులు ముందు చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టుంటే ఆయన బతికేవారని, ఆత్మహత్య నిర్ణయం తీసుకుని ఉండేవారు కాదని అంటున్నారు.