జగన్ ఢిల్లీ టూర్ కి PKయే కారణమట? మోడీ-షానే పిలిచారని ప్రచారం

ప్రశాంత్‌ కిశోర్ అలియాస్ పీకే. ఎన్నికల వ్యూహకర్తగా దేశంలో పాపులరైన పర్సన్. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా పనిచేసి ఆనాటి కమల విజయంలో కీలక పాత్ర పోషించడంతో మొదలైన పీకే ప్రస్థానం అప్రతిహాతంగా కొనసాగుతోంది. ఆ తర్వాత కాంగ్రెస్ తో కలిసి పనిచేసి పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో హస్తం పార్టీ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. అలాగే, బీహార్లో జేడీయూ... ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ... ఢిల్లీలో ఆప్ కోసం పనిచేసి ఆ పార్టీల ఘన విజయానికి కారణమయ్యాడు. అయితే, జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ తో వచ్చిన విభేదాలతో ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ప్రశాంత్ కిశోర్.... మోడీ అండ్ నితీష్ లక్ష్యంగా కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న చర్చ ఢిల్లీ వీధుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 

ముఖ్యంగా, తన సొంత రాష్ట్రంలో బీహార్ రాజకీయాల్లో కీ రోల్ పోషించేందుకు సిద్దమవుతున్నారన్న చర్చ జరుగుతోంది. జేడీయూ నుంచి బహిష్కృతుడైన పీకే, అటు జేడీయూ, ఇటు బీజేపీ మీద కసితో రగిలిపోతున్నారు. బీహార్‌లో ప్రాంతీయ పార్టీ పెట్టి, అదే వేదికగా, దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకంచేసి, మోడీ అండ్ అమిత్‌ షాలకు చెక్‌ పెట్టాలనుకుంటున్నారని, అందులో భాగంగా ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీల కూటమి ప్రకటించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే, ఇప్పుడు అత్యంత ఆసక్తి కలిగిస్తోంది. 

అయితే, జగన్‌కు పీకే అత్యంత క్లోజ్. దాంతో, ప్రాంతీయ పార్టీల కూటమిలో చేరాల్సిందిగా జగన్‌ను కోరే అవకాశముంది. ఆమ్‌ ఆద్మీ ఎలాగూ ఓకే చెప్పొచ్చు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతోనూ పీకేకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇక, తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్‌తోనూ ప్రశాంత్ పని చేయబోతున్నారు. ఇలా బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటితోనూ ప్రశాంత్‌ కిశోర్‌కు మంచి సంబంధాలున్నాయి. దాంతో, ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో మోడీ అండ్ షాకి తడాఖా చూపాలని స్కెచ్ వేస్తున్నారట పీకే. ఇందులో భాగంగానే తనకు అత్యంత సన్నిహితునిగా భావించే జగన్‌ను సైతం, ప్రాంతీయ కూటమిలో చేరాలని కోరాడని, అదే ఇప్పుడు కమలంలో అలజడి కారణమైందని అంటున్నారు.

ప్రశాంత్ కిశోర్‌ ఫ‌్రంట్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ చేరొద్దని జగన్‌ పై బీజేపీ అధిష్టానం ఒత్తిడి తెస్తోందని అంటన్నారు. ఇప్పడున్నట్టే ఏ కూటమిలోనూ చేరకుండా, తటస్థంగా ఉండాలని సూచించిందట. అందుకే జగన్‌ను ఢిల్లీ పిలిపించుకుని మాట్లాడుతోందని అంటున్నారు. అటు కేసీఆర్‌ను సైతం పీకే ప్రతిపాదిత ఫ్రంట్‌లో చేరొద్దని సూచించబోతోందట. బీజేపీ బుజ్జగింపులకు జగన్‌ సైతం ఓకే చెప్పారని అంటున్నారు. అంతేకాదు, ఎన్డీఏ నుంచి శివసేన బయటికి వెళ్లిపోయినందున, మరో బలమైన మిత్రపక్షం కోసం చూస్తున్న బీజేపీ, కేంద్ర ప్రభుత్వంలో చేరాలని వైసీపీని ఒత్తిడి చేస్తున్నారట. విజయసాయిరెడ్డితోపాటు మరో కీలక వ్యక్తికి కేంద్రమంత్రి పదవులు ఇస్తామమని ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. మొత్తంగా వీటన్నింటిపైనా చర్చించేందుకే, జగన్ ఒక్కరోజు గ్యాప్ లో రెండుసార్లు ఢిల్లీ వెళ్లారని అంటున్నారు.