ఒక పరాజయం 100 తప్పులు.. టీడీపీని ముంచేసిన వారసులు!

 

తెలుగుదేశం పార్టీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అని స్వర్గీయ ఎన్టీఆర్ ఘనంగా ప్రకటించారు. కానీ తరువాత పరిస్థితి మారిపోయింది. కొన్నేళ్లుగా టీడీపీలో వారసుల హవా నడుస్తోంది. టీడీపీకి కూడా వారసత్వ పార్టీ ముద్ర పడింది. ఓ రకంగా టీడీపీ ఘోర పరాజయంలో వారసత్వం కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు.

దాదాపు ప్రతి జిల్లాలో టీడీపీ ఒకటి-రెండు కుటుంబాల చేతిలో బందీ అయిపోయింది. నాయకులు.. తమ సోదరులనో, తనయులనో, బంధువులనో పార్టీలోకి తీసుకొచ్చి.. మిగతా వారిని నాయకులుగా ఎదగనివ్వకుండా చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి కార్యకర్త స్థాయి నుంచి ద్వితీయ శ్రేణి నేత వరకు ఎదిగిన వారు.. వారసుల మూలంగా నాయకులు కాలేకపోతున్నారు. నిజంగా నాయకత్వ లక్షణాలుంటే వారసుడ్ని పరిచయం చేయడంలో తప్పులేదు. అలా కాకుండా 'పాలించడం మా హక్కు, పార్టీ మా సొత్తు అన్నట్టుగా' ఎటువంటి అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి.. పార్టీ మీద, ప్రజల మీద రుద్దాలని చూడకూడదు. కానీ టీడీపీలో కొందరు అదే చేసారు . కేవలం వారసత్వం అనే ట్యాగ్ తో పార్టీలోకి వచ్చి కొందరు టికెట్లు సాధించారు. వారు ఓడిపోయి, పార్టీని ఓడించారు.

వారసత్వ రాజకీయాల విషయంలో బాబు కూడా ఏం చేయలేకపోయారు. తన తనయుడు లోకేష్ ని తీసుకొచ్చి డైరెక్ట్ గా మంత్రిని చేసేయడంతో.. మిగతా నేతల వారసులకు కూడా పార్టీలో ప్రాధాన్యత ఇవ్వక తప్పలేదు. లోకేష్ కూడా పార్టీలో యువతికి ప్రాధాన్యం ఇస్తామంటూ.. వారసులకు ఇచ్చారు తప్ప, కొత్తవారిని ఎంకరేజ్ చేసిన దాఖలాలు లేవు. ఇక మహానాడులో వారసుల హడావుడి అంతాఇంతా కాదు. వారే పార్టీ భవిష్యత్ అన్నట్లు ప్రమోట్ చేసేవారు. ఇటువంటి చర్యల వల్ల నిజాయితీగా పార్టీ కోసం కష్టపడిన శ్రేణులు పార్టీకి దూరమయ్యాయి. తరువాత పార్టీ అధికారానికే దూరమైంది.